ఆల్మట్టిపైనే ఆశలన్నీ..
Published Sat, Jul 16 2016 8:23 PM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
పుష్కరాలకు సాగర్ ప్రాజెక్ట్ కళకళలాడుతుందనే ఆశాభావం
గత పుష్కరాల సమయంలోనూ చివరి నిమిషంలో వచ్చిన నీరు
అప్పుడు 570 అడుగులకు చేరిక..
ప్రస్తుత నీటిమట్టం 504 అడుగులే..
ఇప్పుడు కూడా అదే స్థాయిలో రావచ్చంటున్న అధికారులు
570 అడుగులకు రావాలంటే ఇంకా 135 టీఎంసీలు కావాలి
లక్ష క్యూసెక్కుల చొప్పున 15 రోజులు వచ్చినా
పుష్కరాలకు ఢోకా లేనట్టే
ఆల్మట్టికి రోజూ 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం..
నాలుగు రోజుల్లో నిండే అవకాశం..
నల్లగొండ : ఎగువ కర్ణాటకలో కురుస్తున్న వర్షాలు కృష్ణా పుష్కరాలపై ఆశలు చిగురింపజేస్తున్నాయి. పుష్కరాలకు ఇంకా 25 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు వెలవెలబోతున్నా... అప్పటికి కళకళలాడుతుందనే అభిప్రాయం ఏర్పడుతోంది. అయితే, గత పుష్కరాలను ఒక్కసారి స్మరించుకుంటే అప్పుడు కూడా (2004లో) పాజెక్టులోకి నీళ్లు చివరి నిమిషంలోనే వచ్చి చేరాయి. మొత్తం 570 అడుగుల వరకు సాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చాయని అప్పటి లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 503.9 అడుగులే ఉన్నా పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి ఖచ్చితంగా ఆ స్థాయికి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి డ్యాంకు రోజుకు 2లక్షలకు పైగా క్యూసెక్కుల (దాదాపు 16 టీఎంసీలు) ఇన్‌ఫ్లో ఉండడంతో పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి సాగర్ ప్రాజెక్టు కూడా కళకళలాడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
మధ్యలో మూడు ప్రాజెక్టులు..
ఆల్మట్టి ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున ఇన్‌ఫ్లో వస్తోంది. ఆ ప్రాజెక్టుకు రోజుకు మూడు రోజుల క్రితం లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, మొన్న 1.75 లక్షలకు, ఆ తర్వాత 2లక్షలకు, శుక్రవారం 2,00, 859 క్యూసెక్కులకు చేరింది. అంటే ఒక్కరోజే 17 టీఎంసీలకు పైగా నీరు వచ్చింది. ఆల్మట్టిలో ప్రస్తుతం ఉన్న నీటికి తోడు ఆ ప్రాజెక్టు నిండేందుకు మరో 60 టీఎంసీల నీరు వస్తే సరిపోతుంది. అంటే ఇదే ఇన్‌ఫ్లో కొనసాగితే మంగళవారం నాటికి ఆల్మట్టి నిండే అవకాశాలున్నాయి. అప్పుడు నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులకు నీరు త్వరగానే వస్తుంది. ఎందుకంటే ఈ రెండు ప్రాజెక్టులు కలిపినా మొత్తం నీటి నిల్వ 49 టీఎంసీలే. ఇప్పటికే వాటిలో 18 టీఎంసీలున్నాయి. అంటే మరో 31 టీఎంసీలు వస్తే చాలు. ఆ తర్వాత శ్రీశైలంలో ఇంకా 190 టీఎంసీల వరకు నీరు కావాలి. ఈ ప్రాజెక్టులోకి కూడా 2లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంటే 10 రోజుల్లో నిండుతుంది. అంటే మొత్తం కలిపి 15 రోజుల్లో ఇదే వరద కొనసాగితే సాగర్‌కు నీటి విడుదల ప్రారంభం అవుతుంది. అంటే దాదాపు ఆగస్టు నెల ప్రారంభం లేదా అంతకంటే ముందే నీళ్లు రాక మొదలవుతుంది. అప్పటికీ 12 రోజుల సమయం ఉంటుంది కనుక ఇబ్బంది లేదని అధికారులు అంటున్నారు. అయితే, శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండకపోయినా, విద్యుదుత్పాదన కోసం కిందికి నీళ్లు వదిలితే ఆ ఇన్‌ఫ్లో సాగర్‌లోకి వచ్చి చేరుతుంది కాబట్టి పుష్కరాల నాటికి మన జిల్లాలో ప్రవహించే కృష్ణా నదిలోకి పుష్కలంగా నీరు వస్తుందని అంచనా.
సాగర్ లెక్క ఇది...
వాస్తవానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులు. దాన్ని టీఎంసీల్లో లెక్కిస్తే 312.04 టీఎంసీలు. ప్రస్తుత సాగర్‌లో ఉన్నది కేవలం 503.9 అడుగులే. అంటే 121 టీఎంసీలే. అయితే, అధికారులు ఆశిస్తున్నట్టుగా సాగర్‌నీటి మట్టం 570 అడుగులకు చేరాలంటే (కిందికి నీళ్లు వదలాలంటే 570 అడుగుల మేర నీళ్లు రావాలి.) 256.5 టీఎంసీల నీళ్లు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నవి కాకుండా ఇంకా 135 టీఎంసీల వరకు నీళ్లు రావాలన్నమాట. ఈ 135 టీఎంసీలను క్యూసెక్కుల్లో లెక్కిస్తే ఒక్క టీఎంసీకి 11,575 క్యూసెక్కుల చొప్పున 15,62,625 క్యూసెక్కుల నీళ్లు కావాలి. అలా కావాలంటే సాగర్‌కు ఇన్‌ఫ్లో రోజుకు లక్ష క్యూసెక్యుల చొప్పున 15 రోజులొస్తే సరిపోతుందన్న మాట. పుష్కరాలు ఆగస్టు 12 నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈనెల 25 నుంచి ఇన్‌ఫ్లో ప్రారంభం అయినా సరిపోతుందని అధికారులంటున్నారు. ఇప్పటికే ఆల్మట్టికి వస్తున్న ప్రవాహం చూస్తుంటే మరో 3, 4 రోజుల్లో అది నిండిపోతుందని, అప్పుడు సాగర్‌కు ఒకటిన్నర రోజుల్లో నీళ్లు వచ్చే అవకాశాలుంటాయని అధికారులు చెపుతున్నారు. అయితే, మధ్యలో ఉన్న ప్రాజెక్టుల్లో నీరు నిండేందుకు మరో వారం, పది రోజులు తీసుకున్నా... 25 నుంచి లక్ష క్యూసెక్కుల చొప్పున వస్తే సరిపోతుందని, ఇంకా అదనంగా వస్తే ఇంకా తక్కువ రోజుల్లోనే సాగర్ కళకళలాడుతుందనే అధికారులు చెపుతున్నారు. అయితే, తుంగభద్ర కు కూడా రోజుకో రెండు టీఎంసీల చొప్పున ఇన్‌ఫ్లో వస్తోంది. ఆ ఇన్‌ఫ్లో కూడా పెరిగితే అక్కడి నుంచి సాగర్‌కు ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి ఎప్పుడో కానీ జూలై మాసంలో సాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో ఉండదు. ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం అయి రెండు, మూడు వారాల్లో గేట్లు పైకి ఎత్తే పరిస్థితి వస్తుంది. అది సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుంది (వరద ఉంటే). ఈ పరిస్థితుల్లో ఎగువన వస్తున్న వరదలను చూస్తే పుష్కరాల నాటికి సాగర్ నీటికి ఢోకా ఉండబోదని అధికారులు చెపుతున్నారు. పుష్కరాల నాటికి సాగర్‌లో నీళ్లు నిండాలని, నీళ్లు లేవని భక్తులు నిరాశ చెందకుండా పుష్కరాలు పూర్తికావాలని ఆశిద్దాం.
Advertisement
Advertisement