DELIVARIES
-
భారత రైల్వే వినూత్న ఆలోచన
సాక్షి, న్యూఢిల్లీ: సరుకు రవాణా ఆదాయాన్ని పెంచేందుకు భారత రైల్వే ఓ వినూత్న ఆలోచన చేసింది. గూడ్స్ రవాణా ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను ఇకపై డొమినోస్ పిజ్జా డెలివరీ మోడల్‌ను అవలంబించన్నట్లు తెలుస్తోంది. అంటే జాతీయ రవాణాదారు ఉత్పత్తులతో పాటు, వస్తువులను నిర్థిష్టకాలంలో రవాణా చేయడమే కాకుండా ఆలస్యం జరిగితే తగిన పరిహారం కూడా రైల్యే శాఖ చెల్లించనుంది. ఈ పరిహారం గంటల ప్రాతిపదికన ఉంటుంది. వస్తువుల పంపిణీకి రైల్యే నిర్ణీత కాలపరిమితిని నిర్ణయిస్తుంది. ఆ సయయానికి వస్తువుల పంపిణీ జరగకపోతే ప్రతి గంట చొప్పున వినియోగదారులకు పరిహారం చెల్లిస్తుంది. ఉదాహరణకు ముంబై నుండి న్యూఢిల్లీకి సరుకులు రవాణాకు గరిష్టంగా 3 రోజులు (72 గంటలు) పడుతుంది. ఒకవేళ ఈ 72 గంటలలోపు సరుకులను పంపిణీ చేయకపోతే, నిర్ణీత గడువు ముగిసిన ప్రతి గంట ఆలస్యానికి రైల్వే పరిహారం చెల్లిస్తుంది. (చదవండి: ప్రైవేట్ రైళ్ల నిర్వహణకు 21 కంపెనీలు ఆసక్తి) అయితే పరిమిత రంగాలపై ఈ పద్దతిని అమలు చేయాలని, 2021 నాటికి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పూర్తైన తర్వాత క్రమంగా దీనిని అవలంభించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు దీనిని వీలైనంత త్వరగా ప్రారంభించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ తన బృందాన్ని కోరినట్లు సమాచారం. అలాగే ఇది దీర్ఘకాలంలో ఆదాయ ఉత్పత్తి పరంగా జాతీయ రవాణాదారునికి ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉక్కు, బొగ్గు, ఇనుప ఖనిజం, సిమెంట్ కంపెనీల రవాణా దృష్టిని ఆకర్షించేందుకే ఈ రవాణా విధానం ఉద్దేశించబడినట్లు తెలుస్తోంది. సరుకు రవాణా డెలివరీ మోడల్ కోసం ఇ-కామర్స్ కంపెనీలు, ఆటో సెక్టార్లతో పాటు ఫార్మా సెక్టార్లను ఆకర్షించే దిశగా కూడా రైల్వే శాఖ ప్రయత్నం చేస్తుంది. -
ప్రభుత్వాస్పత్రిలోప్రైవేటు కాన్పులు!
సాక్షి, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. కేసీఆర్ కిట్లతో ఆస్పత్రికి గర్భిణుల రాక పెరిగినప్పటికీ స్త్రీ వైద్యనిపుణులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల నియామకమైన ఒక్కగానొక్క గైనకాలజిస్టు సేవలు సరిపోక ప్రైవేట్ వైద్యులతో ప్రసవాలు జరిపిస్తున్నారు. అత్యవసరమైతే కరీంనగర్ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో నలుగురు గైనకాలజిస్టులు అవసరం ఉండగా.. మొన్నటి వరకు ఒక్కరూ అందుబాటులో లేరు. దీంతో ప్రైవేటు వైద్యులతోనే ప్రభుత్వాస్పత్రిలో ప్రసవాలు నిర్వహించాల్సిన దుస్థితి. పది రోజుల క్రితం గైనకాలజిస్టు హిందూజను నియమించినప్పటికీ మిగతా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అమ్మలాలనతో నాలుగేళ్లుగా సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా.. కేసీఆర్ కిట్‌తో రెట్టింపయ్యాయి. కానీ గైనకాలజీ వార్డులో కేవలం 30 బెడ్లు ఉండడం, ఆస్పత్రిలో రెగ్యులర్‌గా స్త్రీవైద్యులు లేకపోవడం ఇబ్బందిగా మారింది. కేసీఆర్ కిట్లతో రికార్డుస్థాయిలో ప్రసవాలు గతేడాది జూన్ 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ల పథకంతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు గనణీయంగా పెరిగాయి. జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లో 13 పీహెసీలు, సిరిసిల్లలో జిల్లాస్పత్రి ఉన్నాయి. కేసీఆర్ కిట్లు అమలుకు ఆరు నెలల ముందు 1,208 ప్రసవాలు జరుగగా.. ఆరు నెలల తర్వాత 1,621 ప్రసవాలు జరిగాయి. వాస్తవానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా ఉండగానే అప్పటి కలెక్టర్ స్మితాసబర్వాల్ చొరవతో ‘అమ్మలాలన’ ద్వారా అన్ని సర్కారు దవాఖానాల్లో ప్రసవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇక గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 2,615 ప్రసవాలు జిల్లా ఆస్పత్రిలోనే జరిగాయి. బెడ్ల కొరత ప్రసవాల కోసం ఆస్పత్రికి వస్తున్న గర్భిణులకు సరిపడేలా బెడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందజేసిన పింక్, వైట్ బెడ్షీట్లు రోజూ మారుస్తున్నారు. అయితే వాటిని తొమ్మిది నెలల క్రితం అందజేయడంతో ఇప్పుడు వస్తున్న సంఖ్యకు సరిపోవడం లేదు. ఒక్కో రోజు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో రికార్డుస్థాయిలో 23 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఒకే సారి పెద్ద సంఖ్యలో గర్భిణులు ఆస్పత్రికి రావడంతో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. ప్రసూతి వార్డుకు కనీసం వంద పడకలు అవసరం ఉండగా.. ప్రస్తుతం 30 మాత్రమే ఉన్నాయి. వెంటాడుతున్న వైద్యుల కొరత సిరిసిల్ల ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం కావడంతో ఎక్కువ సంఖ్యలో గర్భిణులు ప్రభుత్వాస్పత్రికే వస్తున్నారు. అయితే గైనకాలజిస్టులు లేకపోవడం సమస్యలు మొదలవుతున్నాయి. దీంతో మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలోనే ప్రైవేట్ వైద్యులతో ఆపరేషన్లు చేయిస్తున్నారు. కనీసం నలుగురు నుంచి ఆరుగురు స్త్రీ వైద్యనిపుణులు అవసరం ఉండగా పదిరోజుల క్రితం ఒక్కరిని నియమించారు. అత్యవసరమైనప్పుడు ప్రైవేటు వైద్యుల సేవలు వినియోగిస్తున్నారు. వైద్యులు అందుబాటులో లేని సమయంలో కరీంనగర్‌కు రెఫర్ చేస్తున్నారు. సిరిసిల్ల ఏరియా ఆస్పత్రి నుంచి జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ అయిన సిబ్బంది కొరత తీవ్రంగా వేదిస్తుంది. సిరిసిల్లకు మంజూరైన మాతాశిశు సంరక్షణ కేంద్రం పూర్తిగా అందుబాటులోకి రావాల్సి ఉంది. ఆస్పత్రిలో పడకల సంఖ్య పెంచి, వైద్యులు, మెడికల్ సిబ్బందిని నియమించాల్సి ఉంది. -
ప్రభుత్వాస్పత్రుల దశ మారాలి
అచ్చంపేట రూరల్ మహబూబ్‌నగర్ : ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి.. విధుల పట్ల నిర్లక్ష్యం చేసినా.. డుమ్మాలు కొట్టినా చర్యలు తప్పవ్.. అని కలెక్టర్ శ్రీధర్ హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో డీఎంహెచ్ఓ సుధాకర్లాల్ ఆధ్వర్యంలో ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో సమీక్షా నిర్వహించారు. ఆయా కేంద్రాల్లో రోగులకు అందిస్తున్న సేవల గురించి సిబ్బందిని అడిగారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రిలో కాన్పులు జరగకూడదని, జరిగితే సిబ్బందే బాధ్యులన్నారు. చాలా చోట్ల ప్రైవేటు ఆసుపత్రుల్లో కాన్పులు జరుగుతున్నాయని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు సరక్షితమనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. ఆసుపత్రి ఆవరణను శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆసుపత్రి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను నాణ్యతగా సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్ఎంఓ శివ, వైద్యులు, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 100శాతం ఓడీఎఫ్‌గా మార్చాలి ఆగస్టు 15 వరకు జిల్లాను 100శాతం ఓడీఎఫ్‌గా గుర్తింపు పొందేలా చేయాలని కలెక్టర్ శ్రీధర్ కోరారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని పటేల్ ఫంక్షన్ హాల్లో ఎనిమిది మండలాల ఎంపీడీఓలు, ఏపీఓ, ఈఓపీఆర్డీ, ఈజీఎస్ సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు ఆదేశాలు జారీ చేశారు. జూలై 31లోగా అన్ని గ్రామాల్లో 100శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావాలన్నారు. గ్రామీణ స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో ఇంటింటికి తిరిగి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేలా ప్రజలను చైతన్య పరచాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అమరేందర్, పీడీ సుధాకర్, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
రికార్డుస్థాయిలో ప్రసవాలు
రాయికల్ : రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆగస్టు నెలలో రికార్డుస్థాయిలో 50 ప్రసవాలు జరగడంతో మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కేక్ కట్‌చేశారు. వైద్యులు శ్రీనివాస్, చైతన్యసుధ, అవంతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్యులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆస్పత్రి చరిత్రలోనే ఒకే నెలలో రికార్డుస్థాయిలో 50 ప్రసవాలు జరిగాయని పేర్కొన్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.