connection
-
3 రోజుల్లో కొత్త కరెంట్ కనెక్షన్
సాక్షి, హైదరాబాద్: మెట్రోపాలి టన్ నగరాల్లో వినియోగదారులు అవసరమైన పత్రాలన్నీ పొందుపరిచి, కొత్త కరెంట్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే మూడు రోజుల్లోగా కనెక్షన్ ఇవ్వా లని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే పాత కనెక్షన్లో మార్పుల విషయంలో కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ(వినియోగదారుల హక్కులు) రూల్స్–2020ని సవరిస్తూ రూల్స్–2024ను శుక్రవారం జారీ చేసింది. అదేవిధంగా మున్సిపల్ ప్రాంతాల్లో వారంరోజుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లోగా కనెక్షన్ జారీ చేయాలని నిర్దేశించింది. రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లోని కొండ ప్రదేశాల్లో అయితే 30 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేసింది. పంపిణీ వ్యవస్థల విస్తరణ, కొత్త సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటే.. 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకొని, విద్యుత్ సరఫరా చేయాలని నిర్దేశించింది. ఇక గ్రూప్ హౌసింగ్ సొసైటీ కింద అన్ని ఇళ్లకు అవకాశం ఉంటే.. సింగిల్ పాయింట్ కనెక్షన్ (ఒకే కనెక్షన్) ఇవ్వాలని పేర్కొంది. సొసైటీలో 50 శాతం దాకా యాజమానులు వ్యక్తిగత కనెక్షన్ కోరితే.. వారందరికీ వ్యక్తిగత కనెక్షన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. సింగిల్ పాయింట్ కనెక్షన్ టారిఫ్ కూడా సగటు గృహ కనెక్షన్ టారిఫ్‌ను దాటడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సొసైటీల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కోసం ప్రత్యేకంగా కనెక్షన్ కావాలంటే జారీ చేయాలని నిర్దేశించింది. మీటర్లలో లోపాలు లేదా దెబ్బతినడం.. కాలిపోవడం వంటి అంశాలపై దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లోపు కొత్త మీటర్ బిగించాలని, మీటర్ రీడింగ్‌లో లోపాలు ఉన్నట్లు గుర్తించి ఫిర్యాదు చేస్తే కొత్త మీటర్‌ను ఐదురోజుల్లోగా బిగించడమే కాకుండా తప్పుడు బిల్లింగ్‌పై ఫిర్యాదును మూడు నెలల్లోపు పరిష్కరించాలని పేర్కొంది. సోలార్ విద్యుత్ కోసం పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించి, సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదికను 15 రోజుల్లోగా అందించాలన్నారు. 10 కిలోవాట్ల దాకా రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ కోసం వచి్చన దరఖాస్తును సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదిక అవసరం లేకుండా అనుమతించాలని ఆదేశించింది. రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ బిగించిన తర్వాత సరి్టఫికెట్‌ను వినియోగదారుడు దాఖలు చేస్తే కనెక్షన్ అగ్రిమెంట్, కొత్త మీటర్‌ను 15 రోజుల్లోగా అందించాలని స్పష్టం చేసింది. -
బెంగళూరు–వాడీ లైన్ల అనుసంధానం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం మంజూరైన రైల్వే ప్రాజెక్టు ఎట్టకేలకు జాతికి అంకితం కాబోతోంది. ప్రాజెక్టులో తెలంగాణ ప్రాంత సరిహద్దు వరకు పనులు పూర్తి కావడంతో సమాంతరంగా ఉన్న రెండు ప్రధాన రైలు మార్గాల అనుసంధానానికి అవకాశం ఏర్పడింది. మహబూబ్‌నగర్–కర్ణాటకలోని మునీరాబాద్ మధ్య 243 కి.మీ. మేర జరుగుతున్న రైల్వే లైన్ పనుల్లో భాగంగా దేవరకద్ర–కృష్ణా స్టేషన్ల అనుసంధానంతో ఈ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో పూర్తయింది. ఇది ఇటు సికింద్రాబాద్ (మహబూబ్‌నగర్)–బెంగళూరు లైను, అటు సికింద్రాబాద్–వాడీ–ముంబై లైన్లను అనుసంధానిస్తుంది. బెంగళూరు లైన్లో దేవరకద్ర నుంచి మొదలయ్యే ఈ ప్రాజెక్టు, వాడీ మార్గంలోని కృష్ణా స్టేషన్ వద్ద తెలంగాణ పరిధిలో ముగుస్తుంది. ఇక్కడి వరకు పనులు పూర్తి కావడంతో ఈ అనుసంధాన లైన్‌ను ఇప్పుడు ప్రధాని మోదీ జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి బెంగళూరు సహా కొన్ని ఇతర ప్రాంతాలకు వాడీ మీదుగా రైళ్లు తిరుగుతున్నాయి. దీని బదులు ఆ రైళ్లు ఇకపై దేవరకద్ర మీదుగా బెంగళూరుకు చేరుకోవచ్చు. దీనివల్ల రైల్వేకు దూరాభారం తగ్గుతుంది. సరుకు రవాణా రైళ్లకూ ఇది దగ్గరి దారి కానుంది. అలాగే జక్టేర్, మరికల్, మక్తల్, మాగనూరు లాంటి ప్రాంతాలకు రైల్వే సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుంది. ప్రధాని చేతులమీదుగా కాచిగూడ–సిద్దిపేట డెమూ ప్రారంభం? మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట వరకు రైల్వేలైన్ సిద్ధమై రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆమోదముద్ర కూడా రావడంతో రైళ్లను నడిపేందుకు అవకాశం కలిగింది. ఇందులో భాగంగా కాచిగూడ–సిద్దిపేట మధ్య రోజువారీ నడిచేలా డెమూ సర్వీసును ప్రారంభించాలని రైల్వే శాఖ ఇప్పటికే నిర్ణయించింది. ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించే రెండు రోజుల్లో ఏదో ఒక రోజు డెమూ రైలు సర్విసును ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం–రైల్వే శాఖ సంయుక్తంగా చేపట్టాయి. ప్రధాని చేతుల మీదుగా రైలును ప్రారంభించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించనుందో చూడాల్సి ఉంది. ఇక ముద్ఖేడ్–డోన్ మార్గంలో డబ్లింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రెండు లైన్లు వినియోగానికి సిద్ధమైన నేపథ్యంలో ఆ పనులను కూడా ప్రధాని జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. ప్రాజెక్టు: మహబూబ్‌నగర్–మునీరాబాద్ మంజూరు: 1997–98 నిడివి: 243 కి.మీ. ప్రాజెక్టు వ్యయం: రూ. 3,473 కోట్లు తెలంగాణ పరిధి: 66 కి.మీ. వ్యయం: రూ.943 కోట్లు విద్యుదీకరణ: పూర్తి -
పోలవరంలో మరో కీలక ఘట్టం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. జలాశయాన్ని ఎడమ కాలువతో అనుసంధానం చేసే సొరంగం (టన్నెల్) తవ్వకం పనులు పూర్తయ్యాయి. 919 మీటర్ల పొడవుతో 18 మీటర్ల వ్యాసంతో 20 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో ఈ సొరంగం తవ్వకం పనులను పూర్తిచేశామని.. లైనింగ్ పనులను ప్రారంభించామని పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు ‘సాక్షి’కి వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఈ పనుల అంచనా వ్యయాన్ని పెంచేసిన అప్పటి సీఎం చంద్రబాబు.. రూ.292.09 కోట్లకు కాంట్రాక్టు సంస్థకు అప్పగించి, కమీషన్లు వసూలుచేసుకున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఆ కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దుచేసి.. రూ.292.09 కోట్లనే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి.. రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. టీడీపీ సర్కార్ హయాంలో కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థే.. ఆ పనులను రూ.231.47 కోట్లకే చేయడానికి 2019, సెపె్టంబరు 19న ముందుకొచ్చింది. దీంతో ఖజానాకు రూ.60.62 కోట్లు ఆదా అయ్యాయి. దీనిద్వారా చంద్రబాబు కమీషన్ల బాగోతాన్ని సీఎం జగన్ రట్టుచేశారు. తక్కువ ఖర్చుతోనే సొరంగాన్ని పూర్తిచేయడం ద్వారా ప్రణాళికాబద్ధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడంలో సీఎం మరో అడుగు ముందుకేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అనుసంధానాల పనులు కొలిక్కి.. పోలవరం జలాశయం గరిష్ట నీటిమట్టం 45.72 మీటర్లు (194.6 టీఎంసీలు). కనిష్ట నీటిమట్టం 41.15 మీటర్లు (119.4 టీఎంసీలు). కుడి కాలువను 174 కిమీల పొడవున 17,633 క్యూసెక్కులు (1.52 టీఎంసీ) సామర్థ్యంతో తవ్వారు. ఈ కాలువ కింద మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తారు. ఈ కాలువను జలాశయంతో అనుసంధానం చేసేలా జంట సొరంగాలు (ఒక్కొక్కటి పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో), హెడ్ రెగ్యులేటర్‌ను 2020లో సీఎం జగన్ పూర్తిచేశారు. పోలవరం (గోదావరి)–ప్రకాశం బ్యారేజ్ (కృష్ణా)–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీఆర్సీ) ద్వారా పెన్నాను అనుసంధానం చేసే పనుల్లో భాగంగా జంట సొరంగాల సామర్థ్యాన్ని 20 వేల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు శ్రీకారం చుట్టారు. తాజాగా.. ఎడమ కాలువను అనుసంధానం చేసే సొరంగం తవ్వకం పనులు పూర్తిచేశారు. ఎడమ కాలువను 181.50 కిమీల పొడవున 17,561 క్యూసెక్కుల సామర్థ్యం (1.51 టీఎంసీ)తో చేపట్టారు. ఈ పనుల్లో ఇప్పటికే 91% పూర్తయ్యాయి. ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు నీళ్లందించాలి. పోలవరం ప్రాజెక్టులో నీటి మట్టం 40.54 మీటర్ల స్థాయిలో ఉంటే ఎడమ కాలువ.. 40.23 మీటర్ల స్థాయిలో ఉంటే కుడి కాలువ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించవచ్చు. ఎడమ కాలువను అనుసంధానం చేసే సొరంగం పనులు తాజాగా పూర్తయ్యాయి. వరద తగ్గగానే హెడ్ రెగ్యులేటర్ పనులు ప్రారంభించి పూర్తిచేయనున్నారు. ప్రణాళికాబద్ధంగా పూర్తిచేసే దిశగా.. ఇక కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు పనులను అప్పటి సీఎం చంద్రబాబు అస్తవ్యస్తంగా మార్చితే.. సీఎం జగన్ వాటిని గాడిలో పెట్టి ప్రణాళికాబద్ధంగా చేపట్టి వడివడిగా పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తిచేసి 2021, జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని 6.1 కిమీల పొడవున మళ్లించారు. అలాగే, కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేపట్టిన పనులవల్ల గోదావరి వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు చక్కదిద్దే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ మేరకు వాటిని పూర్తిచేసి.. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి ప్రాజెక్టు ఫలాలను శరవేగంగా రైతులకు అందించే దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. -
మెక్రాన్ సతీమణికి పోచంపల్లి ఇక్కత్ చీర బహుకరించిన మోదీ..
ప్రధానమంతత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన రెండు రోజులపాటు కొనసాగింది. శుక్రవారం జరిగిన బాస్టిల్ డే వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీని ఫ్రాన్స్ అత్యన్నత పురస్కారంతో ఆ దేశ అధ్యక్షుడు సన్మానించారు. అయితే.. పర్యటనలో భాగంగా దౌత్య సంబంధాలకు తోడు సంస్కృతిక అంశాలను కూడా జోడించారు. ఆ దేశ పెద్దలకు ప్రధాని మోదీ భారత సంస్కృతికి చెందిన విలక్షణమైన కానుకలను అందించారు. అధ్యక్షుడు మెక్రాన్‌కు గంధపు చెక్కతో తయారు చేసిన సితార్‌ను బహుకరించారు. దక్షిణ భారతదేశంలో గంధపు చెక్కతో చేసే పూరాతన హస్తకళకు చెందిన కళారూపం. సరస్వతీ దేవీ, జాతీయ పక్షి నెమళ్లతో పాటు గణేశుని ప్రతిరూపాలు ఆ సితార్‌పై ఉన్నాయి. మెక్రాన్ సతీమణి చేత.. తెలంగాణ చీర.. ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగిట్టే మెక్రాన్‌కు ప్రధాని మోదీ పోచంపల్లి ఇక్కత్ చీరను బహుకరించారు. చీరను చందనం పెట్టెలో పెట్టి ఆమెకు అందించారు. ఇక్కత్ చీర తెలంగాణకు చెందిన పోచంపల్లిలో ఉద్భవించిన అరుదైన కళారూపం. ఆకర్షనీయమైన రంగులతో క్లిష్టమైన డిజైన్లకు ప్రసిద్ధి చెందిన కళాఖండం. చందనం పెట్టెపై కూడా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలు చెక్కబడి ఉన్నాయి. మార్బుల్ ఇన్లే వర్క్ టేబుల్.. ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఎలిసబెత్ బోర్న్‌కు 'మార్బుల్ ఇన్లే వర్క్'తో అలంకరించబడిన టేబుల్‌ను ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు. రాజస్థాన్‌లోని మక్రానా నుంచి పాలరాతిని, దేశంలో విలువైన రాళ్లను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. రాళ్లను కత్తిరించి అందంగా తయారు చేసే కళాఖండం. కాశ్మీరీ కార్పెట్.. ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యేల్ బ్రౌన్-పివెట్‌కు చేతితో అల్లిన కాశ్మీరీ కార్పెట్‌ను బహుకరించారు ప్రధాని మోదీ. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ కలిగిన కళారూపం ఇది. మృదుత్వం కలిగి వివిధ కోణాల్లో వేరు వేరు రంగుల్ని కలిగి ఉంటుంది. గంధపు ఏనుగు.. ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు గెరార్డ్ లార్చెర్కు గంధపు చెక్కతో చెక్కిన ఏనుగు బొమ్మను ప్రధాని మోదీ బహుకరించారు. ఏనుగు భారతీయ సంస్కృతిలో జ్ఞానం, బలాన్ని సూచిస్తుంది. ప్రకృతికి, కళలకు మధ్య సామరస్యాన్ని సూచించే అందమైన ప్రతిబింబం ఇది. ఇదీ చదవండి: ప్రధాని ఫ్రాన్స్ పర్యటన.. మోదీ భారీ ప్రకటనలు.. -
కావేరికి ‘గోదారే’!
సాక్షి, అమరావతి : గోదావరి–కావేరి అనుసంధానానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)పై నీటిపారుదలరంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ సర్కార్ అంగీకరించకున్నా.. ఆ రాష్ట్ర వాటాలో వాడుకోని 141.3 టీఎంసీలను తరలించాలని ప్రతిపాదించడాన్ని వారు తప్పుపడుతున్నారు. మా నీళ్లను కావేరికి ఎలా తరలిస్తారంటూ ఛత్తీస్‌గఢ్ సర్కార్ అభ్యంతరం తెలపడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ 141.3 టీఎంసీలపై ఛత్తీస్‌గఢ్ సర్కార్ హక్కులను వదులుకోవడానికి అంగీకరించినా ఆ జలాలను కావేరికి తరలించడానికి న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని స్పష్టంచేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ వదులుకున్న 141.3 టీఎంసీలను పునఃపంపిణీ చేయాలని గోదావరి నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) పరిధిలోని రాష్ట్రాలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే అవకాశం ఉంటుందని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) మాజీ చైర్మన్ ఏబీ మొహిలే చెబుతున్నారు. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి.. బేసిన్ పరిధిలోని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధిస్తేనే గోదావరి–కావేరి అనుసంధానం సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలకు 106 టీఎంసీల మిగులు జలాలను జతచేసి.. 247 టీఎంసీలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా గ్రాండ్ ఆనకట్ట (కావేరి)కి తరలించేలా 2018లో ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన రూపొందించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులకు తలా 80 టీఎంసీలను కేటాయించాలని ప్రతిపాదించారు. ఆదిలోనే సీడబ్ల్యూసీ అభ్యంతరం.. గోదావరి–కావేరి అనుసంధానానికి ఎన్‌డబ్ల్యూడీఏ రూపొందించిన ప్రతిపాదనపై ఆదిలోనే సీడబ్ల్యూసీ అభ్యంతరం వ్యక్తంచేసింది. గోదావరిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే మిగులు జలాలు లేవని సీడబ్ల్యూసీ స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో 106 టీఎంసీలను ఎలా తరలిస్తారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఎన్‌డబ్ల్యూడీఏను నిలదీశాయి. దాంతో గోదావరి–కావేరి అనుసంధానంలో ఎన్‌డబ్ల్యూడీఏ మార్పులు చేసింది. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీల గోదావరి జలాలను తరలించేలా డీపీఆర్‌ను రూపొందించింది. ఆవిరి ప్రవాహ నష్టాలుపోనూ ఆంధ్రప్రదేశ్‌కు 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడుకు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలు అందిస్తామని పేర్కొంది. దీనిపై బేసిన్ పరిధిలోని రాష్ట్రాలతో గత మార్చి 6న టాస్క్‌ఫోర్స్ కమిటీ సంప్రదింపులు జరిపింది. ఛత్తీస్‌గఢ్ అభ్యంతరం చెబుతున్నా.. టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్వహించిన ఈ సమావేశానికి ఛత్తీస్‌గఢ్ సర్కార్‌ను ఆహ్వానించలేదు. ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రస్తావిస్తూ.. ఛత్తీస్‌గఢ్ సర్కార్‌ను ఆహ్వానించకుండా, ఆ రాష్ట్ర కోటా నీటి తరలింపుపై ఎలా చర్చిస్తామని టాస్క్ ఫోర్స్ కమిటీని ప్రశ్నించాయి. ఛత్తీస్‌గఢ్ సర్కార్‌తో ఉన్నతస్థాయిలో చర్చించి.. ఆ రాష్ట్ర కోటా నీటిని తరలించడానికి అంగీకరింపజేస్తామని కమిటీ చెప్పుకొచ్చింది. కానీ, ఇది ఆచరణ సాధ్యంకాదని సీడబ్ల్యూసీ చైర్మన్ ఏబీ మొహిలే స్పష్టంచేశారు. గోదావరి ట్రిబ్యునల్ కేటాయించని జలాలపై పూర్తి హక్కు తమకుందని.. తమ నీటిని ఎలా తరలిస్తారని ఛత్తీస్‌గఢ్ సర్కార్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో.. గోదావరి–కావేరి అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ ఎలా ముందడుగు వేస్తుందన్నది వేచిచూడాల్సిందే. -
నీటి లభ్యత తేల్చాకే కావేరికి గోదారి
లెక్కలకు పొంతనేదీ?: ఏపీ ♦గోదావరిలో నీటి లభ్యతపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), వ్యాప్కోస్, ఎన్‌డబ్ల్యూడీఏ లెక్కలకు పొంతన లేదు. నీటి లభ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి. ♦75 శాతం లభ్యత ఆధారంగా ఉమ్మడి రాష్ట్రంలో గోదావరిలో 1,430 టీఎంసీల లభ్యత ఉంటుందని వ్యాప్కోస్ లెక్క కట్టింది. ఇందులో 775 టీఎంసీలను వినియోగించుకునేలా ఏపీ, 655 టీఎంసీలను వాడుకునేలా తెలంగాణ ప్రాజెక్టులు చేపట్టినందున కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి నీటి లభ్యత లేదు. ♦జీ–1 నుంచి జీ–11 వరకూ ఎగువ రాష్ట్రాలకు కేటాయించగా మిగిలిన నికర జలాలను దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి ట్రిబ్యునల్ కేటాయించింది. మిగులు జలాలపై స్వేచ్ఛ ఇచ్చింది. ♦అనుసంధానం చేపట్టేటప్పుడు దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులు పరిరక్షించాలి. ప్రవాహం తక్కువగా ఉన్న సమయంలో నీటిని తరలిస్తే దిగువ రాష్ట్రమైన ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటాయి. ♦కొత్త రిజర్వాయర్లు నిర్మించకుండా అనుసంధానం అసాధ్యం. మహానది నుంచి 229 టీఎంసీలను పోలవరం దిగువన గోదావరిలో పోస్తే ఏం ప్రయోజనం? ధవళేశ్వరం నుంచి వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిందే. ♦లభ్యతను శాస్త్రీయంగా తేల్చి ఏపీలో దుర్భిక్ష ప్రాంతాల అవసరాలు తీర్చాకే మిగిలిన నీటిని ఇతర రాష్ట్రాలకు తరలించేలా అనుసంధానం చేపట్టాలి. మాకు గరిష్టంగా కేటాయించాలి: తెలంగాణ సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానంపై తొమ్మిది రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. శాస్త్రీయంగా అధ్యయనం చేసి గోదావరిలో నీటి లభ్యత తేల్చాకే అనుసంధానం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్పష్టం చేయగా తమకు కేటాయించిన నీటిని తరలించేందుకు అంగీకరించే ప్రశ్నే లేదని ఛత్తీస్‌గఢ్ పేర్కొంది. కృష్ణా బేసిన్‌కు తరలించిన గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా కావాలని మహారాష్ట్ర, కర్ణాటక పట్టుబట్టగా కావేరి నీటిలో అదనపు వాటా కావాలని కేరళ డిమాండ్ చేసింది. మహానదిలో నీటి లభ్యత లేని నేపథ్యంలో మహానది–గోదావరి అనుసంధానంపై ఒడిశా, మధ్యప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేశాయి. కావేరికి కనీసం 216 టీఎంసీల గోదావరి జలాలనైనా తరలించాలని తమిళనాడు, పుదుచ్చేరి విజ్ఞప్తి చేశాయి. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించాకే నదుల అనుసంధానాన్ని చేపడతామని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్ తెలిపారు. గోదావరి–కావేరి అనుసంధానంపై ఏకాభిప్రాయం సాధించే లక్ష్యంతో శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధ నుంచి భోపాల్‌సింగ్ నేతృత్వంలోని సంప్రదింపుల కమిటీ వర్చువల్ విధానంలో తొమ్మిది రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. బేసిన్లు.. ట్రిబ్యునళ్ల అవార్డులు పక్కన పెట్టండి నీటి లభ్యత అధికంగా ఉన్న నదుల నుంచి జలాలను మళ్లించడం ద్వారా దేశంలో తాగు, సాగునీటి కష్టాలను అధిగమించేందుకు అనుసంధానం చేపట్టామని భోపాల్‌సింగ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇచ్చంపల్లి నుంచి జూన్ – అక్టోబర్ల మధ్య 247.19 టీఎంసీలను నాగార్జునసాగర్(కృష్ణా), సోమశిల(పెన్నా) మీదుగా గ్రాండ్ ఆనకట్ట(కావేరి)కి తరలించేలా ప్రతిపాదన రూపొందించామన్నారు. ఆవిరి, ప్రవాహ నష్టాలుపోనూ ఆంధ్రప్రదేశ్‌కు 79.94, తెలంగాణకు 65.8, తమిళనాడుకు 84.01 టీఎంసీలను ఇస్తామన్నారు. తద్వారా కోటి మందికి తాగునీరు పది లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుందని చెప్పారు. రూ.85 వేల కోట్లతో చేపట్టే అనుసంధానం డీపీఆర్‌ను బేసిన్ పరిధిలోని తొమ్మిది రాష్ట్రాలకు పంపామన్నారు. మహానది– గోదావరి అనుసంధానం ద్వారా రెండో దశలో కావేరికి 229 టీఎంసీలను తరలిస్తామన్నారు. నీటి లోటు ఎదుర్కొంటున్న కృష్ణా, కావేరిలకు జలాలను తరలించాలనే కృత నిశ్చయంతో కేంద్రం ఉందన్నారు. బేసిన్లు, ట్రిబ్యునళ్ల అవార్డులను పక్కన పెట్టి దేశ విశాల ప్రయోజనాల కోసం అనుసంధానానికి సహకరించాలని కోరారు. -
ధోని, ఇన్ఫోసిస్ ఒకే సంవత్సరంలో..
ముంబై: దేశ చరిత్రలో 1981సంవత్సరం ఎంతో చరిత్రాత్మకమైనది. ఒకరు దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పుట్టిన రోజయితే, మరొకటి ఐటీ రంగంలో ప్రపంచానికే ప్రేరణగా నిలిచిన దేశీయ ఐటీ దిగ్గజం ఇన్పోసీస్ స్థాపించిన రోజు(1981) కావడం విశేషం. మరోవైపు జులై 7, 1981సంవత్సరంలో రాంచీలో ధోని జన్నిస్తే, అదే రోజు పుణెలో ఇన్పోసీస్‌ను స్థాపించారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ 2లక్షల 39వేల మంది ఉద్యోగులతో ఎన్వైఎస్ఈ గ్లోబల్ కంపెనీ లిస్టింగ్‌లో రికార్డు సృష్టించింది. అదే విధంగా చిన్న పట్టణం నుంచి వచ్చి ప్రతిభ, సహనంతో క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ క్రికెటర్‌గా ధోని ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శనీయం. అయితే ధోని, ఇన్ఫోసిస్ ప్రేరణతో అత్యుత్తమ క్రీడాకారులు, ఐటీ దిగ్గజ కంపెనీలు మరెన్నో నెలకొల్పాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. చదవండి: ధోని రిటైర్మెంట్పై భార్య సాక్షి భావోద్వేగ పోస్ట్ -
ఆధార్‌తో 67 కోట్ల ఖాతాలు అనుసంధానం
ఐటీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ వెల్లడి న్యూఢిల్లీ: దేశీయంగా ప్రస్తుతం 110 కోట్ల బ్యాంకు ఖాతాలుండగా.. సుమారు 67 కోట్ల ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం అయినట్లు కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఇందుకోసం గ్రామాల స్థాయిలోని కామన్ సర్వీసెస్ సెంటర్స్ (సీఎస్సీ) ద్వారా ఔత్సాహిక వ్యాపారవేత్తలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. సీఎస్సీలు అందించే ఆధార్ సర్వీసులపై వర్క్‌షాప్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రసాద్ ఈ విషయాలు చెప్పారు. సీఎస్సీలు దాదాపు 22 కోట్ల ఆధార్ ఎన్రోల్మెంట్లకు సర్వీసులు అందించాయని చెబుతూ... ఇతర ఎన్రోల్మెంట్ ఏజెన్సీల నుంచి పోటీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. సీఎస్సీ బిజినెస్ మోడల్ మరింతగా రూపాంతరం చెందుతుందని, మరిన్ని ప్రభుత్వ విభాగాలు ఇంకా కొత్త సర్వీసులు, పథకాలను ఈ నెట్వర్క్ ద్వారా గ్రామ స్థాయికి చేర్చనున్నాయని మంత్రి చెప్పారు. ప్రస్తుతం సీఎస్సీల్లో 10 లక్షల మంది పనిచేస్తున్నారని, మరిన్ని సర్వీసులు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో రాబోయే 4–5 ఏళ్లలో ఈ సంఖ్య ఒక కోటికి చేరవచ్చన్నారు. ఆధార్, మొబైల్ నంబర్‌తో జన్‌ధాన్ ఖాతాలను అనుసంధానం చేసి, సబ్సిడీలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే బదలాయించడం వల్ల ఖజానాకు రూ. 50,000 కోట్ల మేర ఆదా అయ్యిందని చెప్పారు. ఇది గతంలో మధ్యవర్తుల జేబుల్లోకి చేరేదన్నారు. -
వెలగని దీపం!
► నియోజకవర్గానికి 5వేల చొప్పున ► గ్యాస్ కనెక్షన్ల కేటాయింపు ► రెండేళ్లుగా కొనసాగుతున్న ప్రక్రియ ► ఉన్నతాధికారుల ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుచేయని వైనం ► లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ► ఇవ్వడంలో తీవ్రజాప్యం ► ఇదే అదునుగా సీఎస్ఆర్ కనెక్షన్లు ► ఇస్తున్న గ్యాస్ కంపెనీలు మహబూబ్‌నగర్ న్యూటౌన్ కట్టెలపొయ్యితో పొగచూరిన మహిళలకు విముక్తి కల్పించి వారి ఆరోగ్యాలను కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం గ్యాస్ కనెక్షన్ల పథకం జిల్లాలో అర్హుల దరి చేరడం లేదు. ఈ పథకం గ్రౌండింగ్ విషయంలో సమావేశాలు నిర్వహించి పురోగతిని పెంచాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా కిందిస్థాయి అధికారులకు పట్టడం లేదు. సరైన సిబ్బంది లేరనే సాకు వారికి తోడైంది. దీంతో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైంది. ఫలితంగా ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. దీపం పథకం కింద నియోజకవర్గానికి 5 వేల చొప్పున పేదలకు గ్యాస్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసి రెండేళ్లు గడుస్తోంది. అయినా క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం పట్ల ఉన్నతాధికారులు సైతం పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. అమలులో ఎలాంటి లోపాలున్నాయో ఇప్పటివరకు స్పష్టత రాని పరిస్థితి నెలకొంది. లబ్ధిదారుకు ఇష్టం లేకపోతే రాతపూర్వకంగా రాయించుకొని రద్దు చేసి ఆ స్థానంలో వేరొకరికి అవకాశవిువ్వాలని దీపం పథకం గ్రౌండింగ్‌పై గత నెల క్రితం నిర్వహిం చిన సమావేశంలో పౌరసరఫరా ల అధికారులు, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులకు జిల్లా జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు నెల రోజులు గడిచినా పురోగతిలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. పర్యవేక్షణా లోపం కారణంగా గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ఈ పథకం అమలుపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది. అడ్డంకిగా మారిన సీఎస్ఆర్ దీపం పథకం అమలుకు సీఎస్ఆర్ (కంపెనీ సోషల్ రెస్సా¯Œ్సబుల్) విధా నం అడ్డంకిగా మారింది. దీపం పథకంలో లబ్ధిదారుల ఎంపిక రాజకీయ నాయకులు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల ప్రమేయంతో జరుగుతోంది. దీంతో కనెక్షన్లు మంజూరై రెండేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు ఇప్పటివరకు మంజూరు ప్రొసీడింగులు అందలేదు. లబ్ధిదారుల అవసరాలను ఆసరాగా చేసుకున్న గ్యాస్ ఏజెన్సీలు.. కంపెనీలు ఇచ్చే సీఎస్ఆర్ కనెక్ష¯ŒSలపై దృష్టి సారించాయి. దీపం లబ్ధిదారులకు సీఎస్ఆర్ కనెక్ష¯ŒSలు ఇస్తున్నాయి. అప్పటికే కనెక్ష¯ŒS తీసుకోవడంతో దీపం పథకం కింద మంజూరైన కనెక్షన్ల గ్రౌండింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్యాస్ కంపెనీల లాభాల్లోనుంచి 2 శాతం ఖర్చు చేయాలని ప్రభుత్వ నిబంధనల ప్రకారం... సీఎస్ఆర్ కనెక్షన్లను పేద లబ్ధిదారులకు డిపాజిట్ లేకుండా గ్యాస్ కంపెనీలు అందజేయడం గమనార్హం. లక్ష్యం 27,262 దీపం కనెక్షన్లు ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 5 వేల చొప్పున దీపం కనెక్షన్లు మం జూరు చేసింది ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన తర్వాత తాజా మహబూబ్‌నగర్ జిల్లాకు 27,262 దీపం కనెక్షన్లను లక్ష్యంగా నిర్దేశిం చారు. అందులో 20,846 మంది లబ్ధిదారులను గుర్తించగా 20,406 మందికి అనుమతులు మంజూరు చేశారు. మొత్తం 18,077 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగులను జారీ చేశారు. ఇప్పటివరకు అందులో 9,624 మందికి కనెక్షన్లు ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. అనుమతులు జారీ చేసిన వాటిలో ఇంకా 8,453 కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. మంజూరు చేసిన దీపం పథకం కనెక్షన్లకు డిపాజిట్ రూపేణ రూ.1600 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు చెల్లించింది. దీపం పథకం లబ్ధిదారుల పేరిట డిపాజిట్ రూపేణ గ్యాస్ కంపెనీలకు దాదాపు రూ.4.36 కోట్లు వెచ్చించింది. రాజకీయ పట్టువిడుపులు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఈ పథకం పురోగతి సాధించకపోవడానికి క్షేత్రస్థాయిలో రాజకీయాల పట్టువిడుపులు ఒక కారణమైతే, కంపెనీలు ఇస్తున్న సీఎస్ఆర్ కనెక్షన్లు మరో కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎస్ఆర్ కనెక్షన్లు నిలిపివేయాలని అధికారుల సిఫారసు మేరకు ప్రజాప్రతినిధులు సంబంధిత గ్యాస్ కంపె నీలపై ఒత్తిడి తెచ్చారు. పథకం పురోగతిలో ఎదురవుతున్న ఇబ్బందులపై అధికారులతో రెండుమూడు సార్లు స మీక్షలు నిర్వహించి చర్చించారు. సీ ఎస్ఆర్ కనెక్షన్లకు అనుమతులు ఎందుకిస్తున్నారని, గతంలో ఇచ్చి న వాటికి కచ్చితంగా అనుమతి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు.. అధికారులకు హుకూం జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన సీఎస్ఆర్ కనెక్షన్లకు అనుమతుల కోసం గ్యాస్‌డీలర్లు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అప్పటికే దీపం పథకం లబ్ధిదారులు సీఎస్ఆర్ కనెక్షన్లు పొం దడం, గ్యాస్ ఏజెన్సీలను టార్గెట్ చేసి ప్రజాప్రతినిధులు టెక్నికల్‌గా ఇబ్బందులు పెట్టడం, అధికారులు, ప్రజా ప్రతినిధులు శ్రద్ధచూపకపోవడం కారణాలు దీపం పథకం అమలుకు అడ్డంకిగా మారాయని తెలుస్తోంది. -
ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్
-ఓర్వకల్లు వద్ద ఎయిర్‌పోర్టు – కోవెలకుంట్ల ప్రాంతంలో ఆరు సిమెంట్ పరిశ్రమలు – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వెల్లడి కర్నూలు(అర్బన్): జూన్ నెలాఖరు నాటికి ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్‌లో జెడ్పీ చైర్మన్ చాంబర్లో ఆయన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ జిల్లాలోని ఓర్వకల్లు ప్రాంతంలో త్వరలో విమానాశ్రయం రాబోతోందని, అలాగే పలు పరిశ్రమలు పురుడుపోసుకోనున్నాయని చెప్పారు. ఉర్దూ విశ్వ విద్యాలయం నిర్మాణం శరవేగంగా జరుగుతుందని చెపా్పరు. కోవెలకుంట్ల ప్రాంతంలో త్వరలో ఆరు చిన్న, పెద్ద సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. నగర పాలక సంస్థ పరిధిలోని నిరుద్యోగులు, మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. బడుగుబలహీన వర్గాలకు రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 2015 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పత్తికొండ నియోజకవర్గానికి ఇవ్వాల్సిన ఇన్‌పుట్‌సబ్సిడీ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోపోయినట్లు చెప్పారు.ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణా సంఘం సభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
పాపులర్ హీరోయిన్, భర్త, మరిది అరెస్ట్
తిరువనంతపురం: చీటింగ్ కేసులో మలయాళ పాపులర్ నటి, హీరోయిన్, ఆమె భర్త, మరిదిలను పోలీసులు అరెస్ట్ చేశారు. రి యల్ ఎస్టేట్ వ్యవహారంలో మోసానికి పాల్పడిన ఆరోపణలపై దక్షిణాది నటి ధన్య మేరీ వర్గీస్ (31)ఆమె భర్త జాన్ జాకబ్, జాకబ్ సోదరుడు శ్యామ్యల్ జాకబ్ లను శనివారం అరెస్ట్ చేశారు. 2014 నాటి కేసుకు సంబంధించిన వీరిని తాజాగా అదుపులోకి తీసుకొన్నట్టు తెలుస్తోంది. కేరళ రాజధాని తిరువనంతపురం పరిసరాల్లో నిర్మిస్తున్న నోవా కాజిల్ ఫ్లాట్ కాంప్లెక్స్‌లో తమకు అపార్ట్మెంట్లు ఇప్పిస్తామని ధన్య భర్త జాన్ జాకబ్‌కు చెందిన సంస్థ శాంసన్ అండ్ సన్స్ ద్వారా కోట్లాది రూపాయలూ కాజేశారని అందిన ఫిర్యాదు నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేశారు. 2011 లో శాంసన్ అండ్ సన్స్ సంస్థ తరపున కలిసి బాధితుల భారీ ఎత్తున సొమ్మును తీసుకొని ప్లాట్ లు కేటాయించకుండా మోసానికి పాల్పడ్డారు. ఒకొక్కరి నుంచి రూ.40 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ మొత్తం 100 కోట్ల రూపాయల మేర వసూళ్ళు చేసిన ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. ధన్య మామ జాకబ్ శాంసన్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా 31 సంవత్సరాల ధన్య తమిళ సినిమా 'తిరుడి' (దొంగ) చిత్రం ద్వారా 2006లో సినీ రంగంలోకి ప్రవేశించారు. తర్వాత మలయాళ రంగంలోకి అడుగుపెట్టారు. టీవీ సీరియళ్ళలో కూడా దర్శనమిచ్చిన నర్గీస్ తలప్పావు సినిమాకు ఆమె ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. దీంతోపాటుగా మళయాంలో కేరళ కేఫ్, నాయగన్ సినిమాల్లో కూడా నటించారు. జాన్ కూడా పలు సినిమాల్లో నటించార. 2012లో వివాహం చేసుకున్న ధన్య, జాన్ జంటకు మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. -
కోడలిపై దాడి కేసులో అత్త అరెస్ట్
-
ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్
కోవూరు : గ్యాస్ లేని ప్రతి కుటుంబానికి ఉచితంగా కనెక్షన్ మంజూరు చేస్తామని ఎన్ఆర్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహుకులు నజీర్ అహ్మద్ తెలిపారు. స్థానిక ఏజెన్సీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీ పరిధిలో పొగరహిత వంట కోసం అందరికి సిలిండర్లు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గతంలో మీ–సేవ కేంద్రంలో నమోదు చేసుకుని తహసీల్దారు కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేదన్నారు. కనెక్షన్ లేనివారు ఇప్పుడే నేరుగా ఆన్లైన్లో ఈపీడీఎస్ సైట్లో వివరాలు నమోదుచేసి ఏజెన్సీ వద్దకు వస్తే మంజూరవుతుందన్నారు. -
మొబైల్ సిమ్ కార్డులకు ఇక ఆధార్!
అనుసంధానం కోసం పైలట్ ప్రాజెక్టు న్యూఢిల్లీ: మొబైల్ సిమ్ కార్డులకు ఆధార్ నంబర్‌ను అనుసంధానించే ప్రక్రియకు ప్రభుత్వం తెరతీస్తోంది. తద్వారా ఆధార్ కార్డుదారులకు మొబైల్ సిమ్ కార్డుల యాక్టివేషన్ వేగవంతం కానుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ(యూఐడీఏఐ) రూపొందించిన ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్(ఈ-కేవైసీ) సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షించే ప్రాజెక్టును త్వరలో చేపట్టనున్నట్లు టెలికం శాఖ(డాట్) ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ఐదు టెలికం కంపెనీల భాగస్వామ్యంతో లక్నో(ఎయిర్టెల్), భోపాల్(ఆర్‌కామ్), ఐడియా(ఢిల్లీ), వొడాఫోన్(కోల్‌కతా), బెంగళూరు(బీఎస్ఎన్ఎల్) నగరాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును నిర్వహించనున్నట్లు డాట్ వెల్లడించింది. ఈ-కేవైసీ సర్వీస్ ద్వారా బ్యాంకులు, టెలికం కంపెనీలు ఇలా ఇతరత్రా సర్వీసు ప్రొవైడర్లు వినియోగదారునికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లోనే తనిఖీ చేసేందుకు వీలవుతుంది. ఇందుకు ఆధార్ నంబర్, బయోమెట్రిక్ వివరాల ఆధారంగా వివరాలను సరిచూస్తారు. ప్రస్తుతం కస్టమర్ నుంచి ద్రువపత్రాలు ఇతరత్రా వివరాలన్నీ తీసుకున్న తర్వాత వాటిని తనిఖీ చేసి మొబైల్ సిమ్ కార్డు యాక్టివేషన్ చేసేందుకు కనీసం రెండు రోజుల వ్యవధి పడుతోంది. ఆధార్‌కు గనుక దీన్ని అనుసంధానం చేస్తే.. నిమిషాల వ్యవధిలోనే యాక్టివేషన్ పూర్తయ్యేందుకు వీలవుతుంది. జనవరిలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కావ చ్చని సమాచారం. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే దేశంలో ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయనున్నట్లు డాట్ వర్గాలు తెలిపాయి. కాగా, ప్రస్తుతం కస్టమర్ల ఐడెంటిటీ, అడ్రస్ ధ్రువీకరణకు కోసం అమల్లో ఉన్న విధానం కొనసాగుతుందని డాట్ విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. -
ఎన్నాళ్లీ అవస్థలు..
పెదకూరపాడు, కట్టెల పొయ్యిపై మధ్యాహ్న భోజనం వండేందుకు ఏజన్సీలు అవస్థలు పడుతున్నారు. కట్టెపుల్లలు కొనుగోలు భారంగా మారింది. కూలి పనులకు వెళ్తే రూ.150 ఇస్తున్నారు. ప్రభుత్వ ఇచ్చే గౌరవ వేతనం చాలటం లేదని ఏజన్సీలు వాపోతున్నారు. గ్యాస్‌పొయ్యిలు మంజూైరె న కనెక్షన్లు ఇవ్వలేదు. వంట షెడ్లుకు నిధులు మంజూరైన నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదు. ఇలా మధ్యాహ్నం భోజనం ఏజన్సీలు అవస్థలు పడుతున్నారు. కట్టెల పొయ్యిపై వంటతో కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం ఏజన్సీలకు 25 మంది విద్యార్థులలోపు రూ.వెయ్యి, 100మంది ఉన్న ఏజన్సీలకు రూ.రెండు వేలు, 100 నుంచి ఆపైన ఉన్న విద్యార్థులకు రూ.మూడు వేలు గౌరవ వే తనం ఇస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు విద్యార్థికి రూ.4.35 పైసలు, ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.ఆరు ఇస్తున్నారు. వీటిలోనే కట్టెపుల్లలు, కూరగాయలు కొనుగోలు చేయాలి. ధరలు పెరిగినప్పుడు అనేక అవస్థలు పడుతున్నామని ఏజన్సీలు చెప్తున్నారు. మండలంలో మొత్తం 42 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 42 ఏజన్సీలు ఉన్నారు. వీరిలో 19 మందికి గ్యాస్ పొయ్యిలు పంపిణీ చేశారు. వాటికి కనెక్షన్లు ఇవ్వలేదు. మండలంలోని 42పాఠశాలలకు గాను 33 పాఠశాలలకు వంట షెడ్లు మంజూరు చేశారు. షెడ్ నిర్మాణానికి రూ.75 వేలు మంజూరు చేశారు. నిధులు చాలవని కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. రూ.లక్ష వరకు పెంచారని ఉన్నతాధికారులు చెప్తున్నా ఉత్తర్వులు ఎంఈవోకు అందలేదు. మండలంలోని దాతల సహకారంతో గారపాడు జెడ్పీహెచ్, రెండు ప్రాథమిక పాఠశాలలు, కన్నెగండ్ల ప్రాథమిక పాఠశాలల్లో వంటషెడ్లు నిర్మించారు. క్రోసూరు మండలంలో 38 మంది ఏజన్సీలు ఉన్నారు. వారిలో 30మందికి గ్యాస్‌పొయ్యిలు మంజూరు చేశారు. కనెక్షన్లు ఇవ్వలేదు. 30 పాఠశాలలకు వంటషెడ్లుకు నిధులు మంజూరు చేశారు. ఇంకా నిర్మించ లేదు. అచ్చంపేట మండలంలో 62 మంది ఏజన్సీలు ఉన్నారు. సగం మందికి గ్యాస్ కనెక్షన్లు మంజురూ చేసిన కనెక్షన్లు ఇవ్వలేదు. వంట షెడ్లు కోసం నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అమరావతి మండలంలో 56 మంది ఏజన్సీలు ఉన్నారు. వీరి అవస్థలు అన్ని ఇన్ని కావు. కనెక్షన్లు ఇవ్వకపోవడంతో కట్టెల పొయ్యిపైనే వంట చేస్తున్నారు. బెల్లంకొండ మండలంలోని 35 ఏజన్సీలకు ఇదే పరిస్థితి. -
సర్దు‘పోటు’ వల్లే బిల్లుల భారం
కశింకోట,న్యూస్‌లైన్: ఇంధన సర్దుబాటు చార్జీల వల్ల విద్యుత్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయని ఆర్ఈసీఎస్ మేనేజింగ్ డెరైక్టర్ బి.శేషుకుమార్ పేర్కొన్నారు. స్థానిక ఆర్ఈసీఎస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వినియోగదారులకు ఈ నెల వచ్చిన విద్యుత్ బిల్లులతో రెండు నెలలకు సంబంధించి ఇంధన సర్ధుబాటు చార్జీలను వసూలు చేస్తున్నట్టు చెప్పారు. 2011 జనవరిలో వినియోగించిన విద్యుత్తుపై యూనిట్‌కు 122.39 పైసలు, 2012 అక్టోబర్‌లో వినియోగించిన విద్యుత్తుపై యూనిట్‌కు 54.70 పైసల వంతున ఈ నెల బిల్లులతో వసూలు చేస్తున్నట్లు వివరించారు. రానున్న రెండు నెలల విద్యుత్ బిల్లులతోపాటు ఇవి చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. విద్యుత్ బోర్డులు ఉన్నప్పుడు ఇంధన సర్దుబాటు చార్జీ వసూలు చేసే వారు కాదని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఇంధన చార్జీలు వసూలు చేయరని తెలిపారు. అప్పటి వరకు ప్రతినెలా వీటి వసూలు తప్పదని చెప్పారు. సంస్థకు ప్రతి నెలా విద్యుత్ బిల్లుల ద్వారా రూ. 4.8 కోట్ల ఆదాయం సమకూరుతుందని తెలిపారు. అందులో రూ. 2.3 కోట్లను సంస్థ పరిధిలో వినియోగదారులు వినియోగించే విద్యుత్ కొనుగోలుకు ఈపీడీసీఎల్‌కు ప్రతి నెలా చెల్లిస్తున్నామని చెప్పారు. రూ.1.5 కోట్ల వరకు సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులకు చెల్లిస్తున్నామన్నారు. మిగిలినవి కాంట్రాక్టు ఉద్యోగులు, ఇత ర కార్యకలాపాలకు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో సంస్థ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొంటున్నందున సంస్థకు రావలసిన ఆదాయం తగ్గింద ని చెప్పారు. సంస్థ పరిధిలో 20 ఏళ్ల క్రితం వేసిన 11 కెవి విద్యుత్ లైన్ కండక్టర్‌ను మార్పు చేయనున్నట్లు ఎమ్డీ తెలిపారు. ఈ మేరకు మార్చాల్సిన కండక్టర్‌ను గుర్తించి అంచనాలు తయారు చేయాలని అసిసెంట్ ఇంజనీర్లను ఆదేశించామన్నారు. కండక్టర్ మార్పుతో విద్యుత్ ప్రసారం మరింత మెరుగవుతుందని చెప్పారు. బిల్లు చెల్లించకపోతే చర్యలు విద్యుత్ బిల్లు బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించామని శేషుకుమార్ తెలిపారు. ఒక విద్యుత్ కనెక్షన్ బిల్లు బకాయి చెల్లించకపోతే అదే వ్యక్తి పేరు మీద మరో కనెక్షన్ ఉంటే దానికి విద్యుత్ నిలుపుదల చేస్తామన్నారు. బకాయిదారుల జాబితాలు తయారవుతున్నాయని చెప్పారు.