‘గివ్ ఇట్ అప్’కు కానరాని స్పందన!
సినీతారలతో ప్రచారం చేయించేందుకు ఆయిల్ కంపెనీల కసరత్తు
తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ రాయితీ వదులుకున్నవారి సంఖ్య 19 వేలే
హైదరాబాద్: సంపన్న వర్గాలు వంటగ్యాస్ రాయితీ వదులుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తిపై స్పందన పెద్దగా కానరావడం లేదు. కేంద్రం ఆదేశాలతో ఆయిల్ కంపెనీలు ‘గివ్ ఇట్ అప్’ పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ బంక్‌లు, గ్యాస్ దుకాణాలు, పౌరసరఫరాల శాఖ కార్యాలయాల వద్ద పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా సబ్సిడీ వదులుకున్న వారి సంఖ్య ఆశాజనకంగా లేదు. దీంతో బుధవారం నుంచి ఎంపిక చేసిన ప్రదేశాల్లో సినీతారలు, వాలంటీర్లతో ప్రచారం చేయాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి.
చిరంజీవి, రామ్‌చరణ్ వంటి హీరోలను ప్రచారానికి రావాల్సిందిగా కోరాలని నిర్ణయించినట్లు చమురు కంపెనీల ప్రతినిధులు తెలిపారు. సబ్సిడీలు వదులుకునేందుకు ముందుకొచ్చే వారికి ఆకర్షణీయ బహుమతులు ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు వివరించారు. ‘గివ్ ఇట్ అప్’ ప్రచారానికి ముందు తెలంగాణలో 10,347, ఆంధ్రప్రదేశ్‌లో 6,617 కలిపి మొత్తం 16,964 మంది గ్యాస్ రాయితీని వదులుకున్నారు. ఈ ప్రచార కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత వారి సంఖ్య మరో 2 వేలు మాత్రమే పెరిగినట్లు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం తెలంగాణలో 11వేలు, ఏపీలో 8వేల మంది వరకు మాత్రమే సబ్సిడీ వదులకున్నారు.