విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో 8.3 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని వినియోగదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి జిల్లాలో నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోంది.
వాస్తవానికి డిసెంబర్ 31వ తేదీ గడువు ముగిసినా ఆధార్‌పై స్పష్టత లేకపోవడంతో ఎవరూ నగదు బదిలీకి ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం గడువును జనవరి 31వ తేదీ వరకు పొడిగించింది. కానీ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. ఇప్పటికీ కేవలం 25 శాతం మంది వినియోగదారులు మాత్రమే నగదు బదిలీకి ఆధార్, గ్యాస్, బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసుకున్నారు.
ఇంకా 6.18 లక్షల మంది చేయించుకోవాల్సి ఉంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి గ్యాస్ సలిండర్‌ను మార్కెట్ ధర రూ.1327కు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సంక్షేమ పథకాలకు ఆధార్‌కార్డును తప్పని సరి చేయడం సరికాదని సుప్రీం కోర్టు చెప్పినా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గలేదు.
నిన్న మొన్నటి వరకు నగదు బదిలీ పథకానికి ఆధార్ తప్పని సరా?.. కాదా? అన్న మీమాంస కొనసాగినా ప్రస్తుతం మాత్రం ఆధార్ లేకపోతే నగదు బదిలీ పథకం వర్తించదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆధార్ కారణంగా బోగస్ గ్యాస్ కనెక్షన్లు వెలుగులోకి వస్తాయని, తద్వారా ప్రభుత్వంపై సబ్సిడీ భారం తగ్గుతుందని పేర్కొంటున్నారు.
ఆధార్‌పై ప్రాంతీయ సదస్సు
ఆధార్‌పై మరో పది రోజుల్లో జిల్లాలో ప్రాంతీయ సదస్సు నిర్వహించనున్నారు. వాస్తవానికి గత నెలలో ఈ సమావేశం జరగాల్సి ఉన్నా తుపాను కారణంగా వాయిదా పడింది. తాజాగా అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ఈ సమావేశం జరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
ఇందులో ఆధార్‌పై స్పష్టతతో పాటు నగదు బదిలీని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఆధార్ కేవలం నగదు బదిలీ పథకానికి మాత్రమే కాకుండా అన్ని సంక్షేమ పథాకలకు తప్పనిసరి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అదే ఆధార్
Published Fri, Jan 17 2014 4:27 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement