ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రైతుబంధు పథకం కింద ప్రభుత్వం అందజేసే పెట్టుబడి సాయాన్ని వదులుకునేందుకు జిల్లాలోని బడా రైతులు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఆర్థికంగా ఉన్న వారు పెట్టుబడి సాయం కింద అందుకునే చెక్కులను ‘గివ్ ఇట్ అప్’ ద్వారా తిరిగి ఇవ్వొచ్చని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అలా వచ్చిన నగదును రైతు సమన్వయ సమితి ఖాతాలో జమ చేసి రైతుల సంక్షేమానికి వినియోగిస్తామని స్పష్టంగా పేర్కొంది. అయితే ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ప్రజాప్రతినిధులు, పెద్ద రైతులు పలు వేదికల మీద తమకు వచ్చే చెక్కులను తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంది.
జిల్లాలో 3.36లక్షల మంది
జిల్లాలో మొత్తం 3,36,131 మంది రైతులు ఉన్నారు. వీరి చేతుల్లో దాదాపు 8,90,387 వ్యవసాయ భూమి ఉంది. అయితే వీరిలో ఇప్పటి వరకు ప్రభుత్వానికి పెట్టుబడి సాయాన్ని తిరిగిచ్చిన వారు కేవలం 24 మంది మాత్రమే. ఇలా ఇప్పటి వరకు ప్రభుత్వానికి ‘గివ్ ఇట్ అప్’ కింద రూ.4,06,220 విలువైన చెక్కులే అందాయి. చెక్కులు తిరిగి ఇచ్చిన ప్రజాప్రతినిధుల్లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాత్రమే ఉన్నారు.
ఇప్పటి వరకు రూ.277 కోట్ల పంపిణీ...
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం కోసం పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.4వేలు చొప్పున అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు జిల్లాకు రూ.355 కోట్లు విడుదల చేసింది. ఈ విలువతో 3,40,764 చెక్కులు జారీ అయ్యాయి. మే 10 నుంచి 18 వరకు అన్ని గ్రామాల్లో చెక్కులు పంపిణీ చేసిన అధికారులు వివాదాస్పద భూములు, పార్ట్–బీలో ఉన్న భూములకు సంబంధించిన చెక్కులను మాత్రం నిలిపేశారు. ఈ మేరకు ఇప్పటి వరకు రూ.277 కోట్ల విలువైన 2,49,436 చెక్కులను పంపిణీ చేశారు.
స్పందన కరువు
పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందజేసే ఎకరానికి రూ.4వేలు వదులుకునే విషయంలో సర్కారు విజ్ఞప్తికి జిల్లాలో స్పందన కరువైంది. పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం సాయం చేస్తోంది. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న వారు, లేదా పెద్ద రైతులు పెట్టుబడి సాయాన్ని తిరిగి ఇవ్వొచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఇలా అందే సొమ్మును రైతు సంక్షేమానికే వినియోగిస్తామని స్పష్టంగా పేర్కొంది. కానీ జిల్లాలో వదులుకునేందుకు పెద్దగా ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. జిల్లాలో మొత్తం 3,36,131 మంది రైతుల్లో కేవలం 24 మంది మాత్రమే పెట్టుబడి సాయాన్ని ఇప్పటివరకు తిరిగిచ్చారు. జిల్లాలో మొత్తం రూ.277 కోట్లు పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు కేవలం రూ.4లక్షలు మాత్రమే తిరిగి వచ్చినట్లు అధికార గణాంకాలు పేర్కొంటున్నాయి.
ప్రజాప్రతినిధులు కూడా..
నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు పెట్టుబడి సాయాన్ని వెనక్కి ఇచ్చే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ఎకరానికి రూ.4వేల చొప్పున వచ్చే సాయాన్ని వదులుకోవడంపై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బహిరంగసభల వేదికలపై ప్రకటనలు జారీ చేస్తున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రైతుబంధు చెక్కులు తిరిగి ఇచ్చిన 24 మందిలో అతి తక్కువ మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. చాలా వరకు సన్న, చిన్నకారు రైతులే చెక్కులను తిరిగిచ్చి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక పార్లమెంట్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఇందులో చాలా మందికి వ్యవసాయ భూములు ఉన్నాయి.
అయినా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి రూ.51,200, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి రూ.32,900 విలువైన చెక్కులను తిరిగి ఇచ్చారు. మిగతా వారి నుంచి స్పందన కానరావడం లేదు. ఇక జిల్లాలో మొత్తం 26 మండలాలకు గాను ఏడు మండలాల నుంచి మాత్రమే చెక్కులు తిరిగొచ్చాయి. అత్యధికంగా జిల్లాలో కోయిల్‌కొండ మండలంలో ఎనిమిది మంది, భూత్పూరు మండలంలో ఐదుగురు, బాలానగర్, ధన్వాడ మండలాల నుంచి ముగ్గురు, అడ్డాకుల, దేవరకద్ర మండలాల నుంచి ఇద్దరు చొప్పున, మక్తల్ మండలం నుంచి ఒకరు మాత్రమే చెక్కులు తిరిగి ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment