కశింకోట,న్యూస్‌లైన్: ఇంధన సర్దుబాటు చార్జీల వల్ల విద్యుత్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయని ఆర్‌ఈసీఎస్ మేనేజింగ్ డెరైక్టర్ బి.శేషుకుమార్ పేర్కొన్నారు. స్థానిక ఆర్‌ఈసీఎస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వినియోగదారులకు ఈ నెల వచ్చిన విద్యుత్ బిల్లులతో రెండు నెలలకు సంబంధించి ఇంధన సర్ధుబాటు చార్జీలను వసూలు చేస్తున్నట్టు చెప్పారు.
2011 జనవరిలో వినియోగించిన విద్యుత్తుపై యూనిట్‌కు 122.39 పైసలు, 2012 అక్టోబర్‌లో వినియోగించిన విద్యుత్తుపై యూనిట్‌కు 54.70 పైసల వంతున ఈ నెల బిల్లులతో వసూలు చేస్తున్నట్లు వివరించారు. రానున్న రెండు నెలల విద్యుత్ బిల్లులతోపాటు ఇవి చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. విద్యుత్ బోర్డులు ఉన్నప్పుడు ఇంధన సర్దుబాటు చార్జీ వసూలు చేసే వారు కాదని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఇంధన చార్జీలు వసూలు చేయరని తెలిపారు.
అప్పటి వరకు ప్రతినెలా వీటి వసూలు తప్పదని చెప్పారు. సంస్థకు ప్రతి నెలా విద్యుత్ బిల్లుల ద్వారా రూ. 4.8 కోట్ల ఆదాయం సమకూరుతుందని తెలిపారు. అందులో రూ. 2.3 కోట్లను సంస్థ పరిధిలో వినియోగదారులు వినియోగించే విద్యుత్ కొనుగోలుకు ఈపీడీసీఎల్‌కు ప్రతి నెలా చెల్లిస్తున్నామని చెప్పారు. రూ.1.5 కోట్ల వరకు సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులకు చెల్లిస్తున్నామన్నారు. మిగిలినవి కాంట్రాక్టు ఉద్యోగులు, ఇత ర కార్యకలాపాలకు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
సమైక్యాంధ్ర ఉద్యమంలో సంస్థ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొంటున్నందున సంస్థకు రావలసిన ఆదాయం తగ్గింద ని చెప్పారు. సంస్థ పరిధిలో 20 ఏళ్ల క్రితం వేసిన 11 కెవి విద్యుత్ లైన్ కండక్టర్‌ను మార్పు చేయనున్నట్లు ఎమ్‌డీ తెలిపారు. ఈ మేరకు మార్చాల్సిన కండక్టర్‌ను గుర్తించి అంచనాలు తయారు చేయాలని అసిసెంట్ ఇంజనీర్లను ఆదేశించామన్నారు. కండక్టర్ మార్పుతో విద్యుత్ ప్రసారం మరింత మెరుగవుతుందని చెప్పారు.
బిల్లు చెల్లించకపోతే చర్యలు
విద్యుత్ బిల్లు బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించామని శేషుకుమార్ తెలిపారు. ఒక విద్యుత్ కనెక్షన్ బిల్లు బకాయి చెల్లించకపోతే అదే వ్యక్తి పేరు మీద మరో కనెక్షన్ ఉంటే దానికి విద్యుత్ నిలుపుదల చేస్తామన్నారు. బకాయిదారుల జాబితాలు తయారవుతున్నాయని చెప్పారు.
సర్దు‘పోటు’ వల్లే బిల్లుల భారం
Published Sat, Sep 7 2013 4:13 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM
Advertisement
Advertisement