సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సిరిసిల్ల: గల్ఫ్‌లో ఉన్న రైతులకు కూడా ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన ‘రైతుబంధు పథకంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు స్థానికంగా ఉన్న రైతులకు పెట్టుబడి సాయం చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. ఈనెల 17వ తేదీ తర్వాత గల్ఫ్‌లో ఉన్న వారికి.. చిన్నచిన్న సమస్యలతో ఆగిన వారికి చెక్కులను అందిస్తామని మంత్రి వెల్లడించారు. రైతులందరికీ రైతుబంధు పథకం వర్తిస్తుందన్నారు.
ఇందులో ఆ పార్టీ, ఈ పార్టీ అనే భేదంలేదన్నారు. ఇంతపెద్ద కార్యక్రమంలో చిన్నచిన్న పొరపాట్లు ఉంటే.. సవరించేందుకు ప్రభుత్వం, యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు. ఎవరైనా గొడవలు చేసినా భయపడేది లేదని, ధర్నాలు చేయించినా.. ఆందోళన పడొద్దని మంత్రి కోరారు. అలాగే కేవలం చెక్కులు ఇచ్చి వెళ్లిపోకుండా ప్రతి రైతును కలవాలని కేటీఆర్ సూచించారు.
టీఆర్‌ఎస్ నాయకులు బస్సుల్లో రావాలి.
ఈనెల 10న హుజూరాబాద్‌లో జరిగే సీఎం సభకు జిల్లా నుంచి 25వేల మంది రైతులు రావాలని మంత్రి కోరారు. టీఆర్‌ఎస్ నాయకులు కార్లలో కాకుండా రైతులతోపాటు బస్సుల్లో రావాలన్నారు. ఏ ఊరి నాయకులు ఆ ఊరి రైతులతో కలసి రావాలని, బస్సులకు మామిడి తోరణాలు కట్టుకుని దసరా పండుగలాగా.. సంతోషంగా రావాలని సూచించారు. రెండురోజుల పాటు ఇసుక లారీలు, గ్రానైట్ లారీలను ఆపి వేయాలని ఎస్పీ రాహుల్‌హెగ్డేను కోరారు.
అందరూ క్షేమంగా ఇల్లు చేరే విధంగా టీఆర్‌ఎస్ నాయకులు బాధ్యత తీసుకోవాలన్నారు. సీఎం సభను విజయవంతం చేయాలని కోరారు. ఎండల నేపథ్యంలో చెక్కుల పంపిణీని ఉదయం, సాయంత్రం వేళల్లో చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్‌హెగ్డే, టీఆర్‌ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment