
పెట్రోలు రేటేమో వంద రూపాయలు దాటేసింది..
మోటర్‌సైకిల్ ఇచ్చే మైలేజీనేమో రోజురోజుకూ తగ్గిపోతోంది!
రోజూ ఆఫీసుకెళ్లేందుకు జేబులు ఖాళీ అవుతున్నాయి!
ఏం చేద్దాం?
ఈ సమస్య మీది మాత్రమే కాదు.. మీలా చాలామంది ఎదుర్కొంటున్నదే! అయితే..
ఇంకొంత కాలం గడిస్తే.. మోటర్‌సైకిల్ మాత్రమే కాదు.. పెట్రోలు, డీజిల్ ఇంజిన్లు ఉన్న ప్రతి వాహనం మైలేజీ పెరుగుతుందని అంటోంది అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ(Pennsylvania State University)!. ఇందుకోసం వాహనాల పొగ గొట్టాల నుంచి వెలువడే వేడిని.. విద్యుత్తుగా మార్చేందుకు తామో అద్భుతమైన టెక్నాలజీని కనుక్కున్నట్లు ప్రకటించింది!.
మీకు తెలుసా?
మీరు వాడే వాహనం ఎంత ఇంధనం వృథా చేస్తోందో? సుమారు 75 శాతం. అంటే.. మీరు ఖర్చు పెట్టే వంద రూపాయల్లో 75 రూపాయలు పొగగొట్టం నుంచి వెలువడే పొగ, వేడి రూపంలో వృథా అవుతూంటుంది. అలాగే ఈ వాహనాలు మీ జేబులకు మాత్రమే కాదు.. కాలుష్యం రూపంలో ఆకాశంలోని ఓజోన్ పొరకూ చిల్లు పెట్టేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే పెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు వాహనాల వేడిని విద్యుత్తుగా మారుస్తామన్న పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది. వేడిని విద్యుత్తుగా మార్చడం ఎలా? అని సందేహంగా ఉంటే.. థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ల(Thermoelectric Generator) గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. క్లుప్తంగా టీఈజీ(TEG)లని పిలుద్దాం వీటిని!
వాహనాల పొగగొట్టాలపై వీటిని అమరిస్తే చాలు.. అక్కడి వేడిని పీల్చుకుని విద్యుత్తుగా మారుస్తాయి. వేడి కారణంగా టీఈజీల్లోని ప్రత్యేక పదార్థంలో ఉండే ఎలక్ట్రాన్లు చైతన్యవంతమవుతాయి. ఆ తరువాత ఈ ఎలక్ట్రాన్లు చల్లగా ఉండే వైపునకు వెళ్లే ప్రయత్నం చేస్తాయి. ఎలక్ట్రాన్ల క్రమ ప్రవాహాన్నే కరెంట్ అంటామన్నది మీరు చిన్నప్పుడే చదువుకుని ఉంటారు. పెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన టీఈజీలను బిస్మత్ టెల్యురైడ్ అనే ప్రత్యేక పదార్థంతో తయారు చేశారు. ఇది ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని ప్రోత్సహించే పదార్థం.

టీఈజీలు కొత్తవి కాదు కానీ...
నిజానికి టీఈజీలు కొత్తవేమీ కాదు. చాలాకాలంగా ఉన్నవే. కాకపోతే పాతవాటితో సమస్యలు ఎక్కువ. వాటిని అధిమించేందుకు శాస్త్రవేత్తలు పైన చిత్రంలో చూపినట్లు ఉండే ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. కంప్యూటర్లలో వేడిని తగ్గించేందుకు ఉపయోగించే హీట్‌సింక్ లాంటిదన్నమాట ఇది. నమూనా టీఈజీలతో పెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాలు కూడా నిర్వహించారు.
టూవీలర్ ఎగ్జాస్ట్ పైపునకు ఈ గొట్టం తగిలించినప్పుడు 40 వాట్ల వరకూ విద్యుత్తు ఉత్పత్తి అయ్యింది. కార్లలో వాడినప్పుడు 56 వాట్లు, హెలీకాప్టర్ల పొగ గొట్టాలకు చేర్చినప్పుడు 146 వాట్ల వరకూ విద్యుత్తు ఉత్పత్తి అయ్యింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ టీఈజీలను వాహనాలపై ఏర్పాటు చేసుకోవడం చాలా సులువు. పెట్రోలు, డీజిల్ ఇంజిన్లలో అమర్చుకుని మొబైల్ ఫోన్ ఛార్జింగ్ వంటివి చేసుకోవచ్చు. హైబ్రిడ్ వాహనాల్లో ఏర్పాటు చేసుకుంటే.. మైలేజీని పెంచుకోవచ్చు.

Comments
Please login to add a commentAdd a comment