సాక్షి, మహబూబ్‌నగర్: ‘కరెంటు కోసం ధర్నాలు చేసే పరిస్థితి నుంచి రైతులకు విముక్తి కల్పించాం. ఎవరు ఎన్ని కేసులు వేసినా భయపడాల్సిన అవసరం లేదు. ప్రాజెక్టులు పూర్తి చేసి పాలమూరు జిల్లాలో 14 లక్షల ఎకరాలకు సాగునీరందించి తీరుతాం’ అని మంత్రి కే తారకరామారావు అన్నారు. ‘ఒక్క దేవరకద్ర నియోజకవర్గంలో కర్వెన రిజర్వాయర్ కోసం 5,700 ఎకరాల భూసేకరణకు సహకరించిన రైతులకు శిరస్సు వంచి పాదాబివందనం చేస్తున్నానని తెలిపారు. భూత్పూర్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సభలోరైతులకు మంత్రి చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో పోలీసుల బందోబస్తు నడుమ ఎరువులు పంపిణీ చేసిన ఘటనలు కాంగ్రెస్ నేతలు మర్చిపోవద్దని అన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడి యాక్ట్ ద్వారా కేసులుపెట్టి రైతుకు మేలు చేస్తున్న వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. రైతులను రుణ విముక్తులను చేయాలనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే రైతుబంధు పథకమని అన్నారు. గత ప్రభుత్వాలు రాబంధులుగా రైతులను పీక్కుతింటే.. కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధువుగా ఈ పథకం చేపట్టిందన్నారు. కేంద్రప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ సహకారం లేకపోవడంతోనే ఏకకాలంలో పంట రుణమాఫీ చేయలేకపోయామని తెలిపారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ నాయకులు రైతులకు నాలుగు రూపాయలైనా ఉచితంగా ఇచ్చారా? అని ప్రశ్నించారు. వలసలు వెళ్లినవారు సకాలంలో రాకపోయినా.. వారు ఎప్పుడొస్తే అప్పుడు చెక్కులు అందించాలని కలెక్టర్‌కు మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కౌలురైతులకు, ప్రభుత్వానికి తగాదాలు పెట్టించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని, భూ యజమానులే స్వయంగా తమకు అందిన చెక్కులో సగం డబ్బులు కౌలు రైతులకు అందించి సమస్య పరిష్కారించుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment