Left channel
-
పోలవరంలో మరో కీలక ఘట్టం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. జలాశయాన్ని ఎడమ కాలువతో అనుసంధానం చేసే సొరంగం (టన్నెల్) తవ్వకం పనులు పూర్తయ్యాయి. 919 మీటర్ల పొడవుతో 18 మీటర్ల వ్యాసంతో 20 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో ఈ సొరంగం తవ్వకం పనులను పూర్తిచేశామని.. లైనింగ్ పనులను ప్రారంభించామని పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు ‘సాక్షి’కి వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఈ పనుల అంచనా వ్యయాన్ని పెంచేసిన అప్పటి సీఎం చంద్రబాబు.. రూ.292.09 కోట్లకు కాంట్రాక్టు సంస్థకు అప్పగించి, కమీషన్లు వసూలుచేసుకున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఆ కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దుచేసి.. రూ.292.09 కోట్లనే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి.. రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. టీడీపీ సర్కార్ హయాంలో కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థే.. ఆ పనులను రూ.231.47 కోట్లకే చేయడానికి 2019, సెపె్టంబరు 19న ముందుకొచ్చింది. దీంతో ఖజానాకు రూ.60.62 కోట్లు ఆదా అయ్యాయి. దీనిద్వారా చంద్రబాబు కమీషన్ల బాగోతాన్ని సీఎం జగన్ రట్టుచేశారు. తక్కువ ఖర్చుతోనే సొరంగాన్ని పూర్తిచేయడం ద్వారా ప్రణాళికాబద్ధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడంలో సీఎం మరో అడుగు ముందుకేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అనుసంధానాల పనులు కొలిక్కి.. పోలవరం జలాశయం గరిష్ట నీటిమట్టం 45.72 మీటర్లు (194.6 టీఎంసీలు). కనిష్ట నీటిమట్టం 41.15 మీటర్లు (119.4 టీఎంసీలు). కుడి కాలువను 174 కిమీల పొడవున 17,633 క్యూసెక్కులు (1.52 టీఎంసీ) సామర్థ్యంతో తవ్వారు. ఈ కాలువ కింద మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తారు. ఈ కాలువను జలాశయంతో అనుసంధానం చేసేలా జంట సొరంగాలు (ఒక్కొక్కటి పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో), హెడ్ రెగ్యులేటర్‌ను 2020లో సీఎం జగన్ పూర్తిచేశారు. పోలవరం (గోదావరి)–ప్రకాశం బ్యారేజ్ (కృష్ణా)–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీఆర్సీ) ద్వారా పెన్నాను అనుసంధానం చేసే పనుల్లో భాగంగా జంట సొరంగాల సామర్థ్యాన్ని 20 వేల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు శ్రీకారం చుట్టారు. తాజాగా.. ఎడమ కాలువను అనుసంధానం చేసే సొరంగం తవ్వకం పనులు పూర్తిచేశారు. ఎడమ కాలువను 181.50 కిమీల పొడవున 17,561 క్యూసెక్కుల సామర్థ్యం (1.51 టీఎంసీ)తో చేపట్టారు. ఈ పనుల్లో ఇప్పటికే 91% పూర్తయ్యాయి. ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు నీళ్లందించాలి. పోలవరం ప్రాజెక్టులో నీటి మట్టం 40.54 మీటర్ల స్థాయిలో ఉంటే ఎడమ కాలువ.. 40.23 మీటర్ల స్థాయిలో ఉంటే కుడి కాలువ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించవచ్చు. ఎడమ కాలువను అనుసంధానం చేసే సొరంగం పనులు తాజాగా పూర్తయ్యాయి. వరద తగ్గగానే హెడ్ రెగ్యులేటర్ పనులు ప్రారంభించి పూర్తిచేయనున్నారు. ప్రణాళికాబద్ధంగా పూర్తిచేసే దిశగా.. ఇక కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు పనులను అప్పటి సీఎం చంద్రబాబు అస్తవ్యస్తంగా మార్చితే.. సీఎం జగన్ వాటిని గాడిలో పెట్టి ప్రణాళికాబద్ధంగా చేపట్టి వడివడిగా పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తిచేసి 2021, జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని 6.1 కిమీల పొడవున మళ్లించారు. అలాగే, కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేపట్టిన పనులవల్ల గోదావరి వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు చక్కదిద్దే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ మేరకు వాటిని పూర్తిచేసి.. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి ప్రాజెక్టు ఫలాలను శరవేగంగా రైతులకు అందించే దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. -
సాగర్ నీరొస్తోంది..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వర్షాలు కురుస్తున్న ఈ తరుణంలో జిల్లా రైతాంగానికి మరో శుభవార్త. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమకాల్వకు నీరు విడుదలయింది. తొలుత తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేస్తామని చెప్పినా, ఎగువన వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో సాగు అవసరాల నిమిత్తం కృష్ణా జలాలపై ఏర్పాటు చేసిన బోర్డు అనుమతి మేరకు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బుధవారం నీరు విడుదల చేశారు. ఈ నీరు వారం రోజుల్లోపే మొదటి జోన్ పరిధిలోనికి వచ్చే జిల్లాలోని 25వేల ఎకరాలకు అందుతుందని ఎన్నెస్పీ అధికారుల సమాచారం. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి ఉండడం, శ్రీశైలం ప్రాజెక్టుకు మరో 25 అడుగుల నీరు వస్తే నిండే పరిస్థితి ఉండడంతో పాటు ఎడమ కాల్వ పరిధిలోని రైతాంగం ఎక్కువగా కరెంటుపై ఆధారపడుతున్నందున పవర్‌లోడ్ తగ్గించుకునేందుకు కృష్ణా జలాలను ఎడమకాల్వకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో ఎన్నెస్పీ మొదటి జోన్ పరిధిలో ఉన్న నల్లగొండ జిల్లాలోని 3.95 లక్షల ఎకరాలతో పాటు జిల్లాలోని 25 వేల ఎకరాలకు పైగా భూమికి సాగునీరు త్వరలోనే అందనుంది. ఉధృతిని బట్టి రెండోజోన్‌కు కూడా మొదటి జోన్ పరిధిలో జిల్లాలో కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో 25 వేల ఎకరాలకు పైగా ఉన్నాయి. అయితే, రెండో జోన్లో మాత్రం మొత్తం 13 మండలాలకు చెందిన 2.58 లక్షల ఎకరాలు (లిఫ్ట్‌లతో కలిపి) సాగవుతోంది. రెండో జోన్ వరకు నీరు చేరితే జిల్లాలోని ఎక్కువ శాతం రైతాంగానికి లబ్ధి చేకూరనుంది. శ్రీశైలం ప్రాజెక్టు కూడా త్వరలోనే నిండుతుందని, సాగర్‌లో కూడా ఇప్పుడు 514.5 అడుగుల నీటి మట్టం ఉన్నందున వరద ఉధృతిని బట్టి రెండు మూడు రోజుల్లో రెండోజోన్‌కు కూడా నీరు విడుదల చేసే అవకాశం ఉందని ఎన్నెస్పీ అధికారులు చెపుతున్నారు. అదే జరిగితే రెండో జోన్ పరిధిలోనికి వచ్చే ఖమ్మం రూరల్, రఘునాథపాలెం, చింతకాని, కొణిజర్ల, వైరా, తల్లాడ, కల్లూరు, బోనకల్, మధిర, ఎర్రుపాలెం, సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల రైతులకు కూడా భరోసా కలగనుంది. కరెంటు కష్టాల నుంచి గట్టెక్కేందుకే... ముఖ్యంగా కరెంటు కష్టాల నుంచి గట్టెక్కాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు వర్షాభావ పరిస్థితుల్లో కూడా జిల్లాకు సాగర్ నీరు అందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణలో, మరీ ముఖ్యంగా ఎన్నెస్పీ పరిధిలోనికి రాని ప్రాంతాల్లో ఎక్కువగా వ్యవసాయం కోసం విద్యుత్ వినియోగిస్తున్నారు. దీనికి తోడు కాల్వ కింద భూముల్లో కూడా నీరు రాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. బోర్ల ద్వారా పంటల సాగుకు రైతులు యత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్ వినియోగానికి, సరఫరాకు వ్యత్యాసం భారీగా ఉండడంతో అడ్డగోలు కరెంటు కోతలు తప్పడం లేదు. వ్యవసాయానికి కూడా సరిగా విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతాంగం రోడ్డెక్కుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత నీటి లభ్యతను బట్టి సాగర్ ఎడమకాల్వకు నీరు విడుదల చేయాలని కృష్ణా జలాల వినియోగంపై ఏర్పాటు చేసిన బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న విజ్ఞప్తి మేరకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో నీటిని విడుదల చేశారు.