అనుమానం పెనుభూతం! ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ గుర్తింపు కార్యక్రమమైన మన ‘ఆధార్’ విశ్వసనీయతపై ఏళ్ళు గడిచినా ఇప్పటికీ ఏవో అనుమానాలు వస్తూనే ఉన్నాయి. భారత సర్కార్ ఎప్పటికప్పుడు ఆ అనుమానాల్నీ, ఆరోపణల్నీ కొట్టిపారేస్తున్నా అవి మాత్రం ఆగడం లేదు. ప్రపంచశ్రేణి రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తన తాజా నివేదికలో ఆధార్ భద్రత, వ్యక్తిగత గోప్యతలపై లేవనెత్తిన ప్రశ్నలతో ఈ అంశం మరోసారి తెర మీదకు వచ్చింది.
ఎలాంటి సాక్ష్యాధా రాలూ పేర్కొనకుండా, అర్థం లేని ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ ప్రభుత్వం సహజంగానే ఈ నివేదికను కొట్టిపారేసింది. అయితే, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద శ్రామికులకు జరిపే చెల్లింపులు సహా సమస్తం ఇకపై ఆధార్‌తోనే జరపాలని ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్ని స్తున్న వేళ మూడీస్ నివేదికలోని మాటలు కొంత ఆందోళన రేపుతున్నాయి. సత్వరమే ఆ అనుమా నాల్ని నివృత్తి చేసి, ఆధార్ సందేహాతీతమైనదని మరోసారి చాటాల్సిన అవసరం ఏర్పడింది.
న్యూయార్క్ కేంద్రంగా నడిచే రేటింగ్ ఏజెన్సీ మూడీస్ గురువారం విడుదల చేసిన పరిశోధనా నివేదిక ఆ మధ్య కొత్తగా రంగప్రవేశం చేసిన ‘వరల్డ్ కాయిన్’తో మన ఆధార్‌ను పోల్చింది. విస్తృత పరిమాణం, సృజనాత్మక ఆలోచన రీత్యా రెండూ ప్రత్యేకంగా నిలిచాయని ప్రశంసించింది. అయితే, భద్రత, గోప్యతలే అసలు సమస్యలంటూ కొన్ని ప్రాథమికమైన ప్రశ్నలు వేసింది.
ఉష్ణోగ్రత, ఉక్క పోత ఎక్కువగా ఉండే చోట ఆధార్ లాంటి బయోమెట్రిక్ సాంకేతిక పరిజ్ఞానం ఏ మేరకు సమర్థంగా పనిచేస్తుందన్నది సదరు నివేదిక అనుమానం. ఆధార్ ధ్రువీకరణలో ఇబ్బందుల వల్ల పలుమార్లు సేవలు అందడం లేదనేది దాని వాదన. అన్నిటి కన్నా ముఖ్యంగా, ఆధార్ వ్యవస్థ సురక్షితమేనా, అందులోని వ్యక్తిగత సమాచారం గోప్యమేనా అన్నది మూడీ సంధిస్తున్న ప్రశ్న.
దేశంలో 120 కోట్లమందికి పైగా బయోమెట్రిక్, జనసంఖ్యా సంబంధ వివరాలను ఈ ఆధార్ బృహత్ యజ్ఞంలో నమోదు చేశారు. ఎవరికి వారికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించారు. వేలిముద్రలు, కనుపాపల స్కానింగ్, వన్‌టైమ్ పాస్‌వర్డ్ లాంటì పద్ధతుల్లో వ్యక్తులు తమ గుర్తింపును నిర్ధారించి, ప్రభుత్వ, ప్రైవేట్ సేవలను అందుకొనే వీలు కల్పించారు.
మొదట కొంత తటపటాయింపు ఉన్నా, క్రమంగా ఆధార్ నమోదు, దాని వినియోగం విస్తరించింది. బలహీనవర్గా లకు అందించే ప్రభుత్వ సహాయాలకే కాదు... చివరకు బ్యాంకు ఖాతాల ఆరంభం, మొబైల్ కనెక్షన్, పన్నుల చెల్లింపు సహా అనేక రోజువారీ పనులకు సైతం ఆ నంబర్ తప్పనిసరైంది. దళారుల బాధ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే సంక్షేమ పథకాల సాయం అందేలా ఆధార్ బాట వేసింది.
ఆధార్ వ్యవహారాలన్నీ చూసే కేంద్ర సంస్థగా ‘భారత యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ’ (యూఐడీఎఐ) వ్యవహరిస్తోంది. చిత్రం ఏమిటంటే, సదరు సంస్థకు నాలుగేళ్ళుగా నాధుడు లేడు. ఎట్టకేలకు గత నెలలో ప్రభుత్వం ఓ తాత్కాలిక ఛీఫ్‌ను నియమించింది. ఇలాంటి చర్యలు ఆధార్ నిర్వహణ పట్ల పాలకుల చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
అలాగే, ఈ సంస్థపై ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా’ (కాగ్) నిరుడు విడుదల చేసిన నివేదిక సైతం ఆధార్ నమోదు ప్రక్రియలో లోపాలు, తప్పుడు బయోమెట్రిక్ లాంటి అనేక అంశాలను ఎత్తిచూపడం గమనార్హం. ఆధార్‌లో నమోదైన సమాచారపు భద్రత, వ్యక్తిగత గోప్యత గాలికి పోయే ప్రమాదాన్ని హెచ్చరించింది. ఇవాళ్టి మూడీస్ నివేదిక కన్నా చాలా ముందే మన ‘కాగ్’ వ్యక్తం చేసిన ఈ భయాలపై ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నదీ సమాచారం లేదు.
కేంద్రంలో గడచిన ‘ఐక్య ప్రగతిశీల కూటమి’ (యూపీఏ) ప్రభుత్వ హయాంలో ఆరంభమైన ప్పటి నుంచి ఆధార్‌పై భిన్న వాదనలు వస్తూనే ఉన్నాయి. ఆధార్‌కు అనేక సానుకూలతలు ఉన్నప్ప టికీ ఈ ప్రక్రియ, వినియోగం నిర్దుష్టమైనదేమీ కాదని సర్కార్ నుంచి సామాన్యుల దాకా అందరికీ తెలుసు. ఇవాళ్టికీ గ్రామీణ భారతావనిలో డిజిటల్ గుర్తింపు చూపలేనివారికి రేషన్ అంద ట్లేదనీ, కొన్ని ఆకలి చావులకు అదీ ఒక కారణమనీ వార్తలొచ్చాయి.
ఆధార్ లోపానికీ, ఆ చావులకూ కారణం లేదన్న ఖండనలూ విన్నాం. అయితే, అతిగా టెక్నాలజీపై ఆధారపడి, సాయం పొందా ల్సినవారిని తృణీకరించడం, అసలు లక్ష్యాన్ని విస్మరించడం అమానవీయతే! రోజూ పనిపాటలతో శ్రమించే వారి చేతిరేఖలు చెరిగిపోతే అది వారి పాపమా? కంటిపాపల స్కానింగ్, వన్‌టైమ్ పాస్‌వర్డ్ లాంటివి కూడా ఉన్నా నెట్ సౌకర్యం లేని సుదూర గ్రామీణ ప్రాంతాల్లో వాటి మీద పూర్తిగా ఆధారపడలేం.
అలాగే, అంచెలంచెల సైబర్ భద్రత ఉందని సర్కారు చెబుతున్నప్పటికీ, అనేక సందర్భాల్లో ఆధార్ సమాచారం గంపగుత్తగా లీకవడం చూశాం. ఈ సమాచార నిధి సైబర్ దొంగల చేతిలో పడితే పర్యవసానాలూ తీవ్రమే! అందుకే, లోపాలను ప్రస్తావించినవారిని నిందించే కన్నా, వాటిని సరిదిద్దడంపై దృష్టి పెట్టడం తక్షణ కర్తవ్యం. ముఖ్యంగా ప్రస్తుతం నడుస్తున్న కేంద్రీకృత విధానం బదులు సమాచార గోప్యత, రక్షణ కోసం మూడీస్ సూచించినట్లుగా ఆధార్‌కు వికేంద్రీకరణ విధానాన్ని అవలంబించడం మంచిదేమో చూడాలి.
తద్వారా ఒక అంచెలో ఉల్లంఘన జరిగినప్పటికీ, అక్కడితో నష్టనివారణ చేయగలమని గుర్తించాలి. ఇటీవల జీ–20లోనూ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)లో అద్భుతమంటూ మనం చెప్పుకున్న ఆధార్ వ్యవస్థపై సమగ్ర సమీక్ష జరపాలి. పూర్తి లోపరహితంగా మార్చే పని మొదలుపెట్టాలి. ఓటర్ల జాబితా సహా సమస్తానికీ ఆధారంగా అనుసంధానించాలని అనుకుంటున్న వేళ అది మరింత అవసరం.
పటిష్ఠతే పరమావధి!
Published Thu, Sep 28 2023 12:20 AM | Last Updated on Thu, Sep 28 2023 9:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment