సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన రూ.500కే గ్యాస్ సిలిండర్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. వినియోగదారులు తమ వివరాలను (కేవైసీ) అప్‌డేట్ చేయించుకుంటే నే ఈ పథకం వర్తిస్తుందని జరిగిన ప్రచారంతో వారం రోజులుగా ప్రజలు గ్యాస్ కనెక్షన్ బుక్‌లు, ఆధార్‌కార్డులతో గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు.
ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రూ.500కే గ్యాస్ సిలిండర్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈనెల 28 నుంచి ప్రారంభం కాను న్న ‘ప్రజా పాలన’కార్యక్రమం ఎజెండాలో కూడా గ్యాస్ సిలిండర్ల అంశం లేదు. రాష్ట్రవ్యాప్తంగా కోటీ 30 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ఇందులో మహాలక్ష్మి పథకానికి అర్హులెవరనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.
ఈనెల 31లోపు కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలనే ప్రచారం సోషల్ మీడియా ద్వారా ప్రచారం సాగుతుండటంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది.
రేషన్ తరహాలోనే గ్యాస్‌కూ...
కేంద్ర ప్రభుత్వం అర్హులకు రేషన్ ఇచ్చేందుకు కార్డులో నమోదైన సభ్యులందరూ వేలిముద్రలు వేసి, ఈ–కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని ఆదేశాలిచ్చి ంది. దీంతో గత మూడు నెలలుగా రేషన్ దుకాణాల్లో ఈ కేవైసీ ప్రక్రియ సాగుతోంది. రేషన్ కార్డులోని కుటుంబ సభ్యులందరూ వేలిముద్రలు వేస్తున్నారు. రేషన్ కార్డుల్లో అర్హులను గుర్తించేందుకు కేవైసీ అప్‌డేట్ చేసినట్లుగానే వంటగ్యాస్ వినియోగదారులు సైతం కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని కేంద్రం చెప్పింది.
అయితే, ఇది కేవలం గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరుమీద ఉంది? కనెక్షన్ ఉన్న వ్యక్తి మరణించాడా లేక బదిలీ చేసుకున్నాడా? లేక కనెక్షన్ వద్దనుకుని వదిలేశాడా..అన్న అంశాలను తెలుసుకోవడానికేనని గ్యాస్ ఏజెన్సీలు చెప్పాయి. అయితే వినియోగదారులు ఈ–కేవైసీ అప్‌డేట్ చేసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ రాదనే అపోహతో గ్యాస్ కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు.
ఎలాంటి గడువు లేదు..
గ్యాస్ వినియోగదారులకు సంబంధించి కేవైసీ అప్‌డేట్‌కు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గడువును విధించలేదు. వినియోగదారుల సమగ్ర సమాచారం కోసం సేకరిస్తున్న కేవైసీ అప్‌డేట్‌కు మహాలక్ష్మి పథకానికి సంబంధం లేదు. ఈ విషయాన్ని గ్యాస్ కంపెనీల ప్రతినిధులు కూడా స్పష్టం చేశారు.
గ్యాస్ సిలిండర్ డెలివరీ కోసం ఏజెన్సీ బాయ్ ఇంటికొచ్చినప్పుడు కేవైసీ వివరాలు సేకరిస్తారని, ప్రజలెవరూ ఏజెన్సీల వద్దకు రావద్దని కోరారు. కాగా, గ్యాస్ వినియోగదారుల కేవైసీతో రాష్ట్ర ప్రభుత్వానికి గానీ, పౌరసరఫరాల శాఖకు గానీ ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఈకేవైసీ చేసుకుంటేనే ఇస్తారట..
కొత్తగా వచ్చిన ప్రభుత్వం గ్యాస్ బండ రూ. 500కే ఇస్తోందని చెప్పారు. అయితే ఈ–కేవైసీ చేసుకుంటేనే సబ్సిడీ వస్తుందన్నారు. అందుకోసమే ఒకరోజు పనికి పోకుండా గ్యాస్ కేంద్రానికి వెళ్లి ఈకేవైసీ చేయించుకుంటున్నా. కాలనీలోని అందరూ అప్‌డేట్ చేయించుకున్నారని ప్రచారం జరగడంతో నేను కూడా గ్యాస్ ఏజెన్సీ వద్దకు వచ్చాను. – ఇస్లావత్ మురళి, మంగళి కాలనీ, మహబూబాబాద్
Comments
Please login to add a commentAdd a comment