జిల్లా ఆస్పత్రిలో కిక్కిరిసిన ప్రసూతి వార్డు
సాక్షి, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. కేసీఆర్ కిట్లతో ఆస్పత్రికి గర్భిణుల రాక పెరిగినప్పటికీ స్త్రీ వైద్యనిపుణులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల నియామకమైన ఒక్కగానొక్క గైనకాలజిస్టు సేవలు సరిపోక ప్రైవేట్ వైద్యులతో ప్రసవాలు జరిపిస్తున్నారు. అత్యవసరమైతే కరీంనగర్ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో నలుగురు గైనకాలజిస్టులు అవసరం ఉండగా.. మొన్నటి వరకు ఒక్కరూ అందుబాటులో లేరు.
దీంతో ప్రైవేటు వైద్యులతోనే ప్రభుత్వాస్పత్రిలో ప్రసవాలు నిర్వహించాల్సిన దుస్థితి. పది రోజుల క్రితం గైనకాలజిస్టు హిందూజను నియమించినప్పటికీ మిగతా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అమ్మలాలనతో నాలుగేళ్లుగా సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా.. కేసీఆర్ కిట్‌తో రెట్టింపయ్యాయి. కానీ గైనకాలజీ వార్డులో కేవలం 30 బెడ్లు ఉండడం, ఆస్పత్రిలో రెగ్యులర్‌గా స్త్రీవైద్యులు లేకపోవడం ఇబ్బందిగా మారింది.
కేసీఆర్ కిట్లతో రికార్డుస్థాయిలో ప్రసవాలు
గతేడాది జూన్ 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ల పథకంతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు గనణీయంగా పెరిగాయి. జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లో 13 పీహెసీలు, సిరిసిల్లలో జిల్లాస్పత్రి ఉన్నాయి. కేసీఆర్ కిట్లు అమలుకు ఆరు నెలల ముందు 1,208 ప్రసవాలు జరుగగా.. ఆరు నెలల తర్వాత 1,621 ప్రసవాలు జరిగాయి. వాస్తవానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా ఉండగానే అప్పటి కలెక్టర్ స్మితాసబర్వాల్ చొరవతో ‘అమ్మలాలన’ ద్వారా అన్ని సర్కారు దవాఖానాల్లో ప్రసవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇక గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 2,615 ప్రసవాలు జిల్లా ఆస్పత్రిలోనే జరిగాయి.
బెడ్ల కొరత
ప్రసవాల కోసం ఆస్పత్రికి వస్తున్న గర్భిణులకు సరిపడేలా బెడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందజేసిన పింక్, వైట్ బెడ్‌షీట్లు రోజూ మారుస్తున్నారు. అయితే వాటిని తొమ్మిది నెలల క్రితం అందజేయడంతో ఇప్పుడు వస్తున్న సంఖ్యకు సరిపోవడం లేదు. ఒక్కో రోజు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో రికార్డుస్థాయిలో 23 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఒకే సారి పెద్ద సంఖ్యలో గర్భిణులు ఆస్పత్రికి రావడంతో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. ప్రసూతి వార్డుకు కనీసం వంద పడకలు అవసరం ఉండగా.. ప్రస్తుతం 30 మాత్రమే ఉన్నాయి.
వెంటాడుతున్న వైద్యుల కొరత
సిరిసిల్ల ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం కావడంతో ఎక్కువ సంఖ్యలో గర్భిణులు ప్రభుత్వాస్పత్రికే వస్తున్నారు. అయితే గైనకాలజిస్టులు లేకపోవడం సమస్యలు మొదలవుతున్నాయి. దీంతో మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలోనే ప్రైవేట్ వైద్యులతో ఆపరేషన్లు చేయిస్తున్నారు. కనీసం నలుగురు నుంచి ఆరుగురు స్త్రీ వైద్యనిపుణులు అవసరం ఉండగా పదిరోజుల క్రితం ఒక్కరిని నియమించారు.
అత్యవసరమైనప్పుడు ప్రైవేటు వైద్యుల సేవలు వినియోగిస్తున్నారు. వైద్యులు అందుబాటులో లేని సమయంలో కరీంనగర్‌కు రెఫర్ చేస్తున్నారు. సిరిసిల్ల ఏరియా ఆస్పత్రి నుంచి జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ అయిన సిబ్బంది కొరత తీవ్రంగా వేదిస్తుంది. సిరిసిల్లకు మంజూరైన మాతాశిశు సంరక్షణ కేంద్రం పూర్తిగా అందుబాటులోకి రావాల్సి ఉంది. ఆస్పత్రిలో పడకల సంఖ్య పెంచి, వైద్యులు, మెడికల్ సిబ్బందిని నియమించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment