
ఆర్థిక సంవత్సరం 2025 ప్రారంభం నుంచి ముగింపు వరకు మీకున్న అన్నీ బ్యాంకు అకౌంట్లలో వ్యవహారాలు జమలు/ఖర్చులు.. అంటే క్రెడిట్‌లు/డెబిట్‌లు.. అన్నీ విశ్లేషించిన తర్వాత మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి.
➤ఏఏ ఆదాయం వచ్చింది?
➤జమ ఆదాయమా కాదా?
➤ఆదాయం అయితే దాని స్వభావం ఏమిటి?
➤జీతమా.. అద్దె? వ్యాపారం మీద వచ్చిందా., వృత్తి వలన వచ్చిందా? క్యాపిటల్ గెయిన్స్ ద్వారా వచ్చిందా? ఇతర ఆదాయమా?
➤ఆదాయం కాకపోతే దేని నిమిత్తం వచ్చింది?
➤ఎవరు ఇచ్చారు? లేదా మీరే చెల్లించారా?
➤వారి వివరాలు.. ఎవరు.. ఎందుకు, ఎలా కావాలి..? ఇక విషయానికొద్దాం..
చట్ట ప్రకారం ప్రతి బ్యాంకు దగ్గర ఉన్న కస్టమర్ పొదుపు ఖాతా(సేవింగ్ బ్యాంకు)లో జమలు.., నగదు ఖాతాలు, నగదు డిపాజిట్లు ఒక ఆర్థిక సంవత్సర కాలంలో రూ.10,00,000 దాటితే ఈ వ్యవహారాలన్నీ ఇన్‌కం టాక్స్ వారికి ఒక రిటర్ను ద్వారా తెలియజేయాలి. డిపార్ట్‌మెంట్ వారు జారీ చేసిన సర్క్యూలర్ ప్రకారం ప్రతి జమ పంపాల్సిన అవసరం లేదు. కానీ సంవత్సర కాలం నగదు, జమ వెరసి మొత్తం ఎంతో తెలియజేయమన్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి సంబంధించి ఈ సమాచారం పంపుతారు. దానికి తుది గడువు తేదీ 31.5.2025.
ఇవన్నీ డిపార్ట్‌మెంట్‌కి చేరిన తర్వాత వారు ఒక పట్టిక తయారుచేస్తారు. ఇది మామూలు పట్టిక కాదు. మిమ్మల్ని పూర్తిగా పట్టించే పట్టిక. దీనినే ఏఐఎస్(యాన్యువల్ ఇన్‌కం స్టేట్‌మెంట్) అంటారు. ఇందులో ఏమి ఉంటాయంటే జీతం, ఇంటి అద్దె, నగదు జమలు, రూ.50వేలు బ్యాలెన్స్ దాటిన ప్రతి బ్యాంకు అకౌంట్ నిల్వలు, నగదు చెల్లింపులు, క్రిడెట్ కార్డు వివరాలు, డెబిట్ కార్డు వివరాలు, డివిడెండ్లు, బ్యాంకు ద్వారా వచ్చిన వడ్డీ, మీరు చేసిన డిపాజిట్లు, డిపాజిట్ల మీద వడ్డీ, షేర్ల క్రయవిక్రయాలు, మ్యూచువల్ ఫండ్ల కొనుగోలు, అమ్మకాల వడ్డీ, చెక్కులతో ఏం కొన్నారో వివరాలు, ప్రావిడెంట్ ఫండ్ ద్వారా వచ్చింది, ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా వచ్చింది, ఇన్‌కం టాక్స్ రిఫండ్ మీద వచ్చిన వడ్డీ, అద్దె చెల్లింపులు, విదేశీ ప్రయాణ చెల్లింపులు, స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు, విదేశాల నుంచి వచ్చిన డబ్బులు, ఇతర ఆస్తుల నుంచి వచ్చే అద్దెలు, లాటరీలు, గవర్నమెంట్ బాండ్లు, నాన్ రెసిడెంట్ల మీద వచ్చిన ఆదాయం, ల్యాండ్ అమ్మకాలు, ఆఫ్‌లైన్ డెబిట్లు, క్రెడిట్లు వ్యాపార ఆదాయం, వృత్తి మీద ఆదాయం, వ్యాపార ఖర్చులు, చిల్లర చెల్లింపులు, వాహన కొనుగోలు, ట్రస్ట్ మీద ఆదాయం..
ఇలా ఇదో పెద్ద జాబితా.. మీ ఖాతా.., ఏదీ వదలిపెట్టరు. ‘పన్ను ఎగవేత’ ప్లానింగ్‌కు తిలోదకాలు ఇవ్వాలి. సుందరకాండలో హనుమంతుల వారు సీతాదేవీ అన్వేషణలో నాలుగు అంగుళాల జాగా కూడా వదిలిపెట్టలేదు అలా ఉంటుంది డిపార్ట్‌మెంట్ వైఖరి. వారి వద్ద ఉన్న సమాచారం కాగితాల ప్రకారం కొన్ని వేల కోట్ల కాగితాలు.
బైనరీ కోడ్ యూనిట్లలో చెప్పాలంటే కిలో బైట్లు, మెగా బైట్లు, గిగా బైట్లు.., ఇన్ని బైట్లుంటే మన పాట్లు ఏమని చెప్పాలి? అరకొర సిబ్బందే కానీ కోరలు తీయించే సాధనాలు. వేగం, ఖచ్చితత్వం, భద్రత, నిజం, ఋజువుల సహితం సంకట పరిస్థితి. మళ్లీ అందులోనే ఆటవిడుపు. జాలి గడువు. హెచ్చరిక, బోధన, శోధన, మనకు రోదన. దీనికి తగ్గట్లుగా మనం కూడా అన్ని వ్యవహారాలూ ఆన్‌లైన్ చేస్తున్నాం. గురుత్వాకర్షణ శక్తి రాయి కిందకు పడినట్లు సమాచారం పడవలిసిన వారి చేతుల్లోనే పడింది. మనం బయట పడాలంటే ‘విషయానికి’ మన నిజాయితీ జతకట్టాలి.
ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య