
ఆధార్‌తో 67 కోట్ల ఖాతాలు అనుసంధానం
ఐటీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశీయంగా ప్రస్తుతం 110 కోట్ల బ్యాంకు ఖాతాలుండగా.. సుమారు 67 కోట్ల ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం అయినట్లు కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఇందుకోసం గ్రామాల స్థాయిలోని కామన్ సర్వీసెస్ సెంటర్స్ (సీఎస్‌సీ) ద్వారా ఔత్సాహిక వ్యాపారవేత్తలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. సీఎస్‌సీలు అందించే ఆధార్ సర్వీసులపై వర్క్‌షాప్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రసాద్ ఈ విషయాలు చెప్పారు. సీఎస్‌సీలు దాదాపు 22 కోట్ల ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌లకు సర్వీసులు అందించాయని చెబుతూ... ఇతర ఎన్‌రోల్‌మెంట్ ఏజెన్సీల నుంచి పోటీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.
సీఎస్‌సీ బిజినెస్ మోడల్ మరింతగా రూపాంతరం చెందుతుందని, మరిన్ని ప్రభుత్వ విభాగాలు ఇంకా కొత్త సర్వీసులు, పథకాలను ఈ నెట్‌వర్క్ ద్వారా గ్రామ స్థాయికి చేర్చనున్నాయని మంత్రి చెప్పారు. ప్రస్తుతం సీఎస్‌సీల్లో 10 లక్షల మంది పనిచేస్తున్నారని, మరిన్ని సర్వీసులు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో రాబోయే 4–5 ఏళ్లలో ఈ సంఖ్య ఒక కోటికి చేరవచ్చన్నారు. ఆధార్, మొబైల్ నంబర్‌తో జన్‌ధాన్ ఖాతాలను అనుసంధానం చేసి, సబ్సిడీలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే బదలాయించడం వల్ల ఖజానాకు రూ. 50,000 కోట్ల మేర ఆదా అయ్యిందని చెప్పారు. ఇది గతంలో మధ్యవర్తుల జేబుల్లోకి చేరేదన్నారు.