
అవగాహన ర్యాలీని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చిన్నారెడ్డి, జేసీ చంద్రయ్య తదితరులు
వనపర్తి అర్బన్: జనాభా పెరుగుదలతో రానున్న రోజుల్లో అనర్థాలు ఉన్నాయని ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని తరుణి ఫంక్షన్‌హాల్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2022 వరకు మన దేశం జనాభాలో మొదటి స్థానాన్ని ఆక్రమించుకుంటుందని, 2050వరకు 150కోట్లకు చేరుకుంటుందని వివరించారు. జనాభాకు అనుగుణంగా వనరులను సృష్టించుకోలేనిమని చెప్పారు. జనాభా పెరుగుదలకు నిరక్షరాస్యతే కారణమన్నారు.
మూఢనమ్మకాలను తరిమికొట్టాలి
జనాభాకు అనుగుణంగా వనరులు పెరగడం లేదని ఇంచార్జ్ జేసీ చంద్రయ్య ఆందోళన వ్యక్తంచేశారు. సమాజంలో మహిళలను ఏ రంగంలో తీసిపోరని, మూఢనమ్మకాలతోనే ఎంతమంది ఆడపిల్లలు పుడుతున్నా మగపిల్లల కోసం వేచి చూస్తున్నారని చెప్పారు.
అందుకోసం గ్రామాల్లో ఎక్కువ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అనంతరం ఉత్తమ ప్రతిభ చూపిన పలువురు పీహెచ్‌సీ వైద్యులు, నర్సులకు నగదు పురస్కారాలు అందజేశారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏ.శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బి.కృష్ణ, వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.