బండడు కష్టాలు | Aadhar Card Linkage Problems with Gas | Sakshi
Sakshi News home page

బండడు కష్టాలు

Published Fri, Jan 3 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM

Aadhar Card Linkage Problems with Gas

  • ఆధార్ అనుసంధానం, బుకింగ్ ఇబ్బందులతో గ్యాస్ వినియోగదారుల బెంబేలు
  • ధర పెరగడంతో సగం మంది వెనకడుగు
  • పల్లెలవైపు వెళ్లేందుకు జంకుతున్న ఏజెన్సీలు
  •  ఒంగోలు, న్యూస్‌లైన్: గ్యాస్ ఏజెన్సీలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గ్యాస్ బుక్ చేసుకునే దగ్గర నుంచి డెలివరీ వరకు...వినియోగదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లాలో గ్యాస్ వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను ‘న్యూస్‌లైన్’ బృందం గురువారం పరిశీలించింది. గ్యాస్ సబ్సిడీ పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డులు అనుసంధానం చేయాలని, బ్యాంకు అకౌంట్లకు కూడా ఆధార్‌ను అనుసంధానం చేయాలని ఏజెన్సీలు పట్టుబట్టాయి. దీంతో వినియోగదారులు నానా అవస్థలు పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల్లో, బ్యాంకుల్లో ఆధార్ నమోదు చేసుకున్నా.. కొందరికి సబ్సిడీ నగదు అకౌంట్లలో జమ కావడం లేదు. దీంతో వారు ఏజెన్సీల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కొందరు ఏజెన్సీల నిర్వాహకులు ఆధార్ నంబరు అనుసంధానమైతేనే గ్యాస్ బుక్ చేసుకుంటామని తేల్చి చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో గ్యాస్ బుక్ చేసుకోవాలనుకునే వారికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. నేరుగా ఫోన్ చేసి బుక్ చేసుకుందామన్నా.. ఏజెన్సీల్లో ఓ పట్టాన ఫోన్ ఎత్తకపోవడంతో మళ్లీ కార్యాలయాలకు రావాల్సిన పరిస్థితి.
     
     ఆధార్‌తో బెంబేలు...
     జిల్లాలో మొత్తం 5.67 లక్షల గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీరిలో ఇప్పటివరకు 3.20 లక్షల మంది ఆధార్‌ను గ్యాస్ కంపెనీల వద్ద అనుసంధానం చేసుకున్నారు. అంటే దాదాపు 56.43 శాతం  మాత్రమే ఏజెన్సీల వద్ద వినియోగదారుల ఆధార్ నంబర్లు కనెక్ట్ అయ్యాయి. 43.57 శాతం మంది ఇంత వరకు ఆధార్ నమోదు చేసుకోలేదు. ప్రస్తుతం ఆధార్ నమోదు చేసుకోని వారు ఏకంగా సిలిండర్ రూ. 1327.50ల చొప్పున కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే జిల్లాలో 2.47 లక్షల మంది ఆధార్ ప్రక్రియ పూర్తిచేసుకునేంత వరకు అదనపు భారం భరించక తప్పని పరిస్థితి నెలకొంది.
     
     = ఆధార్ నమోదు చేసుకున్న వారిలో కూడా 2.40 లక్షల మంది మాత్రమే బ్యాంకుల్లో అకౌంట్‌కు అనుసంధానం అయ్యారు. బ్యాంకుల్లో కూడా అనుసంధానం అయితేనే వారికి గ్యాస్ సబ్సిడీపై వస్తుంది. అంటే 2.47 లక్షలకు అదనంగా మరో 73 వేల మందికి  సబ్సిడీ ప్రస్తుతం అందే అవకాశం లేదు.
     
     = జిల్లాలో ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలకు నూతన సాఫ్ట్‌వేర్ ముంబై నుంచి లోడ్ చేస్తుండడంతో చాలా ఏజెన్సీలు పనిచేయలేదు.
     
     పెరిగిన ధరతో బెంబేలు..
     సిలిండర్లు, బిల్లులు తీసుకొని మార్కెట్లోకి వెళితే డెలివరీ తీసుకోవడానికి జనం ముందుకు రావడంలేదు. గ్యాస్ ధర పెరిగిందని డెలివరీ బాయిస్ చెబుతున్నా అంత రేటా.. అయితే మాకొద్దు అంటూ ఒంగోలు నగర పరిధిలోని శివారు కాలనీల్లోని జనం తిప్పి పంపారు. కొంతమంది అయితే తరువాత పడే డబ్బుల  సంగతేమో కానీ అంత పెద్ద మొత్తం మా దగ్గర లేదంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో సగం సిలిండర్లు తిరిగి గ్యాస్ కంపెనీలకే చేరాయి.  
     
     = ఆధార్‌తో అనుసంధానం కాని గ్యాస్ కనెక్షన్ల వారు సిలిండర్లు తీసుకుంటారో లేదో అర్థంకాక డెలివరీ ఇవ్వడం లేదు. తమకు ఫోన్‌చేసి సిలిండర్ తెమ్మంటేనే పంపుతామని చెబుతున్నారు.  గ్రామీణ ప్రాంతాలకు సిలిండర్లు డెలివరీ చేయడానికి ఏజెన్సీల వారు సైతం జంకుతున్నారు.  
     
     = జిల్లాలో యర్రగొండపాలెం, టంగుటూరు, వెలిగండ్ల, దొనకొండ, సంతనూతలపాడు, తాళ్లూరుల్లోని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలు, కనిగిరి, కొండపి హెచ్‌పీ ఏజెన్సీలు, కొనకనమిట్ల, ముండ్లమూరు భారత్ గ్యాస్ ఏజెన్సీల్లో  50 శాతం కంటే తక్కువగా గ్యాస్ బుక్ చేసుకున్నారు.
     
     = జిల్లాలోని దాదాపు 20 గ్యాస్ ఏజెన్సీలు ఫోన్‌చేసినా ఎత్తకపోతుండడంతో దూరాభారమైనా గ్యాస్ కోసం ఏజెన్సీల వద్దకు జనం వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement