మహిళా రైతు లచ్చవ్వను ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని చెక్కు అందిస్తున్న మంత్రి కేటీఆర్
సాక్షి, కోనరావుపేట(వేములవాడ) : ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టిన రైతులకు రైతుబంధు పెట్టుబడి చెక్కులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఈనెల 17 తర్వాత గల్ఫ్‌లో ఉంటున్నవారి కుటుంబాల వివరాలు సేకరించి సరైన ఆధారాలు చూపితే చెక్కులు, పట్టా పాస్ పుస్తకాలు అందిస్తామని పేర్కొన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన రైతుబంధు కార్యక్రమంలో రైతులకు చెక్కులు, పాస్‌బుక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల, ప్రజల అభివృద్ధి కోసం చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకాన్ని విమర్శించడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందన్నారు. అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతులు పెట్టుబడి కోసం అప్పులపాలు కావద్దన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.
రాష్ట్రంలో 38 లక్షల మంది రైతులకు సంబందించిన రూ.17 వేల కోట్ల రుణాలను మాఫీ చేయడం జరిగిందన్నారు. గత పాలకుల హయాంలో జిల్లాలో అతి ముఖ్యమైన వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదని, పైగా ఈ దేవునిపై నిందలు మోపారని అన్నారు. అలాంటి ఆలయాన్ని అభివృద్ధి పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.400 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఉపాధి హామీ పనులను వ్యవసాయంతో అనుసంధానం చేస్తే అటు రైతులకు, ఇటు కూలీలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. పంటలబీమా పథకం లోపభూయిష్టంగా ఉందని, రైతు యూనిట్‌గా బీమా వర్తింపజేయాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, జెడ్పీ చైర్మన్ తుల ఉమ, కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వర్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ మల్యాల దేవయ్య, ఎంపీపీ సంకినేని లక్ష్మి, జెడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ, సింగిల్‌విండో చైర్మన్లు మోతె గంగారెడ్డి, ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, సెస్ డైరెక్టర్ తిరుపతి, మండల నాయకులు శంకర్‌గౌడ్, ఆర్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు గోగు ప్రతాపరెడ్డి, అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment