నీటి లభ్యత తేల్చాకే  కావేరికి గోదారి  | Nine States Disagreements On Godavari Cauvery Connection | Sakshi
Sakshi News home page

నీటి లభ్యత తేల్చాకే  కావేరికి గోదారి 

Published Sat, Oct 30 2021 10:20 AM | Last Updated on Sat, Oct 30 2021 10:20 AM

Nine States Disagreements On Godavari Cauvery Connection - Sakshi

లెక్కలకు పొంతనేదీ?: ఏపీ
గోదావరిలో నీటి లభ్యతపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), వ్యాప్కోస్, ఎన్‌డబ్ల్యూడీఏ లెక్కలకు పొంతన లేదు. నీటి లభ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి. 
75 శాతం లభ్యత ఆధారంగా ఉమ్మడి రాష్ట్రంలో గోదావరిలో 1,430 టీఎంసీల లభ్యత ఉంటుందని వ్యాప్కోస్‌ లెక్క కట్టింది. ఇందులో 775 టీఎంసీలను వినియోగించుకునేలా ఏపీ, 655 టీఎంసీలను వాడుకునేలా తెలంగాణ ప్రాజెక్టులు చేపట్టినందున కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి నీటి లభ్యత లేదు. 
జీ–1 నుంచి జీ–11 వరకూ ఎగువ రాష్ట్రాలకు కేటాయించగా మిగిలిన నికర జలాలను దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి ట్రిబ్యునల్‌ కేటాయించింది. మిగులు జలాలపై స్వేచ్ఛ ఇచ్చింది. 
అనుసంధానం చేపట్టేటప్పుడు దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులు పరిరక్షించాలి. ప్రవాహం తక్కువగా ఉన్న సమయంలో నీటిని తరలిస్తే దిగువ రాష్ట్రమైన ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటాయి. 
కొత్త రిజర్వాయర్లు నిర్మించకుండా అనుసంధానం అసాధ్యం. మహానది నుంచి 229 టీఎంసీలను పోలవరం దిగువన గోదావరిలో పోస్తే ఏం ప్రయోజనం? ధవళేశ్వరం 
నుంచి వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిందే. 
లభ్యతను శాస్త్రీయంగా తేల్చి ఏపీలో దుర్భిక్ష ప్రాంతాల అవసరాలు తీర్చాకే మిగిలిన నీటిని ఇతర రాష్ట్రాలకు తరలించేలా అనుసంధానం చేపట్టాలి. 

మాకు గరిష్టంగా కేటాయించాలి: తెలంగాణ
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానంపై తొమ్మిది రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. శాస్త్రీయంగా అధ్యయనం చేసి గోదావరిలో నీటి లభ్యత తేల్చాకే అనుసంధానం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్పష్టం చేయగా తమకు కేటాయించిన నీటిని తరలించేందుకు అంగీకరించే ప్రశ్నే లేదని ఛత్తీస్‌గఢ్‌ పేర్కొంది. కృష్ణా బేసిన్‌కు తరలించిన గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా కావాలని మహారాష్ట్ర, కర్ణాటక పట్టుబట్టగా కావేరి నీటిలో అదనపు వాటా కావాలని కేరళ డిమాండ్‌ చేసింది. మహానదిలో నీటి లభ్యత లేని నేపథ్యంలో మహానది–గోదావరి అనుసంధానంపై ఒడిశా, మధ్యప్రదేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేశాయి. కావేరికి కనీసం 216 టీఎంసీల గోదావరి జలాలనైనా తరలించాలని తమిళనాడు, పుదుచ్చేరి విజ్ఞప్తి చేశాయి.

రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించాకే నదుల అనుసంధానాన్ని చేపడతామని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) డైరెక్టర్‌ జనరల్‌ భోపాల్‌సింగ్‌ తెలిపారు. గోదావరి–కావేరి అనుసంధానంపై ఏకాభిప్రాయం సాధించే లక్ష్యంతో శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధ నుంచి భోపాల్‌సింగ్‌ నేతృత్వంలోని సంప్రదింపుల కమిటీ వర్చువల్‌ విధానంలో తొమ్మిది రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు.

బేసిన్లు.. ట్రిబ్యునళ్ల అవార్డులు పక్కన పెట్టండి 
నీటి లభ్యత అధికంగా ఉన్న నదుల నుంచి జలాలను మళ్లించడం ద్వారా దేశంలో తాగు, సాగునీటి కష్టాలను అధిగమించేందుకు అనుసంధానం చేపట్టామని భోపాల్‌సింగ్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇచ్చంపల్లి నుంచి జూన్‌ – అక్టోబర్‌ల మధ్య 247.19 టీఎంసీలను నాగార్జునసాగర్‌(కృష్ణా), సోమశిల(పెన్నా) మీదుగా గ్రాండ్‌ ఆనకట్ట(కావేరి)కి తరలించేలా ప్రతిపాదన రూపొందించామన్నారు. ఆవిరి, ప్రవాహ నష్టాలుపోనూ ఆంధ్రప్రదేశ్‌కు 79.94, తెలంగాణకు 65.8, తమిళనాడుకు 84.01 టీఎంసీలను ఇస్తామన్నారు.

తద్వారా కోటి మందికి తాగునీరు పది లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుందని చెప్పారు. రూ.85 వేల కోట్లతో చేపట్టే అనుసంధానం డీపీఆర్‌ను బేసిన్‌ పరిధిలోని తొమ్మిది రాష్ట్రాలకు పంపామన్నారు. మహానది– గోదావరి అనుసంధానం ద్వారా రెండో దశలో కావేరికి 229 టీఎంసీలను తరలిస్తామన్నారు. నీటి లోటు ఎదుర్కొంటున్న కృష్ణా, కావేరిలకు జలాలను తరలించాలనే కృత నిశ్చయంతో కేంద్రం ఉందన్నారు. బేసిన్లు, ట్రిబ్యునళ్ల అవార్డులను పక్కన పెట్టి దేశ విశాల ప్రయోజనాల కోసం అనుసంధానానికి సహకరించాలని కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement