Give It Up
-
అబ్బే.. వదులుకోం!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రైతుబంధు పథకం కింద ప్రభుత్వం అందజేసే పెట్టుబడి సాయాన్ని వదులుకునేందుకు జిల్లాలోని బడా రైతులు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఆర్థికంగా ఉన్న వారు పెట్టుబడి సాయం కింద అందుకునే చెక్కులను ‘గివ్ ఇట్ అప్’ ద్వారా తిరిగి ఇవ్వొచ్చని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అలా వచ్చిన నగదును రైతు సమన్వయ సమితి ఖాతాలో జమ చేసి రైతుల సంక్షేమానికి వినియోగిస్తామని స్పష్టంగా పేర్కొంది. అయితే ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ప్రజాప్రతినిధులు, పెద్ద రైతులు పలు వేదికల మీద తమకు వచ్చే చెక్కులను తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంది. జిల్లాలో 3.36లక్షల మంది జిల్లాలో మొత్తం 3,36,131 మంది రైతులు ఉన్నారు. వీరి చేతుల్లో దాదాపు 8,90,387 వ్యవసాయ భూమి ఉంది. అయితే వీరిలో ఇప్పటి వరకు ప్రభుత్వానికి పెట్టుబడి సాయాన్ని తిరిగిచ్చిన వారు కేవలం 24 మంది మాత్రమే. ఇలా ఇప్పటి వరకు ప్రభుత్వానికి ‘గివ్ ఇట్ అప్’ కింద రూ.4,06,220 విలువైన చెక్కులే అందాయి. చెక్కులు తిరిగి ఇచ్చిన ప్రజాప్రతినిధుల్లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాత్రమే ఉన్నారు. ఇప్పటి వరకు రూ.277 కోట్ల పంపిణీ... వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం కోసం పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.4వేలు చొప్పున అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు జిల్లాకు రూ.355 కోట్లు విడుదల చేసింది. ఈ విలువతో 3,40,764 చెక్కులు జారీ అయ్యాయి. మే 10 నుంచి 18 వరకు అన్ని గ్రామాల్లో చెక్కులు పంపిణీ చేసిన అధికారులు వివాదాస్పద భూములు, పార్ట్–బీలో ఉన్న భూములకు సంబంధించిన చెక్కులను మాత్రం నిలిపేశారు. ఈ మేరకు ఇప్పటి వరకు రూ.277 కోట్ల విలువైన 2,49,436 చెక్కులను పంపిణీ చేశారు. స్పందన కరువు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందజేసే ఎకరానికి రూ.4వేలు వదులుకునే విషయంలో సర్కారు విజ్ఞప్తికి జిల్లాలో స్పందన కరువైంది. పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం సాయం చేస్తోంది. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న వారు, లేదా పెద్ద రైతులు పెట్టుబడి సాయాన్ని తిరిగి ఇవ్వొచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఇలా అందే సొమ్మును రైతు సంక్షేమానికే వినియోగిస్తామని స్పష్టంగా పేర్కొంది. కానీ జిల్లాలో వదులుకునేందుకు పెద్దగా ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. జిల్లాలో మొత్తం 3,36,131 మంది రైతుల్లో కేవలం 24 మంది మాత్రమే పెట్టుబడి సాయాన్ని ఇప్పటివరకు తిరిగిచ్చారు. జిల్లాలో మొత్తం రూ.277 కోట్లు పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు కేవలం రూ.4లక్షలు మాత్రమే తిరిగి వచ్చినట్లు అధికార గణాంకాలు పేర్కొంటున్నాయి. ప్రజాప్రతినిధులు కూడా.. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు పెట్టుబడి సాయాన్ని వెనక్కి ఇచ్చే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ఎకరానికి రూ.4వేల చొప్పున వచ్చే సాయాన్ని వదులుకోవడంపై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బహిరంగసభల వేదికలపై ప్రకటనలు జారీ చేస్తున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రైతుబంధు చెక్కులు తిరిగి ఇచ్చిన 24 మందిలో అతి తక్కువ మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. చాలా వరకు సన్న, చిన్నకారు రైతులే చెక్కులను తిరిగిచ్చి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక పార్లమెంట్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఇందులో చాలా మందికి వ్యవసాయ భూములు ఉన్నాయి. అయినా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి రూ.51,200, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి రూ.32,900 విలువైన చెక్కులను తిరిగి ఇచ్చారు. మిగతా వారి నుంచి స్పందన కానరావడం లేదు. ఇక జిల్లాలో మొత్తం 26 మండలాలకు గాను ఏడు మండలాల నుంచి మాత్రమే చెక్కులు తిరిగొచ్చాయి. అత్యధికంగా జిల్లాలో కోయిల్‌కొండ మండలంలో ఎనిమిది మంది, భూత్పూరు మండలంలో ఐదుగురు, బాలానగర్, ధన్వాడ మండలాల నుంచి ముగ్గురు, అడ్డాకుల, దేవరకద్ర మండలాల నుంచి ఇద్దరు చొప్పున, మక్తల్ మండలం నుంచి ఒకరు మాత్రమే చెక్కులు తిరిగి ఇచ్చారు. -
‘గివ్ ఇట్ అప్’లో తెలంగాణకు 13వ స్థానం
* దేశవ్యాప్తంగా 13,86,885 మంది గ్యాస్ రాయితీని వదులుకున్నట్లు కేంద్రం వెల్లడి * తెలంగాణలో రాయితీ వదులుకుంది 33,777 మంది * 2.45 లక్షల మందితో యూపీకి మొదటి స్థానం * ఏపీలో గ్యాస్ రాయితీ వదులుకుంది 45,559 మంది.. దేశంలో 12వ స్థానం సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకుని.. వారికి మరిన్ని రాయితీ సిలిండర్లు అందించేందుకు వీలుగా కేంద్రం ఆరంభించిన ‘గివ్ ఇట్ అప్’ కార్యక్రమంలో తెలంగాణ దేశంలో 13వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 33,777 మంది వినియోగదారులు తమ గ్యాస్ రాయితీని వదులకున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఇండియన్ ఆయిల్ వినియోగదారులు 14,960, హిందుస్థాన్ పెట్రోలియం 8,768, భారత్ పెట్రోలియం 10,049 మంది వినియోగదారులు రాయితీ వదులుకున్నారని వెల్లడించింది. దేశంలో 36 శాతం కుటుంబాలు ఇప్పటికీ వంటచెరకు, పిడకలపై ఆధారపడి వంట చేసుకుంటున్నాయని, దీనివల్ల ఇంట్లో పొగ చేరడంతో మహిళలు, పిల్లలు ఆనారోగ్యం బారిన పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏటా గ్యాస్ సిలిండర్ల ద్వారా ప్రభుత్వం రూ.6 వేల రాయితీని అందిస్తోందని, మార్కెట్ ధరకు గ్యాస్ కొనుగోలు చేసుకునే అవకాశం ఉన్న సంపన్న వర్గాలు దీన్ని వదులుకునేందుకు ముందుకు రావాలని, దీనివల్ల మరింతమంది పేదలు రాయితీ సిలెండర్లు పొందే అవకాశం ఉంటుందని పదేపదే చెబుతోంది. కేంద్రం పిలుపునకు స్పందించి దేశవ్యాప్తంగా 13,86,885 మంది గ్యాస్ రాయితీని వదులుకున్నారని కేంద్ర పెట్రోలియం శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గివ్ ఇట్ అప్’లో 2.45 లక్షల మంది రాయితీని వదులుకోవడంతో ఉత్తర్‌ప్రదేశ్ మొదటి స్థానంలో నిలువగా, మహారాష్ట్రలో 2.26 లక్షల మంది గ్యాస్ రాయితీ వదులుకున్నట్లు తెలిపింది. ఇక ఏపీలో 45,559 మంది వినియోగదారులు రాయితీ వదులకోగా.. అందులో ఇండియన్ ఆయిల్ వినియోగదారులు 23,318 మంది, హిందుస్థాన్ పెట్రోలియం 16,400 మంది, భారత్ పెట్రోలియం 5,841 మంది ఉన్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణ కంటే మెరుగ్గా ఏపీ 12వ స్థానంలో ఉంది. -
నేను వదిలేశా.. మరి మీరో!
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, సామాజిక కార్యకర్త అమల అక్కినేని తన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీని సోమవారం స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఈ మేరకు 'గివ్ ఇట్ అప్' దరఖాస్తుపై సంతకాలు చేసిన అమల, ఆ పత్రాలను ఆయిల్ కంపెనీ ప్రతినిధికి అందజేశారు. ఆమెతోపాటు కుటుంబ సభ్యులు మరో ఐదుగురు కూడా 'గివ్ ఇట్ అప్' చేసినట్లు హైదరాబాద్ ఏరియా సేల్స్ మేనేజర్ ఆర్.ఉమాపతి తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకే ఆమె సబ్సిడీని వదులకున్నారని తెలిపారు. కాగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15 లక్షల మంది సబ్సిడీని వదులుకోగా, అందులో తెలంగాణ హెచ్‌పీసీఎల్ వినియోగదారులు 13,420 మంది ఉన్నారని తెలిపారు. -
‘గివ్ ఇట్ అప్’కు కానరాని స్పందన!
సినీతారలతో ప్రచారం చేయించేందుకు ఆయిల్ కంపెనీల కసరత్తు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ రాయితీ వదులుకున్నవారి సంఖ్య 19 వేలే హైదరాబాద్: సంపన్న వర్గాలు వంటగ్యాస్ రాయితీ వదులుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తిపై స్పందన పెద్దగా కానరావడం లేదు. కేంద్రం ఆదేశాలతో ఆయిల్ కంపెనీలు ‘గివ్ ఇట్ అప్’ పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ బంక్‌లు, గ్యాస్ దుకాణాలు, పౌరసరఫరాల శాఖ కార్యాలయాల వద్ద పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా సబ్సిడీ వదులుకున్న వారి సంఖ్య ఆశాజనకంగా లేదు. దీంతో బుధవారం నుంచి ఎంపిక చేసిన ప్రదేశాల్లో సినీతారలు, వాలంటీర్లతో ప్రచారం చేయాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. చిరంజీవి, రామ్‌చరణ్ వంటి హీరోలను ప్రచారానికి రావాల్సిందిగా కోరాలని నిర్ణయించినట్లు చమురు కంపెనీల ప్రతినిధులు తెలిపారు. సబ్సిడీలు వదులుకునేందుకు ముందుకొచ్చే వారికి ఆకర్షణీయ బహుమతులు ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు వివరించారు. ‘గివ్ ఇట్ అప్’ ప్రచారానికి ముందు తెలంగాణలో 10,347, ఆంధ్రప్రదేశ్‌లో 6,617 కలిపి మొత్తం 16,964 మంది గ్యాస్ రాయితీని వదులుకున్నారు. ఈ ప్రచార కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత వారి సంఖ్య మరో 2 వేలు మాత్రమే పెరిగినట్లు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం తెలంగాణలో 11వేలు, ఏపీలో 8వేల మంది వరకు మాత్రమే సబ్సిడీ వదులకున్నారు. -
గ్యాస్ రాయితీ వదిలించండి!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని పేదలు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి సబ్సిడీ సిలిండర్లు అందించేందుకు వీలుగా... సంపన్న వర్గాలు పొందుతున్న గ్యాస్ రాయితీని వదిలించుకొనేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. ఏటా రాయితీ సిలిండర్ల ద్వారా ఒక్కో కనెక్షన్‌పై దాదాపు రూ.6వేల వరకు సబ్సిడీ భారం పడుతోందని, సంపన్న వర్గాలు దీన్ని వదులుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తోంది. ప్రజా ప్రతినిధులు, ఉన్నతోద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారులు, ఆర్థికంగా ఉన్నవారు స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకునేలా చర్యలు చేపట్టాలని ఆయిల్ కంపెనీలు, పౌర సరఫరాల శాఖపై ఒత్తిడి తెస్తోంది. తాజాగా ‘గివ్ ఇట్ అప్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించింది. విస్తృతంగా ప్రచారం: కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆయిల్ కంపెనీలు.. ‘గివ్ ఇట్ అప్’ పేరుతో ప్రచారం మొదలెట్టాయి. మొబైల్ యాప్, ఫోన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చాయి. ఎస్సెమ్మెస్ ద్వారా అయితే... ‘గీవ్ ఇట్ అప్’ అని ఇంగ్లిష్‌లో టైప్ చేసి భారత్‌గ్యాస్ వినియోగదారులు 773829899కు, హెచ్‌పీ గ్యాస్ అయితే 9766899899కు, ఇండియన్ గ్యాస్ అయితే 8130792899కు పంపి రాయితీని వదులుకోవచ్చు. హెచ్‌పీ, భారత్, ఇండియన్ గ్యాస్ కంపెనీల మొబైల్ యాప్ ద్వారా, లేదా డిస్ట్రిబ్యూటర్ల వద్ద దరఖాస్తు చేసుకుని సబ్సిడీని వదులుకునే అవకాశం ఉందని ఆయిల్ కంపెనీల రీజనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసన్ తెలిపారు. వదులుకున్నది 17వేల మంది ఇప్పటికే కొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులు, ప్రముఖులు గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారు. ఆయిల్ కంపెనీల వద్ద ఉన్న సమాచారం మేరకు తెలంగాణలో 10,347, ఆంధ్రప్రదేశ్‌లో 6,617 మంది కలిపి 16,964 మంది రాయితీని వదులకున్నారు. ఇందులో ఒక్క హైదరాబాద్‌లోనే 3,194 మంది ఉండగా, రంగారెడ్డి జిల్లాలో మరో 2,566 మంది ఉన్నారు. రాయితీని వదులుకున్న వారిలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ, ఏపీ మంత్రులు ఈటల రాజేందర్, పరిటాల సునీత, ఎంపీలు కవిత, కేవీపీ రామచందర్‌రావు, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, పార్వతమ్మ, ఐఏఎస్‌లు కె.పున్నయ్య, రతన్ప్రకాశ్, పింగళి రామకృష్ణారావుతో పాటు ఇతర ప్రముఖుల్లో వైఎస్ భారతి, రామోజీరావు, వి.చాముండేశ్వరినాథ్ తదితరులు ఉన్నారు. వీరి తరహాలో మరింత మంది ముందుకు రావాలని ఆయిల్ కంపెనీలు విజ్ఞప్తి చేశాయి.