అమరుల స్తూపాన్ని ఆవిష్కరిస్తున్న కేటీఆర్. చిత్రంలో కవిత, జీవన్‌రెడ్డి
సాక్షి, జగిత్యాల: తమది ‘రైతుబంధు’ప్రభుత్వమని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ‘రాయితీ కాదు.. అప్పు కాదు.. నేరుగా పెట్టుబడి రూపంలో పంటకు రూ.4 వేల చొప్పున ఇచ్చి తిరిగి తీసు కోని ఏకైక ప్రభుత్వం మాదే’ అని అన్నారు. జగిత్యాల జిల్లాలో రూ.285.83 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మంగళవారం ఆయ న శంకుస్థాపన, రూ.250 కోట్ల రుణాలు పంపి ణీ చేశారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన ‘రైతు బంధు’ అవగాహన సదస్సులో మాట్లాడారు.
రైతుకు ప్రధానంగా కావాల్సింది పెట్టుబడని, అది త్వరలోనే ఇస్తున్నామన్నారు. పండించిన పంటకు మద్దతు ధర విషయంలో కూడా తమ ప్రభుత్వానికి స్పష్టత ఉందన్నారు. రైతు సమన్వయ సమితులకు రూ.500 కోట్లు కేటాయించామని, ఈ సమితులు రైతులకు మద్దతు ధర కల్పించే విషయంలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ పెట్టుబడికి సంబంధించి మే 10 నుంచి ప్రారంభం కానున్న రైతుబంధు పథకం ఊరూరా పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచిం చారు. దేశంలో ఎంతో మంది నాయకులు.. ఎన్నో ప్రభుత్వాలు పని చేసినా ఇప్పటి వరకు ఎవరికీ రాని ‘రైతుబంధు’ ఆలోచన కేవలం సీఎం కేసీఆర్‌కే సాధ్యమైందని చెప్పారు.
నాడు శాపాలు పెట్టిండ్రు
‘సమైక్య రాష్ట్రంలో నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వస్తే చీకట్లో మగ్గుతది.. బోర్ల పడ్తది అనే శాపాలు పెట్టిండు’ అని మంత్రి అన్నారు. అప్పట్లో మేం ప్రతిపక్షంలో ఉన్నం. ఎండిన కంకులు.. వరి చేలను పట్టు కుని శాసనసభకు వెళ్లినం, ధర్నాలు చేశామని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని వెంకటాపురానికి చెందిన మునిగె ఎల్లయ్య ఎరువుల కోసం క్యూ లో నిలబడి ఎండదెబ్బతో చనిపోయిన ఘటన ఇప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. అలాంటి పరిస్థితులు తెలంగాణలో రావద్దనుకున్నామని, ఇప్పుడు అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోందన్నారు.
ఇప్పుడు కరెంట్ వద్దని రోడ్డెక్కుతున్నారు
ఒకప్పుడు కరెంటు కావాలని రైతులు రోడ్డెక్కితే.. ఇప్పుడు అంత కరెంట్ వద్దని రోడ్డెక్కే పరిస్థితి నెలకొన్న విషయం వాస్తవం కాదా? అని మంత్రి ప్రశ్నించారు. అవసరం మేరకు నాణ్యమైన ఎరువులు.. విత్తనాలు రైతులకు అందిస్తున్నామన్నారు. జగిత్యాలలో మామి డికి అపార వనరులుండటంతో స్థానికంగా ఓ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం, కరీంనగర్‌లో ఐటీ టవర్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో రూ.18 వేల కోట్ల వ్యయంతో 3 లక్షల డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.
దేశంలో మొత్తం 29 రాష్ట్రాలుంటే.. తెలంగాణకు మినహా మిగిలిన 28 రాష్ట్రాలు కలిపి హౌసింగ్ పాలసీపై చేస్తున్న ఖర్చు.. మన రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూం నిర్మాణాల ఖర్చుకు సమానం కాదన్నారు. సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. పసుపు, మిర్చి, పత్తి రైతులకు పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధర అందించే విషయమై ఆలోచించాలని మంత్రిని కోరారు. స్పందించిన కేటీఆర్ సీఎం, వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment