సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. జలాశయాన్ని ఎడమ కాలువతో అనుసంధానం చేసే సొరంగం (టన్నెల్) తవ్వకం పనులు పూర్తయ్యాయి. 919 మీటర్ల పొడవుతో 18 మీటర్ల వ్యాసంతో 20 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో ఈ సొరంగం తవ్వకం పనులను పూర్తిచేశామని.. లైనింగ్ పనులను ప్రారంభించామని పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు ‘సాక్షి’కి వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఈ పనుల అంచనా వ్యయాన్ని పెంచేసిన అప్పటి సీఎం చంద్రబాబు.. రూ.292.09 కోట్లకు కాంట్రాక్టు సంస్థకు అప్పగించి, కమీషన్లు వసూలుచేసుకున్నారు.
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఆ కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దుచేసి.. రూ.292.09 కోట్లనే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి.. రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. టీడీపీ సర్కార్ హయాంలో కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థే.. ఆ పనులను రూ.231.47 కోట్లకే చేయడానికి 2019, సెపె్టంబరు 19న ముందుకొచ్చింది. దీంతో ఖజానాకు రూ.60.62 కోట్లు ఆదా అయ్యాయి. దీనిద్వారా చంద్రబాబు కమీషన్ల బాగోతాన్ని సీఎం జగన్ రట్టుచేశారు. తక్కువ ఖర్చుతోనే సొరంగాన్ని పూర్తిచేయడం ద్వారా ప్రణాళికాబద్ధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడంలో సీఎం మరో అడుగు ముందుకేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
అనుసంధానాల పనులు కొలిక్కి..
పోలవరం జలాశయం గరిష్ట నీటిమట్టం 45.72 మీటర్లు (194.6 టీఎంసీలు). కనిష్ట నీటిమట్టం 41.15 మీటర్లు (119.4 టీఎంసీలు). కుడి కాలువను 174 కిమీల పొడవున 17,633 క్యూసెక్కులు (1.52 టీఎంసీ) సామర్థ్యంతో తవ్వారు. ఈ కాలువ కింద మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తారు. ఈ కాలువను జలాశయంతో అనుసంధానం చేసేలా జంట సొరంగాలు (ఒక్కొక్కటి పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో), హెడ్ రెగ్యులేటర్‌ను 2020లో సీఎం జగన్ పూర్తిచేశారు.
పోలవరం (గోదావరి)–ప్రకాశం బ్యారేజ్ (కృష్ణా)–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీఆర్సీ) ద్వారా పెన్నాను అనుసంధానం చేసే పనుల్లో భాగంగా జంట సొరంగాల సామర్థ్యాన్ని 20 వేల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు శ్రీకారం చుట్టారు. తాజాగా.. ఎడమ కాలువను అనుసంధానం చేసే సొరంగం తవ్వకం పనులు పూర్తిచేశారు. ఎడమ కాలువను 181.50 కిమీల పొడవున 17,561 క్యూసెక్కుల సామర్థ్యం (1.51 టీఎంసీ)తో చేపట్టారు.
ఈ పనుల్లో ఇప్పటికే 91% పూర్తయ్యాయి. ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు నీళ్లందించాలి. పోలవరం ప్రాజెక్టులో నీటి మట్టం 40.54 మీటర్ల స్థాయిలో ఉంటే ఎడమ కాలువ.. 40.23 మీటర్ల స్థాయిలో ఉంటే కుడి కాలువ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించవచ్చు. ఎడమ కాలువను అనుసంధానం చేసే సొరంగం పనులు తాజాగా పూర్తయ్యాయి. వరద తగ్గగానే హెడ్ రెగ్యులేటర్ పనులు ప్రారంభించి పూర్తిచేయనున్నారు.
ప్రణాళికాబద్ధంగా పూర్తిచేసే దిశగా..
ఇక కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు పనులను అప్పటి సీఎం చంద్రబాబు అస్తవ్యస్తంగా మార్చితే.. సీఎం జగన్ వాటిని గాడిలో పెట్టి ప్రణాళికాబద్ధంగా చేపట్టి వడివడిగా పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తిచేసి 2021, జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని 6.1 కిమీల పొడవున మళ్లించారు.
అలాగే, కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేపట్టిన పనులవల్ల గోదావరి వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్‌ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు చక్కదిద్దే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ మేరకు వాటిని పూర్తిచేసి.. ఆ తర్వాత ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి ప్రాజెక్టు ఫలాలను శరవేగంగా రైతులకు అందించే దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment