కానుక ఇస్తామంటూనే..కత్తెర
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఒకపక్క ఆధార్ కార్డుల కోసం వివరాలు నమోదు చేసుకున్నవారు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కానీ వారికి ఆ కార్డులు రావడం లేదు. దీనికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం.. ఆ నెపాన్ని ప్రజలపైకి నెట్టేస్తోంది. ఆధార్ కార్డు లేదన్న పేరుతో వారికి రేషన్ లేకుండా చేస్తోంది. సంక్రాంతికి చంద్రన్న ఇచ్చే కానుక మాట దేవుడెరుగు.. ఈలోగానే పేద, మధ్యతరగతివారికి ఇచ్చే ‘చౌక’ సరుకులపై వేటు వేస్తోంది. ఫలితంగా జిల్లాలోని సుమారు 75 వేల మందికి ఇవ్వాల్సిన రేషన్ సరుకులపై ఈ నెల నుంచి కోత పెట్టారు.
కోత పడిందిలా..
రేషన్ భారాన్ని తగ్గించుకునే ఎత్తుగడలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేసింది. ఈ నంబర్ ఇవ్వని కార్డుదారులకు రేషన్ నిలిపివేస్తామని గత నెలలో హుకుం జారీ చేసింది. దీనికి డిసెంబర్ నెలాఖరు వరకూ గడువు ఇస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం గత నెల 15 నాటికి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం, ఆధార్ నంబర్లు లేని సుమారు 75 వేల మంది రేషన్‌కు కోత వేశారు.
ఈ తొలగింపునకు కీ రిజిస్టర్లను కీలక ప్రామాణికంగా తీసుకుంది. చౌక డిపోలవారీగా ఎన్ని కార్డులకు, ఎంతమంది లబ్ధిదారులకు, ఎంత రేషన్ ఇవ్వాలనే చిట్టానే కీ రిజిస్టర్ అని పిలుస్తారు. ప్రతి నెలా పౌర సరఫరాల శాఖ కేంద్ర కార్యాలయంలో ఈ రిజిస్టర్లు తయారవుతాయి. ఈ ప్రక్రియను ప్రతి నెలా 20లోగా పూర్తి చేసి, ఆ వివరాలు జిల్లాకు పంపిస్తారు. దాని ప్రకారం రేషన్ సరఫరా చేస్తారు. జిల్లాలోని 2643 రేషన్ దుకాణాల పరిధిలో 15,26,191 కార్డులు ఉన్నాయి. పౌర సరఫరాల శాఖ కమిషనరేట్ నుంచి గత డిసెంబర్ నెల కీ రిజిస్ట్టర్‌లో జిల్లాకు అందిన లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ కార్డులపై 43,43,582 లబ్ధిదారులున్నారు. ఒక్కో కార్డులో ఇద్దరు నుంచి ఐదుగురి వరకూ లబ్ధిదారులుంటారు. ఒక్కరు మాత్రమే ఉన్న కార్డులు కూడా కొన్ని ఉన్నాయి.
ఇదే జనవరి నెల కీ రిజిస్టర్ ప్రకారం చూస్తే 15,19,406 కార్డులున్నాయి. అంటే కేవలం ఆధార్ లేదన్న ఏకైక కారణంతో కీ రిజిస్టర్ నుంచి 6,785 రేషన్ కార్డులను తొలగించారన్నమాట. అలాగే ఈ నెల కీ రిజిస్టర్ ప్రకారం 15,19,406 కార్డులపై 42,68,847 మంది లబ్ధిదారులున్నారు. దీని ప్రకారం డిసెంబర్ నెలతో పోల్చి చూస్తే ఆధార్ లేదన్న కారణంతో మొత్తం 74,735 మందికి ఈ నెల నుంచి రేషన్ నిలిపివేస్తున్నారన్నమాట. ఫిబ్రవరి నెలకు వచ్చేసరికి ఈ నెలలో కోత పడ్డ 75 వేల మందికి అదనంగా మరో లక్ష మందికి రేషన్ సరుకులు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కేవలం ఆధార్ నంబర్ లేదనే సాకుతోనే ఈ కోతలకు సర్కారు తెగబడుతుంది. మొదట్లో ఆధార్ నంబర్ లేనివారి నుంచి.. వారు ఆధార్ నమోదు చేయించుకున్నప్పుడు వచ్చే ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌తో రేషన్ కార్డులను అనుసంధానం చేశారు. ఇప్పుడు అసలు ఆధార్ నంబర్ ఇవ్వాలంటూ ప్రభుత్వం వారిని ఆదేశించింది. అసలు ఆధార్ నంబర్ రాని వారు జిల్లాలో చాలామంది ఉన్నారు. కానీ, ప్రభుత్వం ఇదేమీ పట్టించుకోకుండా ఏకపక్షంగా రేషన్ భారం తగ్గించుకునేందుకే కొత్తగా ‘ఆధార్’ ఎత్తుగడ వేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం ఆధార్ నంబర్ ఇవ్వకపోతే, అందుకు తమను బాధ్యులను చేయడమేమిటని పేద, మధ్యతరగతి కుటుంబాలు భగ్గుమంటున్నాయి.