దేశం కోసం సబ్సిడీ వదులుకో! | Aadhaar-linked gas subsidy caught in legal tangle | Sakshi
Sakshi News home page

దేశం కోసం సబ్సిడీ వదులుకో!

Published Fri, Aug 1 2014 1:27 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

దేశం కోసం సబ్సిడీ వదులుకో! - Sakshi

దేశం కోసం సబ్సిడీ వదులుకో!

స్వచ్ఛందంగా ముందుకు రావాలని గ్యాస్ కంపెనీలతో కేంద్రం ప్రచారం
దేశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపు
ఆధార్ వివరాల ఆధారంగా వినియోగదారులకు సందేశాలు
ఆన్‌లైన్‌లోనే సబ్సిడీని వదులుకునే ఏర్పాటు

 
సాక్షి, హైదరాబాద్: వంట గ్యాస్‌పై సబ్సిడీని పేద వర్గాలకే  పరిమితం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై గ్యాస్ సబ్సిడీ పెనుభారంగా మారిన నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి వారితోనే ‘స్వచ్ఛంద గ్యాస్ సబ్సిడీ ఉపసంహరణ’ హామీని పొందే దిశగా తొలి అడుగు వేసింది. ‘మాతో కలిసి రండి.. దేశ నిర్మాణం దిశగా’ అంటూ ప్రజల్లో జాతీయ భావాలను ప్రేరేపించే ప్రయత్నం చేస్తోంది. తద్వారా గ్యాస్ సబ్సిడీ నుంచి అధికాదాయవర్గాలను స్వచ్ఛందంగా దూరం చేయాలని చూస్తోంది. ఈ మేరకు చమురు సంస్థలకు ఇప్పటికే ఆదేశాలు అందాయి.
 
 తదనుగుణంగా ఆయా కంపెనీలు గ్యాస్ వినియోగదారులను ‘చైతన్యం’ చేసే దిశగా కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇప్పటి కే ఆధార్ కార్డులు పొంది, గ్యాస్ కనెక్షన్లతో అనుసంధానం చేసుకున్న వినియోగదారుల నుంచి అధికాదాయ వర్గాలను గుర్తిస్తున్నాయి. వారి మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సందేశాలు(ఎస్‌ఎంఎస్) పంపిస్తున్నాయి. ఆయా గ్యాస్ కంపెనీల వెబ్‌సైట్లలోనూ ఈ మేరకు ‘ఆప్ట్ అవుట్ సబ్సిడీ’ పేరుతో కేటగిరీని ఏర్పాటు చేశాయి. సబ్సిడీ అవసరం లేదనుకునే వినియోగదారులు ఇందులో స్వచ్ఛందంగా తమ గ్యాస్ కనెక్షన్ నంబర్, గ్యాస్ కంపెనీ డీలర్ పేరును పొందుపరిస్తే, మరుసటి నెల నుంచి సబ్సిడీ లేని వంట గ్యాస్ సిలిండర్‌ను అందించే ఏర్పాట్లు చేశాయి.
 
 దేశభక్తిని ప్రేరేపిస్తూ...:  ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపిస్తూ సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు చమురు కంపెనీలు తమ వెబ్‌సైట్లను వేదికగా మార్చుకున్నాయి. స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తూ ‘గివ్ అప్ సబ్సిడీ’  లింక్‌ను ఆప్షన్‌గా ఇచ్చాయి. ఈ లింక్‌ను క్లిక్ చేసి ఎవరైనా స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకోవచ్చు. అలా చేసిన వారి పేర్లను ‘స్క్రోల్ ఆఫ్ ఆనర్’ కింద గ్యాస్ కంపెనీలు తమ వెబ్‌సైట్లలో పొందుపరిచి గౌరవించనున్నాయి.
 
 స్పందన అంతంత మాత్రమే!
 సబ్సిడీని వదులుకోవాలంటూ ఆయిల్ కంపెనీల ప్రచారం ఇటీవలే మొదలైంది. అయితే దేశవ్యాప్తంగా పెద్దగా స్పందన కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మొబైల్‌ఫోన్ల ద్వారా ‘చైతన్యం’ తీసుకొచ్చే కార్యక్రమానికి ఆ సంస్థలు శ్రీకారం చుట్టాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఇండేన్ గ్యాస్ వినియోగదారుల్లో 1,470 మంది నాన్ సబ్సిడీకి స్వచ్ఛందంగా ముందుకు రాగా, రూ. 88.20 లక్షలు ఆదా అయినట్లు ఆ కంపెనీ పేర్కొంది. భారత్ గ్యాస్ వినియోగదారుల్లో 406 మంది సబ్సిడీని వదులుకోవడంతో రూ. 24.36 లక్షలు మిగిలాయి. హెచ్‌పీ గ్యాస్‌కు సంబంధించి 368 మంది వల్ల రూ. 22.08 లక్షలు ఆదా అయ్యాయి. కాగా, సబ్సిడీతో కూడిన వంట గ్యాస్ ప్రస్తుతం రూ. 450కి లభిస్తుండగా, సబ్సిడీ లేని సిలిండర్ ధర రూ. 1,100గా ఉంది. మొత్తానికి ఆయిల్ కంపెనీల సంక్షిప్త సమాచారాలతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement