మొబైల్ సిమ్ కార్డులకు ఇక ఆధార్!
అనుసంధానం కోసం పైలట్ ప్రాజెక్టు
న్యూఢిల్లీ: మొబైల్ సిమ్ కార్డులకు ఆధార్ నంబర్‌ను అనుసంధానించే ప్రక్రియకు ప్రభుత్వం తెరతీస్తోంది. తద్వారా ఆధార్ కార్డుదారులకు మొబైల్ సిమ్ కార్డుల యాక్టివేషన్ వేగవంతం కానుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ(యూఐడీఏఐ) రూపొందించిన ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్(ఈ-కేవైసీ) సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షించే ప్రాజెక్టును త్వరలో చేపట్టనున్నట్లు టెలికం శాఖ(డాట్) ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఐదు టెలికం కంపెనీల భాగస్వామ్యంతో లక్నో(ఎయిర్‌టెల్), భోపాల్(ఆర్‌కామ్), ఐడియా(ఢిల్లీ), వొడాఫోన్(కోల్‌కతా), బెంగళూరు(బీఎస్‌ఎన్‌ఎల్) నగరాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును నిర్వహించనున్నట్లు డాట్ వెల్లడించింది. ఈ-కేవైసీ సర్వీస్ ద్వారా బ్యాంకులు, టెలికం కంపెనీలు ఇలా ఇతరత్రా సర్వీసు ప్రొవైడర్లు వినియోగదారునికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లోనే తనిఖీ చేసేందుకు వీలవుతుంది.
ఇందుకు ఆధార్ నంబర్, బయోమెట్రిక్ వివరాల ఆధారంగా వివరాలను సరిచూస్తారు. ప్రస్తుతం కస్టమర్ నుంచి ద్రువపత్రాలు ఇతరత్రా వివరాలన్నీ తీసుకున్న తర్వాత వాటిని తనిఖీ చేసి మొబైల్ సిమ్ కార్డు యాక్టివేషన్ చేసేందుకు కనీసం రెండు రోజుల వ్యవధి పడుతోంది. ఆధార్‌కు గనుక దీన్ని అనుసంధానం చేస్తే.. నిమిషాల వ్యవధిలోనే యాక్టివేషన్ పూర్తయ్యేందుకు వీలవుతుంది.
జనవరిలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కావ చ్చని సమాచారం. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే దేశంలో ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయనున్నట్లు డాట్ వర్గాలు తెలిపాయి. కాగా, ప్రస్తుతం కస్టమర్ల ఐడెంటిటీ, అడ్రస్ ధ్రువీకరణకు కోసం అమల్లో ఉన్న విధానం కొనసాగుతుందని డాట్ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.