న్యూఢిల్లీ : ఆధార్ కార్డును ప్రతి ఒక్క అవసరానికి తప్పనిసరి చేయడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ఆధార్ కార్డు తప్పనిసరిపై సుప్రీంకోర్టులో వాదనలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ సిమ్ పొందడానికి ఆధార్ కార్డు అవసరం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ విషయంపై కేంద్రం టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీచేసింది. ప్రత్యామ్నాయ డాక్యుమెంట్లు డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డు వంటి డాక్యుమెంట్లతో సిమ్ కార్డును ఇవ్వాలని టెలికాం కంపెనీలను కేంద్రం ఆదేశించింది. వినియోగదారులకు అసౌకర్యం కలిగించకుండా వెంటనే ఈ ఆదేశాలను అమలు చేయాలని టెలికాం సెక్రటరీ అరుణ్ సుందరరాజన్ తెలిపారు.
తమ తుది నిర్ణయం వచ్చే వరకు సిమ్ కార్డులకు ఆధార్ సమర్పించడం తప్పనిసరి సరికాదని అపెక్స్ కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ‘అన్ని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీచేస్తున్నాం. ఆధార్ నెంబర్ లేదని వినియోగదారులకు సిమ్ కార్డు ఇవ్వడాన్ని నిరాకరించవద్దు. ఇతర కేవైసీ దరఖాస్తులు, డాక్యుమెంట్లను సమర్పించాలని కోరండి. సిమ్ కార్డుల జారీని కొనసాగించండి’ అని సుందరరాజన్ తెలిపారు. అంతకముందు టెలికాం డిపార్ట్‌మెంట్ ఇచ్చిన ఆదేశాలతో మొబైల్ కంపెనీలు ఆధార్ వెరిఫికేషన్‌ను చేపడుతున్నాయి. ఈ నిర్ణయం నుంచి ఎన్‌ఆర్‌ఐలకు, విదేశీయులకు మినహాయింపు ఇచ్చింది. ఈ ఆదేశాలపై స్పందించడానికి మొబైల్ ఆపరేటర్లు నిరాకరించాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment