ఇక రేషన్ కూ ఆధార్ తప్పనిసరి!
న్యూఢిల్లీ: ఇకపై రేషన్ దుకాణాల్లో సరుకులు పొందడానికి కూడా ఆధార్ తప్పనిసరి కానుంది. లబ్ధిదారులంతా తమ రేషన్ కార్డులను ఆధార్‌తో కచ్చితంగా అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆధార్ చట్టం కింద కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల విభాగం బుధవారం ఒక నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆధార్ కార్డు లేనివారు కొత్తగా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 30 దాకా గడువిచ్చింది. అయితే ఆ తర్వాత ఆధార్ లేని వారికి సరుకులు ఇవ్వబోమని మాత్రం ఎక్కడా పేర్కొనలేదు.
జూన్ 30 తర్వాత సరుకులు పొందాలంటే రేషన్ కార్డు, ఏదేనీ మరో గుర్తింపుకార్డు(ఓటర్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, కిసాన్ ఖాతా పాస్‌బుక్, పోస్టల్ శాఖ ఇచ్చిన ఫొటోతో కూడిన అడ్రస్ కార్డు, అధికారిక లెటర్‌హెడ్‌పై గెజిటెడ్ ఆఫీసర్ లేదా తహసీల్దార్ జారీ చేసిన ఫొటోతో కూడిన గుర్తింపు ధ్రువపత్రం, మొదలైనవి) ఆధార్‌కు దరఖాస్తు చేసినట్లుగా రుజువును కూడా చూపించాలంది. ఇప్పటిదాకా దేశంలో 72 శాతం రేషన్ కార్డులు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం అయ్యాయనీ, రాష్ట్రాలు ఈ విషయంలో తాత్సారం చేస్తున్నందున వేగం పెంచడానికే ఈ నోటిఫికేషన్ ఇచ్చామని ఆహార మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.