సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వర్షాలు కురుస్తున్న ఈ తరుణంలో జిల్లా రైతాంగానికి మరో శుభవార్త. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమకాల్వకు నీరు విడుదలయింది. తొలుత తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేస్తామని చెప్పినా, ఎగువన వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో సాగు అవసరాల నిమిత్తం కృష్ణా జలాలపై ఏర్పాటు చేసిన బోర్డు అనుమతి మేరకు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బుధవారం నీరు విడుదల చేశారు.
ఈ నీరు వారం రోజుల్లోపే మొదటి జోన్ పరిధిలోనికి వచ్చే జిల్లాలోని 25వేల ఎకరాలకు అందుతుందని ఎన్నెస్పీ అధికారుల సమాచారం. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి ఉండడం, శ్రీశైలం ప్రాజెక్టుకు మరో 25 అడుగుల నీరు వస్తే నిండే పరిస్థితి ఉండడంతో పాటు ఎడమ కాల్వ పరిధిలోని రైతాంగం ఎక్కువగా కరెంటుపై ఆధారపడుతున్నందున పవర్‌లోడ్ తగ్గించుకునేందుకు కృష్ణా జలాలను ఎడమకాల్వకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో ఎన్నెస్పీ మొదటి జోన్ పరిధిలో ఉన్న నల్లగొండ జిల్లాలోని 3.95 లక్షల ఎకరాలతో పాటు జిల్లాలోని 25 వేల ఎకరాలకు పైగా భూమికి సాగునీరు త్వరలోనే అందనుంది.
ఉధృతిని బట్టి రెండోజోన్‌కు కూడా
మొదటి జోన్ పరిధిలో జిల్లాలో కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో 25 వేల ఎకరాలకు పైగా ఉన్నాయి. అయితే, రెండో జోన్‌లో మాత్రం మొత్తం 13 మండలాలకు చెందిన 2.58 లక్షల ఎకరాలు (లిఫ్ట్‌లతో కలిపి) సాగవుతోంది. రెండో జోన్ వరకు నీరు చేరితే జిల్లాలోని ఎక్కువ శాతం రైతాంగానికి లబ్ధి చేకూరనుంది.
శ్రీశైలం ప్రాజెక్టు కూడా త్వరలోనే నిండుతుందని, సాగర్‌లో కూడా ఇప్పుడు 514.5 అడుగుల నీటి మట్టం ఉన్నందున వరద ఉధృతిని బట్టి రెండు మూడు రోజుల్లో రెండోజోన్‌కు కూడా నీరు విడుదల చేసే అవకాశం ఉందని ఎన్నెస్పీ అధికారులు చెపుతున్నారు. అదే జరిగితే రెండో జోన్ పరిధిలోనికి వచ్చే ఖమ్మం రూరల్, రఘునాథపాలెం, చింతకాని, కొణిజర్ల, వైరా, తల్లాడ, కల్లూరు, బోనకల్, మధిర, ఎర్రుపాలెం, సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల రైతులకు కూడా భరోసా కలగనుంది.
కరెంటు కష్టాల నుంచి గట్టెక్కేందుకే...
ముఖ్యంగా కరెంటు కష్టాల నుంచి గట్టెక్కాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు వర్షాభావ పరిస్థితుల్లో కూడా జిల్లాకు సాగర్ నీరు అందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణలో, మరీ ముఖ్యంగా ఎన్నెస్పీ పరిధిలోనికి రాని ప్రాంతాల్లో ఎక్కువగా వ్యవసాయం కోసం విద్యుత్ వినియోగిస్తున్నారు. దీనికి తోడు కాల్వ కింద భూముల్లో కూడా నీరు రాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి.
బోర్ల ద్వారా పంటల సాగుకు రైతులు యత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్ వినియోగానికి, సరఫరాకు వ్యత్యాసం భారీగా ఉండడంతో అడ్డగోలు కరెంటు కోతలు తప్పడం లేదు. వ్యవసాయానికి కూడా సరిగా విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతాంగం రోడ్డెక్కుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత నీటి లభ్యతను బట్టి సాగర్ ఎడమకాల్వకు నీరు విడుదల చేయాలని కృష్ణా జలాల వినియోగంపై ఏర్పాటు చేసిన బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న విజ్ఞప్తి మేరకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో నీటిని విడుదల చేశారు.
సాగర్ నీరొస్తోంది..
Published Thu, Aug 7 2014 1:58 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM
Advertisement