సాక్షి, హైదరాబాద్: వంటగ్యాస్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ ధరలు అమలు చేయడాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ తప్పుపట్టింది. వంటగ్యాస్ సబ్సిడీ మొత్తంపైనా విలువ ఆధారిత పన్ను(వ్యాట్) విధించడం సమంజసం కాదంది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు పంపింది. ‘నగదు బదిలీ పథకం అమల్లో ఉన్న జిల్లాల్లోని వంటగ్యాస్ వినియోగదారులకు మొత్తం బిల్లుపై(సిలిండర్‌కు రూ.980మీద) రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ విధిస్తున్నాయి.
నగదు బదిలీ వర్తించని వారికి సబ్సిడీపోనూ వచ్చే బిల్లు(రూ.412)పైనే వ్యాట్ వసూలు చేస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ విధానంవల్ల నగదు బదిలీ పరిధిలోకి వచ్చేవారికి వంటగ్యాస్ సిలిండర్ ధర ఎక్కువగా ఉంటోంది. ఆధార్ అనుసంధానం చేసుకోనివారు చెల్లించే ధరకంటే.. అనుసంధానం చేసుకున్నవారు వంటగ్యాస్‌కు అధిక రేటు చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఆధార్ అనుసంధానానికి వినియోగదారులు ఆసక్తి చూపట్లేదు. ఇలా ఒకేరకమైన వంటగ్యాస్‌పై రెండురకాలుగా వ్యాట్ విధించడం సరికాదు. దీన్ని పరిగణనలోకి తీసుకుని సబ్సిడీ మొత్తానికి వ్యాట్‌ను మినహాయించాలి’’ అని లేఖలో కోరింది.
రాష్ట్రంలో పరిస్థితిదీ: రాష్ట్రంలో వంటగ్యాస్ విషయంలో ద్వంద్వ ధరలు అమల్లో ఉన్నాయి. నగదు బదిలీ పరిధిలోకి వచ్చిన 12 జిల్లాల్లోని వినియోగదారులకు వంటగ్యాస్ సిలిండర్‌పై ఇస్తున్న రూ.25 సబ్సిడీని రాష్ట్రప్రభుత్వం రద్దు చేసింది. అంతటితో సరిపెట్టుకోకుండా వినియోగదారులకు లభించే వంటగ్యాస్ ధరపైగాక మొత్తం బిల్లుపై (సిలిండర్‌కు రూ.980పై) వ్యాట్ బాదుతోంది. దీంతో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1,024.50 పడుతోంది. అంటే.. వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న రూ.558.30 సబ్సిడీపైనా రాష్ట్రప్రభుత్వం వ్యాట్ గుంజుతోందన్నమాట. దీంతో నగదు బదిలీ వర్తించనివారితో పోల్చితే ఈ పథకం వర్తించేవారికి ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.29 చొప్పున వ్యాట్ భారం అదనంగా పడుతోంది.
దీనివల్లే నగదు బదిలీ అమల్లో లేని జిల్లాల ప్రజలకు వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.412.70 (దీనిపై సుమారు రూ.22 వరకు వ్యాట్ పడుతుంది. అయితే రాష్ట్రప్రభుత్వం ఇస్తున్న రూ.25 సబ్సిడీ వర్తిస్తుండడంతో దాదాపు అదే ధరకు వినియోగదారులకు లభిస్తున్నది) ఉండగా నగదు బదిలీ అమల్లో ఉన్న జిల్లాల్లో మాత్రం ఏకంగా రూ.466 పడుతోంది. నగదు బదిలీ వర్తించేవారికి రాష్ట్రప్రభుత్వం రూ.25 సబ్సిడీ రద్దు చేయడం, దీనికితోడు అదనంగా రూ.29 వ్యాట్ విధించడమే ఇందుకు కారణం. దీనివల్ల వీరికి ఒక్కో సిలిండర్‌పై సుమారు రూ.53 చొప్పున అదనపు భారం పడుతోంది. ఒకే వంటగ్యాస్‌పై ఇలా రెండు ధరలు అమలు చేయడం దారుణమనే విమర్శలను రాష్ట్రప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ ద్వంద్వ విధానం సరికాదని, సబ్సిడీపై మినహాయించి వినియోగదారులకు పడే వంటగ్యాస్ రేటుపైనే వ్యాట్ విధించాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ తాజాగా ఆదేశాలు జారీచేయడం గమనార్హం.
వంటగ్యాస్ సబ్సిడీపై ‘వ్యాట్’ తొలగించాలి
Published Thu, Sep 19 2013 2:07 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM
Advertisement
Advertisement