ఆన్‌లైన్ వివరాలను సెల్‌ఫోన్‌లో పరిశీలిస్తున్న కలెక్టర్ శ్వేతామహంతి
పాన్‌గల్: ఖాతా నెంబర్లు ఉన్న ప్రతిరైతు ఆధార్ నెంబర్లు అందిస్తేనే వారికి పెట్టుబడి సాయం అందుతుందని కలెక్టర్ శ్వేతామహంతి అన్నారు. సోమవారం సాయంకాలం పాన్‌గల్ ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయం సిబ్బందితో మండలంలో రైతు ఖాతాలకు ఆధార్ నెంబర్ల అనుసంధానంపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మే 10వ తేదీ నుంచి అందించే ఎకరాకు రూ.4వేలు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రతిరైతు ఆధార్ నెంబర్లను సిబ్బందికి అందించాలన్నారు.
ఆధార్ నెంబర్లను అందించని రైతుల ఖాతాలను బీనామీగా గుర్తిస్తామన్నారు. ప్రతి రైతు ఆధార్ నెంబర్లు అందించేలా సిబ్బంది గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పెట్టుబడి సాయం అందించే విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా సిబ్బంది కృషి చేయాలన్నారు. దీంతోపాటు డబుల్ ఖాతాలు లేకుండా సరి చూసుకోవాలన్నారు. ఆధార్ నెంబర్ల ఆన్‌లైన్ అనుసంధానం వివరాలను ఆమె సెల్‌ఫోన్‌లో పరిశీలించారు. సమావేశంలో తహసీల్దార్ అలెగ్జాండర్, ఆర్‌ఐ బాల్‌రాంనాయక్, సీనియర్ అసిస్టెంట్ శంకర్, వివిధ గ్రామాల వీఆర్‌ఓలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment