
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ సిలిండర్లు అర్హులైన అందరికీ అందుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్‌కార్డుదారులు 90 లక్షలకు పైగా ఉండగా, తెల్లరేషన్‌కార్డులు ఉండి..ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న 40 లక్షల మందిని అర్హులుగా ఎంపిక చేసినట్టు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉంది. గత డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు వారం రోజుల పాటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించగా, గ్రామాలు, పట్టణాల్లో లక్షలాదిమంది దరఖాస్తు చేసుకోకపోయి ఉండొచ్చని లబ్ధిదారుల ఎంపికను బట్టి అర్థమవుతోంది.
దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని చెప్పినా, ఇప్పటివరకు రెండోవిడత దరఖాస్తుల స్వీకరణ మొదలే కాలేదు. గృహావసర గ్యాస్ కనెక్షన్లు రాష్ట్రంలో 1.24 కోట్లు ఉన్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చే ఉజ్వల గ్యాస్ కనెక్షన్లే రాష్ట్రంలో 10,75,202 ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో అర్హులందరికీ అవకాశం కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి.
ప్రజాపాలన దరఖాస్తులే ప్రాతిపదికగా...
తెల్లరేషన్‌కార్డు కలిగి ఉన్న 90 లక్షల కుటుంబాల్లో అత్యంత నిరుపేదలు 20 శాతం అనుకున్నా, కనీసం 70 లక్షల కుటుంబాలకు సబ్సిడీ గ్యాస్ పథకం ద్వారా లబ్ధి చేకూరాలి. అయితే ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులను ప్రాతిపదికగా తీసుకుంటే, రేషన్‌కార్డు కలిగిన 40 లక్షల కుటుంబాలే మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నట్టు భావించాల్సి ఉంటుంది. వారం రోజుల పాటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించగా, గ్రామాలు, పట్టణాల్లో లక్షలాదిమంది దరఖాస్తు చేసుకోనట్టు ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులను బట్టి అర్థమవుతోంది.
40 లక్షల కుటుంబాలను మాత్రమే మహాలక్ష్మి కింద ఎంపిక చేసిన ప్రభుత్వం ఇతర అర్హులైన కుటుంబాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ దరఖాస్తులు తిరస్కరిస్తే ఆ సమాచారమైనా దరఖాస్తుదారులకు రాలేదు. ప్రజాపాలన దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరోసారి ఈ పథకానికి ఎంపికయ్యే అవకాశం ఉంటుందో లేదో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కాగా ఎవరిని లబ్ధిదారులుగా గుర్తించారో వారికి కూడా ఆ సమాచారం ఇవ్వకపోవడంతో ఎవరికి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ వస్తుందో తెలియని పరిస్థితి ఉంది.
రూ. 80 కోట్లు మాత్రమే విడుదల చేసిన సర్కార్
రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 80 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)ల ఖాతాల్లో జమ చేస్తే, పథకానికి అర్హులైన వినియోగదారుల రీఫిల్లింగ్ సమయంలో సిలిండర్ డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత గ్యాస్ కంపెనీలు రీయింబర్స్ చేస్తాయి. ఇందుకోసం తొలి విడతగా రూ. 80 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.
కాగా గ్యాస్ సిలిండర్ రీఫిల్ చార్జీ రూ.955 కాగా, మహాలక్ష్మి పథకం కింద రీఫిల్లింగ్ తర్వాత రూ.455 తిరిగి వినియోగదారులకు అందుతాయి. ఈ లెక్కన 40 లక్షల గ్యాస్ కనెక్షన్ల కోసం సబ్సిడీ కింద ఒక విడతలో రూ.120 కోట్లు సబ్సిడీ కింద ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది. సగటున సంవత్సరానికి ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు అందజేస్తే సాలీనా రూ.546 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.