అ‘ధన’పు భారం
► గ్యాస్ వినియోగదారులపై బాదుడు
► నెలకు అదనంగా రూ.14.64 కోట్లు చెల్లింపు
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ వంట గ్యాస్ వినియోగదారులపై అ‘ధన’పు బాదుడు తప్పడం లేదు. వీరు నెలకు రూ.14.64 కోట్లు అదనంగా భరించాల్సి వస్తోంది. వినియోగదారులు ఒక్కో సిలిండర్‌పై (డెలివరీ బాయ్స్‌కు ఇచ్చే మొత్తంతో కలిపి) రూ.52.50 చెల్లించాల్సి వస్తోంది. డీబీటీ అమలుతో సిలిండర్ ధరకు వ్యాట్ తోడవుతోంది. అంతకుముందు డొమెస్టిక్ సిలిండర్‌పై వ్యాట్ ఉండేది కాదు. ప్రభుత్వం అందించే సబ్సిడీ నగదు రూపంలో నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తుండడంతో మార్కెట్ ధర ప్రకారం నగదు చెల్లించి సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఇదీ బాదుడు తీరు
చమురు సంస్థలు గ్యాస్ ఏజెన్సీలకు డొమెస్టిక్ సిలిండర్‌ను రూ.657కు సరఫరా చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సిలిండర్‌పై ఐదు శాతం వ్యాట్ విధిస్తోంది. గ్యాస్ ఏజెన్సీలు వ్యాట్ రూపంలో వసూలు చేసే రూ.32.50 కలుపుకొని వినియోగదారులకు ఒక్కో సిలిండర్‌ను రూ.689.50కు సరఫరా చేస్తున్నాయి. మరోవైపు డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి ఒక్కో సిలిండర్‌కు రూ.20 వంతున బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఇది కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎక్కువేనని తెలుస్తోంది.
ఇదీ లెక్క...
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 27.89 లక్షల డొమెస్టిక్ వంట గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. అందులో 25.30 లక్షల మంది ఆధార్, బ్యాంక్‌లతో అనుసంధానమయ్యారు. వారికి సబ్సిడీ మొత్తం బ్యాంకు ఖాతాలో జమవుతోంది. అనుసంధానానికి దూరంగా ఉన్న వినియోగదారులు పూర్తి స్థాయి మార్కెట్ ధరను భరిస్తున్నారు.
ఈ లెక్కన మొత్తం వినియోగదారులపై నెలకు రూ.14.64 కోట్ల అదనపు భారం పడుతోంది. ఇక అనుసంధానానికి దూరంగా ఉన్న 2.59 లక్షల వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సి డీ మొత్తాన్నీ కోల్పోతున్నారు. రాయితీ పొందుతున్న వారికి కొంత ఊరట లభిస్తుండగా... ఈ అవకాశం లేని వారు ఎక్కువ మొత్తాన్ని భరించాల్సి వస్తోంది.