* దేశవ్యాప్తంగా 13,86,885 మంది గ్యాస్ రాయితీని వదులుకున్నట్లు కేంద్రం వెల్లడి
* తెలంగాణలో రాయితీ వదులుకుంది 33,777 మంది
* 2.45 లక్షల మందితో యూపీకి మొదటి స్థానం
* ఏపీలో గ్యాస్ రాయితీ వదులుకుంది 45,559 మంది.. దేశంలో 12వ స్థానం
సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకుని.. వారికి మరిన్ని రాయితీ సిలిండర్లు అందించేందుకు వీలుగా కేంద్రం ఆరంభించిన ‘గివ్ ఇట్ అప్’ కార్యక్రమంలో తెలంగాణ దేశంలో 13వ స్థానంలో నిలిచింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 33,777 మంది వినియోగదారులు తమ గ్యాస్ రాయితీని వదులకున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఇండియన్ ఆయిల్ వినియోగదారులు 14,960, హిందుస్థాన్ పెట్రోలియం 8,768, భారత్ పెట్రోలియం 10,049 మంది వినియోగదారులు రాయితీ వదులుకున్నారని వెల్లడించింది. దేశంలో 36 శాతం కుటుంబాలు ఇప్పటికీ వంటచెరకు, పిడకలపై ఆధారపడి వంట చేసుకుంటున్నాయని, దీనివల్ల ఇంట్లో పొగ చేరడంతో మహిళలు, పిల్లలు ఆనారోగ్యం బారిన పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఏటా గ్యాస్ సిలిండర్ల ద్వారా ప్రభుత్వం రూ.6 వేల రాయితీని అందిస్తోందని, మార్కెట్ ధరకు గ్యాస్ కొనుగోలు చేసుకునే అవకాశం ఉన్న సంపన్న వర్గాలు దీన్ని వదులుకునేందుకు ముందుకు రావాలని, దీనివల్ల మరింతమంది పేదలు రాయితీ సిలెండర్లు పొందే అవకాశం ఉంటుందని పదేపదే చెబుతోంది. కేంద్రం పిలుపునకు స్పందించి దేశవ్యాప్తంగా 13,86,885 మంది గ్యాస్ రాయితీని వదులుకున్నారని కేంద్ర పెట్రోలియం శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
‘గివ్ ఇట్ అప్’లో 2.45 లక్షల మంది రాయితీని వదులుకోవడంతో ఉత్తర్‌ప్రదేశ్ మొదటి స్థానంలో నిలువగా, మహారాష్ట్రలో 2.26 లక్షల మంది గ్యాస్ రాయితీ వదులుకున్నట్లు తెలిపింది. ఇక ఏపీలో 45,559 మంది వినియోగదారులు రాయితీ వదులకోగా.. అందులో ఇండియన్ ఆయిల్ వినియోగదారులు 23,318 మంది, హిందుస్థాన్ పెట్రోలియం 16,400 మంది, భారత్ పెట్రోలియం 5,841 మంది ఉన్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణ కంటే మెరుగ్గా ఏపీ 12వ స్థానంలో ఉంది.
‘గివ్ ఇట్ అప్’లో తెలంగాణకు 13వ స్థానం
Published Tue, Aug 11 2015 1:18 AM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM
Advertisement
Advertisement