ఇంటి యజమాని పేరుతోనే ఆధార్ ఫీడింగ్
భవిష్యత్తులో పన్ను చెల్లింపునకు ఆధార్ తప్పనిసరి
ఒంగోలు: గ్యాస్, రేషన్..ఇలా ప్రతి ఒక్కదానికీ ఆధార్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం తాజాగా ఇళ్లకు సైతం ఆధార్‌ను అనుసంధానం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం ఇంటి పన్ను ఎవరి పేరుపై ఉందో వారి పేరు మీదే ఆధార్ కార్డు ఉండాలి. ఆ పేరును మున్సిపల్ సర్వర్‌లో ఇంటికీ ఆధార్ ఫీడ్ చేస్తారు. అయితే క్షేత్ర స్థాయిలో దీనివల్ల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. ఇంటి పన్ను వసూలుకు సైతం ఆధార్‌ను తప్పనిసరిచేస్తారని..ఆధార్‌ను ఫీడ్ చేయకుండా ఇంటి పన్ను కట్టించుకోవద్దనే నిబంధనలు కూడా మున్సిపల్ అధికారులకు అందాయి. ప్రస్తుతం మీ-సేవ అధికారులు మాత్రం ఇంటి యజమాని ఆధార్ లేదా..అందులో ఉండే వారసులు లేదా అద్దెకుంటున్న వారి ఆధార్ నంబర్‌తో పన్నులు కట్టించుకుంటున్నారు.
సమస్యలు ఇవీ:
తాతల కాలం నుంచి చాలామంది ఒకే ఇంట్లో వారసులుగా నివాసం ఉంటున్నారు. తమ పూర్వీకుల ఆస్తే గనుక వారు దానిని తమ పేరుమీదకు మార్చుకోలేదు. ఇంటి యజమాని పేరుమీదనే పన్ను కట్టుకుంటూ వస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం పన్ను కట్టాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు కావాలంటున్నారు. అంతే కాదు ఇంటి యజమాని మరణించినా ఆయన భార్య అందులో నివాసం ఉంటుంది. భర్త ఆస్తే గనుక తానే వారసురాలిగా ఇప్పటివరకు చెలామణి అవుతూ వస్తోంది.
అయితే ఇప్పుడు ఆయన జీవించి లేడు కనుక ఆధార్ నంబర్ ఫీడ్‌చేయడం సాధ్యం కాదు. అలాగని ఆమె పేరు తీసుకునేందుకు డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వర్ అంగీకరించడం లేదు. ఆ ఇంటికి ఆధార్ ఫీడ్ చేయాలంటే ప్రస్తుతం ఆమె లీగల్ హెయిర్ సర్టిఫికెట్‌ను తహ శీల్దారు వద్ద నుంచి తీసుకొని ఆస్తిని తన పేరుమీదకు బదలాయింపు చేసుకొని ఇంటి పన్ను కట్టాలి. అయితే ఇదంతా జరగాలంటే పేదలకే కాదు...పెద్దలకూ జేబులు గుల్ల కాక తప్పని పరిస్థితి.
పలుచోట్ల అన్నదమ్ముల మధ్య ఆస్తుల పంపకాలు పెద్ద సమస్యగా ఉంటున్నాయి. ఇంటి యజమాని పేరుమీద ఆధార్ తప్పనిసరి కావడం వీరికి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో వారందరూ ఆస్తులను తమ పేర్లమీదకు మార్చుకోవడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు.
కొన్ని ఇళ్లకు సంబంధించి కోర్టు వివాదాలు నడుస్తుంటాయి. అలాంటి సమయంలో ఆ ఇంటికి ఏ ఆధార్ నంబర్‌ను ఫీడ్ చేయాలనేది కూడా సమస్యే.
కొంతమంది విదేశాల్లో నివాసం ఉంటుంటారు. అక్కడే గ్రీన్‌కార్డు హోల్డర్లుగా కూడా ఉంటుంటారు. అటువంటి వారికి స్వదేశంలో ఇప్పటివరకు ఆధార్ కార్డు లేదు. అలాంటి వారి ఇళ్లకు ఆధార్‌ను ఎలా ఫీడ్ చేయాలనేది పెద్ద సమస్యగా మారింది.
ఆధార్ జిల్లాలో దాదాపు అందరికీ తీశామని అధికారులు చెబుతున్నా ఇప్పటికీ చాలా వరకు కార్డులు పంపిణీ కాలేదు. దీనివల్ల కూడా ఆధార్ ఫీడింగ్‌లో ఇబ్బందులు తప్పవని అర్థమవుతోంది.
దీనిపై ఈ-సేవ అధికారులు మాత్రం తాము ఇంటి పన్ను కట్టే సమయంలో ఇంటి యజమాని అందుబాటులో లేకపోతే ఇంట్లో అద్దెకు ఉంటున్న వారి ఆధార్‌కార్డుతో పన్ను వసూలు చేస్తున్నామని చెబుతున్నారు.
ఇంటికీ ఆధార్
Published Mon, Dec 1 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM
Advertisement