గ్యాస్ ‘కష్టాలు’ బదిలీ | Gas 'difficulties' transfer | Sakshi
Sakshi News home page

గ్యాస్ ‘కష్టాలు’ బదిలీ

Published Fri, Jan 2 2015 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM

గ్యాస్ ‘కష్టాలు’ బదిలీ

గ్యాస్ ‘కష్టాలు’ బదిలీ

నేటి నుంచి నగదు బదిలీ పథకం అమలు
గ్యాస్ సిలిండర్ ధర రూ.752
కేంద్రం ఇచ్చే రాయితీ రూ.568
బుక్ చేయగానే అడ్వాన్స్ జమ

 
తిరుపతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన సంవత్సర కానుకగా గ్యాస్ లబ్ధిదారులకు కష్టాలను బదిలీ చేశారుు. గ్యాస్ రాయితీ నగదు గురువారం నుంచి లబ్ధిదారుల ఖతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రీ ఫిల్లింగ్ కోసం లబ్ధిదారుడు బుక్ చేసుకోగానే ఖాతాలో అడ్వాన్సు రూపంలో రూ.568 జమ చేస్తారు. పూర్తి ధర వెచ్చించి రీ ఫిల్లింగ్ చేయించుకున్నాకనే రాయితీని ఖాతాలో జమ చేస్తారు. అంటే ఇకపై గ్యాస్ సర్వీసు నంబరు, ఆధార్ కార్డు నంబరు, బ్యాంకు ఖాతా నంబరును అనుసంధానం చేసుకోని లబ్ధిదారులకు అందదు. అనుసంధానం చేసుకున్నా సాంకేతిక మార్పులు తలెత్తితే రాయితీ దక్కదు. యూపీఏ ప్రభుత్వం హయాంలో ఇదే పద్ధతిని అనుసరించినప్పుడు బీజేపీ, టీడీపీలో ఉద్యమాలు చేశారుు. నగదు బదిలీ పథకాన్ని రద్దు చేయాలని పట్టుబట్టారుు. ఇప్పుడు పార్టీల నేతృత్వంలోని ప్రభుత్వాలు పట్టుబట్టి నగదు బదిలీ పథకాన్ని అమలుచేస్తోండటం గమనార్హం.

అప్పుడు ఉద్యమాలు.. ఇప్పుడు నీతులా..?

గ్యాస్ రాయితీకి నగదు బదిలీని వర్తింపజేయడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో జనానికి దన్ను బీజేపీ, టీడీపీలు భారీ ఎత్తున ఉద్యమాలు చేశాయి. డిసెంబర్ 3, 2013న గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. కేంద్రం అధికారాన్ని చేపట్టిన ఎన్‌డీఏ ప్రభుత్వం ఆదిలోనే గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేస్తామని నవంబర్ 10, 2014న ప్రకటించింది. జిల్లాలో జనవరి 1, 2015 నుంచి గ్యాస్ రాయితీని నగదు బదిలీ రూపంలో లబ్ధిదారులకు నేరుగా అందిస్తామని స్పష్టం చేసింది. జిల్లాలో 7.20 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు 6.79 లక్షల మంది లబ్ధిదారుల గ్యాస్ సర్వీసు, ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లను అనుసంధానం పూర్తిచేశారు. నేటికీ 41 వేల మంది లబ్ధిదారుల సీడింగ్‌ను పూర్తిచేయాల్సి ఉంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో లబ్ధిదారులు పూర్తి ధర వెచ్చించి గ్యాస్ సిలిండర్‌ను రీఫిల్లింగ్ చేయించుకున్నారు. ఆ రెండు నెలల రాయితీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జనవరిలో జమ చేస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.
 
బుక్ చేసుకోగానే అడ్వాన్సు జమ ..

 సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకోగానే లబ్ధిదారుడి ఖాతాలో అడ్వాన్సు రూపంలో రూ.568 ప్రభుత్వం జమ చేస్తుంది. ప్రస్తుతం 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ పూర్తి ధర రూ.752. కేంద్రం ఇచ్చే రాయితీ రూ.568. తొలి నెల మాత్రమే ప్రభుత్వం అడ్వాన్సు రూపంలో రాయితీని జమ చేస్తుంది. రెండో నెల నుంచి లబ్ధిదారుడు పూర్తి ధర వెచ్చించి గ్యాస్ సిలిండర్‌ను రీఫిల్లింగ్ చేసుకోవాలి. సంబంధిత డీలర్ సిలిండర్ డెలివరీ పత్రాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరిచితేనే లబ్ధిదారుడి ఖాతాలో రాయితీ జమ అవుతుంది.  డీలర్ డెలివరీ పత్రాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చకపోయినా.. సీడింగ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినా లబ్ధిదారుడికి రాయితీ దక్కదు.  విపక్షంలో ఉన్నప్పుడు వద్దన్న బీజేపీ, టీడీపీలు అధికారాన్ని చేజిక్కించుకోగానే నగదు బదిలీ ప్రవేశ పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement