ఈ బంధం విడిపోనుంది..
- గ్యాస్‌కు ఆధార్ లింకు తొలగింపు
- ఒకట్రెండు రోజుల్లో
- ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు
- మార్చి 1 నుంచి పాతపద్ధతిలో సబ్సిడీ సిలిండర్లు ?
సాక్షి,సిటీబ్యూరో: వంటగ్యాస్ వినియోగదారులకు శుభవార్త. గ్యాస్‌కు ఆధార్ లింకు తెగిపోనుంది. ఇన్నాళ్లు ముప్పుతిప్పులు మూడుచెరువుల నీళ్లు తాగించిన ఆధార్ లింకును తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఒకట్రెండురోజుల్లో ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు రానున్నాయి. దీంతో మార్చి1 నుంచి పాతపద్ధతిలో సబ్సిడీ ధరకే సిలిండర్లను అందజేసే అవకాశాలు ఉన్నాయని గ్యాస్ డీలర్ల సంఘం ప్రతినిధి ఒకరు సూచనప్రాయంగా తెలిపారు.
హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో వంటగ్యాస్‌కు ఆధార్ అనుసంధానంతో ప్రత్యక్ష ప్రయోజన పథకం(డీబీటీ) అమలు ప్రారంభమై 9 నెలలు కావొస్తున్నా..మొదటి మూడునెలలపాటు మినహాయింపు కాలంగా పరిగణించారు. దీంతో ఆధార్ అనుసంధాన ం కానీ వారికి కూడా సబ్సిడీ సిలిండర్లను సరఫరా చేశారు. గతేడాది సెప్టెంబర్ 1 నుంచి పూర్తిస్థాయి డీబీటీ అమలుకావడంతో డొమెస్ట్రిక్ వినియోగదారులకు తిప్పలు తప్పలేదు. సబ్సిడీ వంటగ్యాస్‌కు డీబీటీ పథకం వర్తింపుతో సిలిండర్ ధర సైతం నిలకడ లేకుండా మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఎల్పీజీ కనెక్షన్లను ఆధార్,బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకున్న వినియోగదారులకు సబ్సిడీ సొమ్ము నగదుగా బదిలీ దేవుడేరుగు కానీ, అనుసంధానానికి దూరంగా గల వినియోగదారులు గత ఆర్నెళ్లుగా అదనపుభారం మోయక తప్పలేదు.
సబ్సిడీ నష్టం రూ.204.92 కోట్లు : జంటజిల్లాల్లో ఆధార్‌తో అనుసంధానంకాని సుమారు 27.26శాతం మంది గ్యాస్ వినియోగదారులు సబ్సిడీకి దూరమై రూ.204.92 కోట్ల వరకు నష్టపోయారు. మొత్తం మీద 28.21 లక్షల ఎల్పీజీ వినియోగదారులు ఉండగా, అందులో ఆధార్‌తో 82 శాతం, బ్యాంకుతో 72.74 శాతం మాత్రమే అనుసంధానమయ్యారు. అంటే సుమారు 9.26 శాతంమంది వినియోగదారులు తమ ఎల్పీజీని ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నప్పటికీ బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకోలేకపోయారు.
దీంతో రెండిటితో అనుసంధానమైన వారికే డీబీటీ వర్తించినట్లయ్యింది. ఇదిలావుంటే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో గ్యాస్‌కు ఆధార్ అనుసంధానం, బ్యాంకుల్లో సబ్సిడీ నగదు జమకాకపోవడం..జనాగ్రహం గ్రహించిన కేంద్రం గతనెల చివర్లో సబ్సిడీవంటగ్యాస్‌కు ఆధార్ ముడిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు అందలేదు. ఒకట్రెండు రోజుల్లో ఆదేశాలు జారీకానుండడంతో మార్చి 1 నుంచి పాతపద్ధతిలో సబ్సిడీ ధరకు సిలిండర్లు సరఫరా కానున్నాయి.