mobile sim card
-
కేంద్రం ఆదేశం : ఆధార్ అవసరం లేదు
న్యూఢిల్లీ : ఆధార్ కార్డును ప్రతి ఒక్క అవసరానికి తప్పనిసరి చేయడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ఆధార్ కార్డు తప్పనిసరిపై సుప్రీంకోర్టులో వాదనలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ సిమ్ పొందడానికి ఆధార్ కార్డు అవసరం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ విషయంపై కేంద్రం టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీచేసింది. ప్రత్యామ్నాయ డాక్యుమెంట్లు డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డు వంటి డాక్యుమెంట్లతో సిమ్ కార్డును ఇవ్వాలని టెలికాం కంపెనీలను కేంద్రం ఆదేశించింది. వినియోగదారులకు అసౌకర్యం కలిగించకుండా వెంటనే ఈ ఆదేశాలను అమలు చేయాలని టెలికాం సెక్రటరీ అరుణ్ సుందరరాజన్ తెలిపారు. తమ తుది నిర్ణయం వచ్చే వరకు సిమ్ కార్డులకు ఆధార్ సమర్పించడం తప్పనిసరి సరికాదని అపెక్స్ కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ‘అన్ని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీచేస్తున్నాం. ఆధార్ నెంబర్ లేదని వినియోగదారులకు సిమ్ కార్డు ఇవ్వడాన్ని నిరాకరించవద్దు. ఇతర కేవైసీ దరఖాస్తులు, డాక్యుమెంట్లను సమర్పించాలని కోరండి. సిమ్ కార్డుల జారీని కొనసాగించండి’ అని సుందరరాజన్ తెలిపారు. అంతకముందు టెలికాం డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆదేశాలతో మొబైల్ కంపెనీలు ఆధార్ వెరిఫికేషన్‌ను చేపడుతున్నాయి. ఈ నిర్ణయం నుంచి ఎన్ఆర్ఐలకు, విదేశీయులకు మినహాయింపు ఇచ్చింది. ఈ ఆదేశాలపై స్పందించడానికి మొబైల్ ఆపరేటర్లు నిరాకరించాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
మొబైల్ సిమ్ కార్డులకు ఇక ఆధార్!
అనుసంధానం కోసం పైలట్ ప్రాజెక్టు న్యూఢిల్లీ: మొబైల్ సిమ్ కార్డులకు ఆధార్ నంబర్‌ను అనుసంధానించే ప్రక్రియకు ప్రభుత్వం తెరతీస్తోంది. తద్వారా ఆధార్ కార్డుదారులకు మొబైల్ సిమ్ కార్డుల యాక్టివేషన్ వేగవంతం కానుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ(యూఐడీఏఐ) రూపొందించిన ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్(ఈ-కేవైసీ) సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షించే ప్రాజెక్టును త్వరలో చేపట్టనున్నట్లు టెలికం శాఖ(డాట్) ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ఐదు టెలికం కంపెనీల భాగస్వామ్యంతో లక్నో(ఎయిర్టెల్), భోపాల్(ఆర్‌కామ్), ఐడియా(ఢిల్లీ), వొడాఫోన్(కోల్‌కతా), బెంగళూరు(బీఎస్ఎన్ఎల్) నగరాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును నిర్వహించనున్నట్లు డాట్ వెల్లడించింది. ఈ-కేవైసీ సర్వీస్ ద్వారా బ్యాంకులు, టెలికం కంపెనీలు ఇలా ఇతరత్రా సర్వీసు ప్రొవైడర్లు వినియోగదారునికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లోనే తనిఖీ చేసేందుకు వీలవుతుంది. ఇందుకు ఆధార్ నంబర్, బయోమెట్రిక్ వివరాల ఆధారంగా వివరాలను సరిచూస్తారు. ప్రస్తుతం కస్టమర్ నుంచి ద్రువపత్రాలు ఇతరత్రా వివరాలన్నీ తీసుకున్న తర్వాత వాటిని తనిఖీ చేసి మొబైల్ సిమ్ కార్డు యాక్టివేషన్ చేసేందుకు కనీసం రెండు రోజుల వ్యవధి పడుతోంది. ఆధార్‌కు గనుక దీన్ని అనుసంధానం చేస్తే.. నిమిషాల వ్యవధిలోనే యాక్టివేషన్ పూర్తయ్యేందుకు వీలవుతుంది. జనవరిలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కావ చ్చని సమాచారం. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే దేశంలో ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయనున్నట్లు డాట్ వర్గాలు తెలిపాయి. కాగా, ప్రస్తుతం కస్టమర్ల ఐడెంటిటీ, అడ్రస్ ధ్రువీకరణకు కోసం అమల్లో ఉన్న విధానం కొనసాగుతుందని డాట్ విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది.