సాక్షి,సిటీ బ్యూరో: విశ్వనగరం కోసం పరుగులు తీస్తున్న హైదరాబాద్ మహా నగరంలో ప్రతి ఇంటా వంట గ్యాస్ లక్ష్యానికి గండి పడింది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (దీపం) పథకం నత్తలకు నడక నేర్పిస్తోంది. రెండున్నరేళ్లుగా ఢిల్లీ, చంఢీఘర్ తరహాలో హైదరాబాద్‌ను ‘కిరోసిన్ ఫ్రీ‘ సిటీగా తీర్చిదిద్దేందుకు పౌరసరఫరాల శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు..రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. ఇంకా నిరుపేదలు కిరోసిన్‌పైనే ఆధారపడి వంటవార్పు కొన సాగించడం విస్మయానికి గురిచేస్తోంది. కనీసం ఆహార భద్రత (రేషన్) కార్డు లబ్ధిదారులనైనా గుర్తించి కనెక్షన్లు మంజూరు చేయించడంలో నగరంలోని పౌరసరఫరాల విభాగం పూర్తిగా విఫలమైంది. పౌరసరఫరాల శాఖ ఎల్పీజీ సిలిండర్ లేని కిరోసిన్ లబ్ధిదారులను గుర్తించి ప్రోసీడింగ్ జారీ చేస్తున్నా.. ఆయిల్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు మాత్రం కనెక్షన్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ఇదీ పరిస్ధితి...
మహా నగరంలో బీపీఎల్ కింద గుర్తించిన ఆహార భద్రత (రేషన్) కార్డు కలిగిన కుటుంబాలలో ఎల్పీజీ కనెక్షన్లు లేని కుటుంబాలపై పౌర సరఫరాల విభాగాలు దృష్టి సారించాయి. దీపం పథకం కింద కిరోసిన్ లబ్ధిదారులను గుర్తించినప్పటికీ వాటిలోనే సగం మందికి కనెక్షన్లు అందని ద్రాక్షగా మారాయి. నగరంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పౌరసరఫరాల విభాగాలు కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఉజ్వల యోజన (దీపం) పథకం కింద సుమారు 1,67,198 కుటుంబాలను గుర్తించాయి. అందులో 1,66,522 కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్లకు ఆమోదం తెలిపాయి. ఆయిల్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు మాత్రం 84,713 కుటుంబాలకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మిగిలిన ఎల్పీజీ ప్రొసీడింగ్స్ పెండింగ్‌లో పడిపోయాయి. పౌర సరఫరాల విభాగాలు సైతం జారీ చేసిన ప్రోసీడింగ్స్ గ్రౌండింగ్‌లను పర్యవేక్షించక పోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
అదనపు బాదుడు
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (దీపం) పథకం కింద గ్యాస్ కనెక్షన్ల జారీ సమయంలో ఆయిల్ కంపెనీలు లబ్ధిదారులపై అదనపు భారాన్ని మోపుతున్నాయి. నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్ జారీ చేయాల్సి ఉంటుంది. గ్యాస్‌తో కూడిన సిలిండర్, పైపు, రెగ్యులేటర్లను అందించాల్సి ఉంటుంది. గ్యాస్ స్టౌవ్ కొనుగోలు లబ్ధిదారుడిపై ఆధారపడి ఉంటుంది. కానీ, డిస్ట్రిబ్యూటర్లు బలవంతంగా గ్యాస్ స్టౌవ్‌లను అంటగట్టి రెండింతలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు దీపం లబ్ధిదారుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న పౌర సరఫరాల శాఖ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
గ్రేటర్ పరిధిలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన (దీపం) పథకం అమలు ఇలా..
పౌరసరఫరాల విభాగం గుర్తింపు ఆమోదం ఇచ్చిన కనెక్షన్లుజిల్లాల వారీగా)
హైదరాబాద్ 1,13,992 1, 13,964 57,824
రంగారెడ్డి 32,018 31,753 18,469
మేడ్చల్ 21,188 20,805 8,420
Comments
Please login to add a commentAdd a comment