రైతుబంధును గల్ఫ్‌ కార్మికులకు కూడా వర్తింపచేయండి | Gulf Workers Demand For Implement Rythu Bandhu To Gulf Workers | Sakshi
Sakshi News home page

రైతుబంధు పథకాన్ని గల్ఫ్‌ కార్మికులకు కూడా వర్తింపచేయండి

Published Sun, Jul 14 2019 4:58 PM | Last Updated on Sun, Jul 14 2019 5:33 PM

Gulf Workers Demand For Implement Rythu Bandhu To Gulf Workers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న రైతుబంధు పథకాన్ని గల్ఫ్‌ వెళ్లిన రైతులకు కూడా వర్తింప చేయాలని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి డిమాండ్‌ చేశారు. గల్ఫ్ దేశాలలో ఉన్న సుమారు ఒక లక్షమంది సన్నకారు, చిన్నకారు రైతులకు వర్తింపచేయాలని మాజీ దౌత్యవేత్త, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి డా. బీ.ఎం.వినోద్ కుమార్, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ (ప్రవాసి సంక్షేమ వేదిక) అధ్యక్షులు మంద భీంరెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి ఆదివారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. దీనిపై గతంలోనే ముఖ్యమంత్రి కార్యాలయంలో వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే.

వలస వెళ్లిన వారిలో వ్యవసాయం దెబ్బతిని, బోర్లు తవ్వించి అప్పులపాలై పొట్ట చేతపట్టుకుని గల్ఫ్‌ దేశాలకు వెళ్లినవారే ఉన్నారని వారు అన్నారు. భూమిని నమ్ముకుని బతికిన బక్క రైతులు వ్యవసాయం దెబ్బతినడం మూలంగానే విదేశాలకు వెళ్లారని, అలాంటి వారిని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి కోరారు. ‘‘ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి రైతులందరికీ కొత్త పాసుపుస్తకాలు, ఎకరాకు పంటకు రూ.4 వేల చొప్పున పెట్టుబడిసాయం, ప్రతీ రైతుకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. కానీ విదేశాలకు వలస వెళ్లిన బడుగు రైతులకు ఈ సాయం అందక ముఖ్యంగా గల్ఫ్‌కు వెళ్లిన వలసకార్మికులు నష్టపోతున్నారు. స్వయంగా భూ యజమాని వచ్చి తమ పేరిట ఉన్న పాసుపుస్తకాన్ని, రైతుబంధు చెక్కు అందుకోవాలని, బీమా ఫారంపై సంతకం చేయాలనే నిబంధన వలసరైతుల పాలిట శాపమైంది. గల్ఫ్ దేశాల నుండి ప్రత్యేకంగా ఇందుకోసం రావాయాలంటే ఎంతో వ్యయంతో కూడుకున్న పని’’అని వారు అభిప్రాయపడ్డారు. ఈమేరకు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. 

‘‘రైతుబంధు పెట్టుబడిసాయం చెక్కులను గల్ఫ్ వెళ్లిన రైతుల ఎన్ఆర్ఓ (నాన్ రెసిడెంట్ ఆర్డినరీ) బ్యాంకు అకౌంట్లలో లేదా వారి కుటుంబ సభ్యుల అకౌంట్లలో జమచేయాలి. మండల వ్యవసాయ అధికారి లేదా తహసీల్దార్ ఎన్నారై రైతుల నుండి ఇ-మెయిల్ ద్వారా ఒక అంగీకార పత్రాన్ని తెప్పించుకోవాలి. ఎన్నారై రైతుల వ్యవహారాలను చూడటానికి వ్యవసాయ శాఖ కమిషనరేట్ లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి’’ అని పేర్కొన్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement