ఆధార్ అనుసంధానంపై సుప్రీంలో కేంద్రం వాదనలు
సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్లు, బ్యాంక్ ఖాతాలతో ఆధార్ అనుసంధానంపై సుప్రీం కోర్టు అభ్యంతరాను తోసిపుచ్చేందుకు కేంద్రం ఆసక్తికర వాదనను ముందుకుతెచ్చింది. ఆధార్ అనుసంధానమంటే పౌరులందరినీ అనుమానించడం కాదని, ఇది ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణీకులందరినీ తనిఖీ చేసిన తరహాలోనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించింది. అవకతవకలను అరికట్టేందుకు ప్రభుత్వం ఓ పద్ధతిని అనుసరిస్తే అది అందరూ అక్రమాలకు పాల్పడతారని కాదని యూఐడీఏఐ తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎం కాన్విల్కర్, జస్టిస డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్‌భూషణ్‌లతో కూడిన సుప్రీం బెంచ్‌కు స్పష్టం చేశారు. డ్రగ్ సరఫరాదారులకు చెక్ పెట్టేందుకు ప్రతిఒక్కరి బ్యాగేజ్‌ను తనిఖీ చేయాలన్న నిర్ణయం అమాయకులపై ఎలాంటి ప్రభావం చూపలేదన్న అమెరికన్ అత్యున్నత న్యాయస్ధానం తీర్పును ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
లక్షల మందిలో ఒకరో ఇద్దరో అభ్యంతరకర వస్తువులను కలిగిఉన్నా ప్రయాణీకులందరినీ ఎయిర్‌పోర్టుల్లో తనిఖీ చేస్తారని మెహతా పేర్కొన్నారు. విమానాశ్రయాల్లో ప్రయాణీకులందరినీ తనిఖీ చేయడమంటే ప్రతి ఒక్కరినీ అధికారులు అనుమానంగా చూస్తున్నారని కాదని చెప్పుకొచ్చారు. బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్లు, ఐటీ రిటన్స్‌తో ఆధార్ అనుసంధానం ఫలితంగా ప్రభుత్వం రూ 37,000 కోట్ల పన్ను రహిత నగదును పసిగట్టిందని చెప్పారు. ప్రజలంతా పన్ను ఎగవేతదారులు కాదని, ఆధార్ అనుసంధానం ద్వారా పన్ను పరిధి నుంచి ఎగవేతదార్లు తప్పంచుకోకుండా చూడవచ్చని మెహతా పేర్కొన్నారు. అయితే ఆధార్ లింకేజ్‌ను, ఎయిర్‌పోర్ట్ తనిఖీలతో కేంద్రం పోల్చడం సరైన ఉదాహరణ కాదని కోర్టు పేర్కొంది. ఏ కొద్ది మందో మనీల్యాండరింగ్‌కు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని, పౌరులందరి ఫోన్ నెంబర్లను కోరడం సహేతుకం కాదని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment