దేవరకద్రలోని శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న కలెక్టర్ రొనాల్డ్‌రోస్
దేవరకద్ర: లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించొచ్చని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన రెండు నెలల ఉచిత కానిస్టేబుల్ శిక్షణ శిబిరాన్ని కలెక్టర్ సందర్శించి మాట్లాడారు. యువత తాము కోరుకునే లక్ష్యం చేరేవరకు విశ్రమించకుండా ముందుకు సాగాలన్నారు. ఢిల్లీ నుంచి వచ్చే ఎంప్లాయీమెంట్ న్యూస్ ను ప్రతి ఒక్కరు చదవాలని సూచించారు. ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కింద శిక్షణలో పాల్గొనే వారికి తప్పని సరిగా ప్లేస్‌మెంట్ వస్తుందన్నారు. గత ఏడాది 1600 మందికి శిక్షణ ఇవ్వగా 1424 మందికి ప్లేస్ మెంట్‌లు వచ్చాయని తెలిపారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చేపట్టిన మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గం నుంచే కాక ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వారికి కూడ శిక్షణలో అవకాశం కల్పించామని పెర్కొన్నారు. మార్కెట్ చైర్మన్ జట్టి నర్సింహారెడ్డి, తహసీల్దార్ చెన్నకిష్టన్న, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు కొండ శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, అంజన్‌కుమార్‌రెడ్డి, బాలగణేశ్, ధర్మేంద్ర, బాల్‌రాజు, భాస్కర్, స్వామి, ఫకీరన్న తదితరులు పాల్గొన్నారు.
‘క్వినోవా’ పరిశీలన
మహబూబ్‌నగర్ రూరల్: మహబూబ్‌నగర్ రూరల్ మండలం చౌదర్‌పల్లి గ్రామంలో పెద్దబావి కుర్మయ్య పండించిన క్వినోవా పంటను కలెక్టర్ రొనాల్డ్ రోస్ బుధవారం పరిశీలించారు. క్వినోవా పంట ఎలా పండిస్తారు.. ఎప్పుడు పండిస్తారు తదితర వివరాలను వ్యవసాయశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతుతో క్వినోవా పంట వివరాలు ఆరా తీశారు. దక్షిణౠఫ్రికాలో మాత్రమే పండించే పంటను తెలంగాణలో మొదటిసారిగా పాలమూరు జిల్లా చౌదర్‌పల్లిలో పండించడం బాగుందని పేర్కొంటూ రైతును ప్రోత్సహించిన వ్యవసాయశాఖ అధికారులను అభినందించారు. అనంతరం వ్యవసాయశాఖ అధికారులు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రైతులకు అవగాహన కల్పించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి సుచరిత, ఆత్మ పీడీ హూక్యానాయక్, ఏడీఏ వెంకటేష్, ఏఓలు హస్రత్ సుల్తానా, నాగరాజు, శాస్త్రవేత్తలు రామకృష్ణ, అర్చన, సర్పంచ్ లక్ష్మమ్మ, ఉప సర్పంచ్ బి.కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ–ఆఫీస్ అమలుపై సమీక్ష
మహబూబ్‌నగర్ న్యూటౌన్: డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ శాఖల్లో అమలు చేస్తున్న ఈ–ఆఫీస్ విధానంపై కలెక్టర్ రొనాల్డ్‌రోస్ బుధవారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ–ఆఫీస్ సేవలు ప్రారంభించిన ప్రభుత్వ శాఖలు ఇంకా అమలు చేయకపోవడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. దేవాదాయ, తూనికలు కొలతలు, జిల్లా పౌరసంబంధాల శాఖ కార్యాలయాల్లోనూ ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుచరిత, ఎన్‌ఐసీ డీఐఓ మూర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment