Subsidized cylinders
-
‘సబ్సిడీ సిలిండర్’ ఎందరికి?
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ సిలిండర్లు అర్హులైన అందరికీ అందుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్‌కార్డుదారులు 90 లక్షలకు పైగా ఉండగా, తెల్లరేషన్‌కార్డులు ఉండి..ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న 40 లక్షల మందిని అర్హులుగా ఎంపిక చేసినట్టు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉంది. గత డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు వారం రోజుల పాటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించగా, గ్రామాలు, పట్టణాల్లో లక్షలాదిమంది దరఖాస్తు చేసుకోకపోయి ఉండొచ్చని లబ్ధిదారుల ఎంపికను బట్టి అర్థమవుతోంది. దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని చెప్పినా, ఇప్పటివరకు రెండోవిడత దరఖాస్తుల స్వీకరణ మొదలే కాలేదు. గృహావసర గ్యాస్ కనెక్షన్లు రాష్ట్రంలో 1.24 కోట్లు ఉన్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చే ఉజ్వల గ్యాస్ కనెక్షన్లే రాష్ట్రంలో 10,75,202 ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో అర్హులందరికీ అవకాశం కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజాపాలన దరఖాస్తులే ప్రాతిపదికగా... తెల్లరేషన్‌కార్డు కలిగి ఉన్న 90 లక్షల కుటుంబాల్లో అత్యంత నిరుపేదలు 20 శాతం అనుకున్నా, కనీసం 70 లక్షల కుటుంబాలకు సబ్సిడీ గ్యాస్ పథకం ద్వారా లబ్ధి చేకూరాలి. అయితే ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులను ప్రాతిపదికగా తీసుకుంటే, రేషన్‌కార్డు కలిగిన 40 లక్షల కుటుంబాలే మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నట్టు భావించాల్సి ఉంటుంది. వారం రోజుల పాటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించగా, గ్రామాలు, పట్టణాల్లో లక్షలాదిమంది దరఖాస్తు చేసుకోనట్టు ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులను బట్టి అర్థమవుతోంది. 40 లక్షల కుటుంబాలను మాత్రమే మహాలక్ష్మి కింద ఎంపిక చేసిన ప్రభుత్వం ఇతర అర్హులైన కుటుంబాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ దరఖాస్తులు తిరస్కరిస్తే ఆ సమాచారమైనా దరఖాస్తుదారులకు రాలేదు. ప్రజాపాలన దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరోసారి ఈ పథకానికి ఎంపికయ్యే అవకాశం ఉంటుందో లేదో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కాగా ఎవరిని లబ్ధిదారులుగా గుర్తించారో వారికి కూడా ఆ సమాచారం ఇవ్వకపోవడంతో ఎవరికి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. రూ. 80 కోట్లు మాత్రమే విడుదల చేసిన సర్కార్ రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 80 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)ల ఖాతాల్లో జమ చేస్తే, పథకానికి అర్హులైన వినియోగదారుల రీఫిల్లింగ్ సమయంలో సిలిండర్ డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత గ్యాస్ కంపెనీలు రీయింబర్స్ చేస్తాయి. ఇందుకోసం తొలి విడతగా రూ. 80 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. కాగా గ్యాస్ సిలిండర్ రీఫిల్ చార్జీ రూ.955 కాగా, మహాలక్ష్మి పథకం కింద రీఫిల్లింగ్ తర్వాత రూ.455 తిరిగి వినియోగదారులకు అందుతాయి. ఈ లెక్కన 40 లక్షల గ్యాస్ కనెక్షన్ల కోసం సబ్సిడీ కింద ఒక విడతలో రూ.120 కోట్లు సబ్సిడీ కింద ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది. సగటున సంవత్సరానికి ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు అందజేస్తే సాలీనా రూ.546 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. -
సబ్సిడీ సిలిండర్‌పై రూ.5.91 కోత
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలు ఎల్పీజీ వినియోగదారులకు మరోసారి ఊరటనిచ్చాయి. సబ్సిడీ ఉన్న సిలిండర్‌పై రూ.5.91, సబ్సిడీలేని సిలిండర్‌పై రూ.120.50 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ధరల తగ్గుదల నేపథ్యంలో ఢిల్లీలో 14.2 కేజీల బరువున్న సబ్సిడీ సిలిండర్ రూ.494.99కు, సబ్సిడీలేని సిలిండర్ రూ.689కు అందుబాటులోకి రానుంది. ఈ తగ్గింపు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధనం ధరల్లో తగ్గుదలతో పాటు రూపాయి మారకం విలువ బలపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. -
గ్యాస్ దందా..
జిల్లాలో జోరుగా అక్రమ వ్యాపారం దాడులు చేసినా ఆగని అక్రమం ఆరేళ్లలో 710 సిలిండర్లు స్వాధీనం 394 మందిపై కేసులు నమోదు ఆదిలాబాద్ అర్బన్ : ఖజానా నింపేందుకు సర్కారు అన్ని దారులను అన్వేషిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంటే.. జిల్లాలో జోరుగా సాగుతున్న అక్రమ గ్యాస్ దందా అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్యాస్ సిలిండర్ల అక్రమ వ్యాపారం రోజురోజేకూ పెరుగుతోంది. ఇంట్లో గృహావసరాలకు ఉపయోగించే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ కోసం వినియోగిస్తున్నారు. పట్టణాల్లో రోడ్లమీదే వెల్డింగ్ పనులకు, హోటళ్లలో, తదితర అవసరాలకు వినియోగిస్తున్నా.. అధికారులు మాత్రం అటువైపు చూడకపోవడం ఆశ్చర్యకరం. ఏడాదిపాటు అధికారులు తనిఖీలు చేసి సిలిండర్లు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినా తీరుమారడం లేదు. ఏటా గ్యాస్ అక్రమ దందా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని తనిఖీల్లో తేలినట్లు అధికారలు పేర్కొంటున్నారు. పట్టణాలతోపాటు వివిధ గ్రామీణ ప్రాంతాలకు సిలిండర్లు నల్లబజారు నుంచి తరలుతున్నాయనే విమర్శలున్నాయి. దాడులు నిర్వహించి అక్రమంగా వినియోగిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాల్సిన పౌర సరఫరాల అధికారులు ఈ విషయాన్ని ‘మామూలు’గా తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. గృహావసర కనెక్షన్లు ఇలా.. జిల్లాలో ప్రస్తుతం 3,30,747 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో దీపం కనెక్షన్లు సుమారుగా 1,29,600 ఉన్నాయి. ప్రతి వినియోగదారునికి ఏడాదికి పన్నెండు సిలిండర్లు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తోంది. సిలిండర్‌పై వినియోగదారుడికి వచ్చే రాయితీ సొమ్మును ప్రభుత్వం నేరుగా వినియోగదారుని బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. ఆధార్ వల్ల రాయితీ గ్యాస్ సిలిండర్ల అక్రమ వ్యాపారం అరికట్టవచ్చని ప్రభుత్వ భావించినా.. దానిలోని లోపాలను వెతికి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న అక్రమార్కులు గ్యాస్ దందా కొనసాగిస్తున్నారు. 2013 జూలై నెలలో జిల్లాలో 4.15 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్ అనుసంధానం చేయడంతో సుమారు 75 వేలకుపైగా కనెక్షన్లు బోగస్‌గా తేలాయి. ఇందులో దీపం కనెక్షన్లు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ మంజూరు చేస్తే సంబంధిత వ్యక్తులు గృహావసరాలకు వినియోగించకుండా వేరే వ్యక్తులకు అమ్ముకోవడం, దీనికితోడు ఒకరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ మంజూరైతే మరొకరికి సిలిండర్ ఇవ్వడంతో చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో ఆ గ్యాస్ కనెక్షన్లు సైతం బోగస్ కింద గుర్తించబడ్డాయి. ఆగని దందా.. ఇదిలా ఉంటే పట్టణాల్లో సైతం విచ్చల విడిగా రోడ్ల మీద, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లలో గృహావసర సిలిండర్లను వాడుతున్నారు. పక్కా సమయానికి గ్యాస్ ఇవ్వడం లేదని ప్రజలు ఏజెన్సీల వద్ద మొరపెట్టుకుంటే.. మరోపక్క అదే గ్యాస్‌ను చిన్న సిలిండర్లలో రీఫిల్లింగ్ చేసి అక్రమార్కులు సొ మ్ము చేసుకుంటున్నారు. ఆరేళ్లలో నిర్వహించిన దాడు ల్లో అక్రమంగా వినియోగిస్తున్న 710 సిలిండర్లు పట్టుబడ్డాయి. 394 మందిపై కేసులు నమోదు చేశా రు. స్వాధీన పర్చుకున్న సిలిండర్లను అధికారులు సంబంధిత గ్యాస్ ఏజెన్సీలకు అందజేశారు. కేసులు నమోదైన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రాయితీ గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకునేందుకు పలుచోట్ల గ్యాస్ ఏజెన్సీ ని ర్వాహకుల అండతో వ్యాపారం యథేచ్ఛగా సాగుతోం దనే విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఇకనైనా గ్యాస్ అక్రమ దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. దందాలో కొన్ని ఇలా.. పెద్ద సిలిండర్ నుంచి చిన్న చిన్న సిలిండర్లలో రీఫిల్లింగ్ చేసి బయట అధిక ధరకు అమ్మడం. (ఉదా : 15కేజీల సిలిండర్ రూ. 710కి లభిస్తే.. ఐదు కేజీల చిన్న సిలిండర్ రూ. 450 ధర ఉంది.) {V>Ò$× ప్రాంతాల్లో గ్యాస్ రీఫిల్లింగ్ ధర రూ.వెయ్యి నుంచి రూ.1200 వరకు అమ్మడం. పట్టణ ప్రాంతాల్లో ఇనుప సామగ్రి అతికించేందుకు గ్యాస్‌ను రోడ్లపైనే వాడుతుండడం. రాయితీ గ్యాస్‌ను వ్యాపారాల నిమిత్తం హోటళ్లలో వినియోగించడం. అధికారులు కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోకపోవడం. అక్రమ గ్యాస్ చట్టవిరుద్ధం గృహావసర సిలిండర్లు వ్యాపారానికి అక్రమంగా వినియోగిచడం చట్ట విరుద్ధం. అటువంటి వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నాం. రాయితీపై వచ్చే సిలిండర్లు వ్యాపారాల నిమిత్తం వినియోగించరాదు. ప్రజలు సైతం ఆ సిలిండర్లను వ్యాపార నిమిత్తం ఇయ్యొద్దు. అలా చేస్తే వారిపైనా కేసులు నమోదు చేయాల్సి వస్తుంది. అక్రమంగా వినియోగించే వారిపై దృష్టి పెట్టాం. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ గ్యాస్ అక్రమాన్ని అడ్డుకుంటున్నాం. - ఉదయ కుమార్, పౌర సరఫరాల అధికారి -
మళ్లీ నగదు బదిలీ
ఆదిలాబాద్ అర్బన్ : నగదు బదిలీ పథకం జిల్లాలో మళ్లీ అమల్లోకి రానుంది. సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లకు ఈ నెల 15 నుంచి వర్తింపజేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనరేట్ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలో మొదటగా సెప్టెంబర్ 2013 నుంచి నగదు బదిలీ పథకం అమల్లోకి వచ్చింది. పథకం అమలులో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో అప్పటి కేంద్రమంత్రివర్గం గ్యాస్ సిలిండర్‌కు ఆధార్ లింక్‌ను తొలగిస్తూ 2014 జనవరిలో నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి తొమ్మిది నెలలపాటు ప్రభుత్వం వంటగ్యాస్‌కు ఎలాంటి లింక్ పెట్టలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు నగదు బదిలీ పథకం ప్రయోగాత్మకంగా అమలు కానుంది. దేశంలో 54 జిల్లాలు ఎంపిక చేయగా.. ఇందులో తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. కొన్ని మార్పులు చేర్పులతో ఈ నెల 15 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. 3.75 లక్షల గ్యాస్ కనెక్షన్లు.. జిల్లాలో 3.75 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటివరకు 90 శాతం మంది లబ్ధిదారులు ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకున్నారు. 3,37,500 మంది గ్యాస్ కనెక్షన్లు ఆధార్‌తో అనుసంధానమై ఉన్నాయి. వీరు గతంలో నగదు బదిలీ ద్వారా సిలిండర్లు పొందిన వారే. మిగితా 37,500 కనెక్షన్లకు బ్యాంకు ఖాతాలు, ఆధార్ నంబర్లు లేవు. వీరు గ్యాస్‌కు బ్యాంకు ఖాతా అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. అనుసంధాన ప్రక్రియ ద్వారా గతంలో 75 వేలకుపైగా కనెక్షన్లను బోగస్‌గా గుర్తించారు. ప్రస్తుతం 14.2 కేజీలు ఉండే ఒక్కో సిలిండర్ ధర రూ.445.50గా ఉంది. నగదు బదిలీతో ఆ ధర రూ.975కు పెరగనుంది. మిగితా సబ్సిడీ సొమ్ము రూ.529.50 ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాల్లో జమచేయనుంది. ఇప్పుడున్న సిలిండర్ ధరనే పేదలకు భారమనుకుంటే ఇక నుంచి పూర్తి సిలిండర్ ధరను ఒకేసారి చెల్లించాలంటే పేదలకు తలకు మించిన భారం అవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆధార్ లేకున్నా గ్యాస్... సబ్సిడీ గ్యాస్ సిలిండర్లకు ఆధార్ లింక్ లేకుండా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారుని బ్యాంకు ఖాతా గ్యాస్‌కు అనుసంధానమై ఉండాలి. మరో మూడు నెలల వరకు ప్రస్తుతం కొనసాగుతున్న విధానాన్నే అమలు చేస్తారు. అనంతరం గ్యాస్‌కు బ్యాంకు ఖాతా అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. మూడు నెలల తర్వాత అనుసంధానం కానట్లయితే ఆ కనెక్షన్‌కు గ్యాస్ సరఫరా నిలిపివేస్తారని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. నగదు బదిలీ విషయమై ఆయిల్ కంపెనీల యాజమానులు, సంబంధిత అధికారులు, గ్యాస్ ఏజెన్సీలతో కలెక్టర్ ఈ నెల 13న సమావేశం నిర్వహించనున్నారు. మూడు నెలలు తీసుకోవచ్చు - వసంత్‌రావు దేశ్‌పాండే, డీఎస్వో ఆధార్, బ్యాంకు ఖాతా అనుసంధానం లేకున్నా ఇప్పుడు తీసుకుంటున్న విధంగానే మరో మూడు నెలలు గ్యాస్ తీసుకోవచ్చు. దీనిపై లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆధార్ లేకున్నా ఫర్వాలేదు. లబ్ధిదారుడి బ్యాంకు ఖాతా ఉంటే సరిపోతుంది. ఈ మూడు నెలల్లో గ్యాస్‌కు బ్యాంకు ఖాతా అనుసంధానం చేయించుకోవాలి. అనంతరం నగదు బదిలీ వర్తిస్తుంది. నగదు బదిలీకి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. -
ఈ బంధం విడిపోనుంది..
గ్యాస్‌కు ఆధార్ లింకు తొలగింపు ఒకట్రెండు రోజుల్లో ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు మార్చి 1 నుంచి పాతపద్ధతిలో సబ్సిడీ సిలిండర్లు ? సాక్షి,సిటీబ్యూరో: వంటగ్యాస్ వినియోగదారులకు శుభవార్త. గ్యాస్‌కు ఆధార్ లింకు తెగిపోనుంది. ఇన్నాళ్లు ముప్పుతిప్పులు మూడుచెరువుల నీళ్లు తాగించిన ఆధార్ లింకును తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఒకట్రెండురోజుల్లో ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు రానున్నాయి. దీంతో మార్చి1 నుంచి పాతపద్ధతిలో సబ్సిడీ ధరకే సిలిండర్లను అందజేసే అవకాశాలు ఉన్నాయని గ్యాస్ డీలర్ల సంఘం ప్రతినిధి ఒకరు సూచనప్రాయంగా తెలిపారు. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో వంటగ్యాస్‌కు ఆధార్ అనుసంధానంతో ప్రత్యక్ష ప్రయోజన పథకం(డీబీటీ) అమలు ప్రారంభమై 9 నెలలు కావొస్తున్నా..మొదటి మూడునెలలపాటు మినహాయింపు కాలంగా పరిగణించారు. దీంతో ఆధార్ అనుసంధాన ం కానీ వారికి కూడా సబ్సిడీ సిలిండర్లను సరఫరా చేశారు. గతేడాది సెప్టెంబర్ 1 నుంచి పూర్తిస్థాయి డీబీటీ అమలుకావడంతో డొమెస్ట్రిక్ వినియోగదారులకు తిప్పలు తప్పలేదు. సబ్సిడీ వంటగ్యాస్‌కు డీబీటీ పథకం వర్తింపుతో సిలిండర్ ధర సైతం నిలకడ లేకుండా మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఎల్పీజీ కనెక్షన్లను ఆధార్,బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకున్న వినియోగదారులకు సబ్సిడీ సొమ్ము నగదుగా బదిలీ దేవుడేరుగు కానీ, అనుసంధానానికి దూరంగా గల వినియోగదారులు గత ఆర్నెళ్లుగా అదనపుభారం మోయక తప్పలేదు. సబ్సిడీ నష్టం రూ.204.92 కోట్లు : జంటజిల్లాల్లో ఆధార్‌తో అనుసంధానంకాని సుమారు 27.26శాతం మంది గ్యాస్ వినియోగదారులు సబ్సిడీకి దూరమై రూ.204.92 కోట్ల వరకు నష్టపోయారు. మొత్తం మీద 28.21 లక్షల ఎల్పీజీ వినియోగదారులు ఉండగా, అందులో ఆధార్‌తో 82 శాతం, బ్యాంకుతో 72.74 శాతం మాత్రమే అనుసంధానమయ్యారు. అంటే సుమారు 9.26 శాతంమంది వినియోగదారులు తమ ఎల్పీజీని ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నప్పటికీ బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకోలేకపోయారు. దీంతో రెండిటితో అనుసంధానమైన వారికే డీబీటీ వర్తించినట్లయ్యింది. ఇదిలావుంటే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో గ్యాస్‌కు ఆధార్ అనుసంధానం, బ్యాంకుల్లో సబ్సిడీ నగదు జమకాకపోవడం..జనాగ్రహం గ్రహించిన కేంద్రం గతనెల చివర్లో సబ్సిడీవంటగ్యాస్కు ఆధార్ ముడిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు అందలేదు. ఒకట్రెండు రోజుల్లో ఆదేశాలు జారీకానుండడంతో మార్చి 1 నుంచి పాతపద్ధతిలో సబ్సిడీ ధరకు సిలిండర్లు సరఫరా కానున్నాయి.