ప్రధానమంతత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన రెండు రోజులపాటు కొనసాగింది. శుక్రవారం జరిగిన బాస్టిల్ డే వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీని ఫ్రాన్స్ అత్యన్నత పురస్కారంతో ఆ దేశ అధ్యక్షుడు సన్మానించారు. అయితే.. పర్యటనలో భాగంగా దౌత్య సంబంధాలకు తోడు సంస్కృతిక అంశాలను కూడా జోడించారు. ఆ దేశ పెద్దలకు ప్రధాని మోదీ భారత సంస్కృతికి చెందిన విలక్షణమైన కానుకలను అందించారు. అధ్యక్షుడు మెక్రాన్‌కు గంధపు చెక్కతో తయారు చేసిన సితార్‌ను బహుకరించారు. దక్షిణ భారతదేశంలో గంధపు చెక్కతో చేసే పూరాతన హస్తకళకు చెందిన కళారూపం. సరస్వతీ దేవీ, జాతీయ పక్షి నెమళ్లతో పాటు గణేశుని ప్రతిరూపాలు ఆ సితార్‌పై ఉన్నాయి.
మెక్రాన్ సతీమణి చేత.. తెలంగాణ చీర..
ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగిట్టే మెక్రాన్‌కు ప్రధాని మోదీ పోచంపల్లి ఇక్కత్ చీరను బహుకరించారు. చీరను చందనం పెట్టెలో పెట్టి ఆమెకు అందించారు. ఇక్కత్ చీర తెలంగాణకు చెందిన పోచంపల్లిలో ఉద్భవించిన అరుదైన కళారూపం. ఆకర్షనీయమైన రంగులతో క్లిష్టమైన డిజైన్‌లకు ప్రసిద్ధి చెందిన కళాఖండం. చందనం పెట్టెపై కూడా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలు చెక్కబడి ఉన్నాయి.
మార్బుల్ ఇన్‌లే వర్క్ టేబుల్..
ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఎలిసబెత్ బోర్న్‌కు 'మార్బుల్ ఇన్‌లే వర్క్'తో అలంకరించబడిన టేబుల్‌ను ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు. రాజస్థాన్‌లోని మక్రానా నుంచి పాలరాతిని, దేశంలో విలువైన రాళ్లను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. రాళ్లను కత్తిరించి అందంగా తయారు చేసే కళాఖండం.
కాశ్మీరీ కార‍్పెట్..
ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యేల్ బ్రౌన్-పివెట్‌కు చేతితో అల్లిన కాశ్మీరీ కార‍్పెట్‌ను బహుకరించారు ప్రధాని మోదీ. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ కలిగిన కళారూపం ఇది. మృదుత్వం కలిగి వివిధ కోణాల్లో వేరు వేరు రంగుల్ని కలిగి ఉంటుంది.
గంధపు ఏనుగు..
ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు గెరార్డ్ లార్చెర్‌కు గంధపు చెక్కతో చెక్కిన ఏనుగు బొమ్మను ప్రధాని మోదీ బహుకరించారు. ఏనుగు భారతీయ సంస్కృతిలో జ్ఞానం, బలాన్ని సూచిస్తుంది. ప్రకృతికి, కళలకు మధ్య సామరస్యాన్ని సూచించే అందమైన ప్రతిబింబం ఇది.
ఇదీ చదవండి: ప్రధాని ఫ్రాన్స్ పర్యటన.. మోదీ భారీ ప్రకటనలు..
Comments
Please login to add a commentAdd a comment