వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీధర్
అచ్చంపేట రూరల్ మహబూబ్‌నగర్ : ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి.. విధుల పట్ల నిర్లక్ష్యం చేసినా.. డుమ్మాలు కొట్టినా చర్యలు తప్పవ్.. అని కలెక్టర్ శ్రీధర్ హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో డీఎంహెచ్‌ఓ సుధాకర్‌లాల్ ఆధ్వర్యంలో ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో సమీక్షా నిర్వహించారు.
ఆయా కేంద్రాల్లో రోగులకు అందిస్తున్న సేవల గురించి సిబ్బందిని అడిగారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రిలో కాన్పులు జరగకూడదని, జరిగితే సిబ్బందే బాధ్యులన్నారు. చాలా చోట్ల ప్రైవేటు ఆసుపత్రుల్లో కాన్పులు జరుగుతున్నాయని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు సరక్షితమనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
గ్రామీణ స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. ఆసుపత్రి ఆవరణను శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆసుపత్రి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను నాణ్యతగా సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్‌ఎంఓ శివ, వైద్యులు, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
100శాతం ఓడీఎఫ్‌గా మార్చాలి
ఆగస్టు 15 వరకు జిల్లాను 100శాతం ఓడీఎఫ్‌గా గుర్తింపు పొందేలా చేయాలని కలెక్టర్ శ్రీధర్ కోరారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని పటేల్ ఫంక్షన్ హాల్‌లో ఎనిమిది మండలాల ఎంపీడీఓలు, ఏపీఓ, ఈఓపీఆర్‌డీ, ఈజీఎస్ సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు ఆదేశాలు జారీ చేశారు.
జూలై 31లోగా అన్ని గ్రామాల్లో 100శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావాలన్నారు. గ్రామీణ స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో ఇంటింటికి తిరిగి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేలా ప్రజలను చైతన్య పరచాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అమరేందర్, పీడీ సుధాకర్, ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీ, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment