రూ.500 సిలిండర్‌కు అర్హులు 42.90 లక్షలేనా? | beneficiaries are likely to increase with issuance of new ration cards: TS | Sakshi
Sakshi News home page

రూ.500 సిలిండర్‌కు అర్హులు 42.90 లక్షలేనా?

Published Mon, Sep 16 2024 5:49 AM | Last Updated on Mon, Sep 16 2024 5:49 AM

beneficiaries are likely to increase with issuance of new ration cards: TS

ప్రజాపాలనలో గుర్తించిన అర్హులు 89.21 లక్షలు 

రాష్ట్రంలో ఉన్న రేషన్‌కార్డులు 90 లక్షలు 

కొత్త రేషన్‌కార్డుల జారీతో పాటు లబ్ధిదారులు పెరిగే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌ రాష్ట్రవ్యాప్తంగా కేవలం 42,90,246 కుటుంబాలకే అందుతోంది. మొదటివిడత ప్రజాపాలనలో భాగంగా అన్ని జిల్లాల్లో కోటి ఐదు లక్షల దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించారు. ఇందులో 89,21,269 దరఖాస్తులను కంప్యూటరైజ్‌ చేశారు. కానీ ఇందులో సగానికన్నా తక్కువ 42.90 లక్షల కుటుంబాలను మాత్రమే సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌కు అర్హులుగా ఎంపిక చేశారు.

వీరికి గత ఏప్రిల్‌ నుంచి ఆగస్టు 15 వరకు 56,46,808 గ్యాస్‌ సిలిండర్లకు ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని భరించింది. ఈ మేరకు ఆయిల్‌ కంపెనీలకు రూ.168.17 కోట్లు చెల్లించింది. రేషన్‌కార్డు (ఆహారభద్రత కార్డు) ఉన్న ప్రతీ కుటుంబానికి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని తొలుత ప్రభుత్వం చెప్పింది. ఎన్నికల్లో ఇచి్చన హామీని నెరవేర్చాలనే తొందరలో లబి్ధదారుల ఎంపికలో సరైన ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు వచ్చాయి. 

రేషన్‌కార్డు ఉన్నా... 
రాష్ట్రంలో భారత్, ఇండేన్, హెచ్‌పీలకు చెందిన కోటి 30 లక్షలకు పైగా గృహావసర (డొమెస్టిక్‌) గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. 33 జిల్లాల్లో 90 లక్షలకు పైగా రేషన్‌కార్డులు ఉన్నాయి. అత్యంత పేదరికం అనుభవిస్తున్నవారు, అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి మినహా రేషన్‌కార్డులు ఉన్న వారందరికీ గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఈ లెక్కన రేషన్‌కార్డులు ఉన్న వారంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలే అని ప్రభుత్వం భావిస్తే మహాలక్ష్మి పథకం కనీసం 70 లక్షల కుటుంబాలకైనా వర్తించాలి.

కానీ ప్రస్తుతం కేవలం 42.90 లక్షల కుటుంబాలకు మాత్రమే రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ను అందిస్తుండడాన్ని బట్టి మహాలక్ష్మి పథకానికి రేషన్‌కార్డుతో పాటు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారని స్పష్టమవుతోంది.ఈ నేపథ్యంలో తమకు కూడా రూ. 500 సిలిండర్‌ పథకాన్ని వర్తింపజేయాలని రేషన్‌కార్డుదారులంతా కోరుతున్నారు.  కాగా కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తే లబి్ధదారుల సంఖ్య మరింత పెరిగి అవకాశముంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement