సక్సెస్‌ఫుల్‌గా కోత
- జిల్లాలో 5.36లక్షల మందికి బియ్యం కట్
- ఆధార్ సీడింగ్ పేరుతో పేదలకు అన్యాయం
- 12వేల మందికి గ్యాస్ నిలిపివేత!
మచిలీపట్నం : ఆధార్‌ను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం సక్సెస్ ‘ఫుల్‌గా రేషన్ కోత’ విధిస్తోంది. అధార్ నంబరు ఇవ్వలేదని జిల్లావ్యాప్తంగా 5.36 లక్షల మందికి అక్టోబరు నెలలో బియ్యం మంజూరు కాలేదు. అసలు వారికి సంబంధించిన 2,140 టన్నుల బియ్యాన్ని రేషన్ షాపులకు పంపిణీ చేయలేదు. దీంతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు తమకు బియ్యం ఇవ్వడం లేదని తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు.
జిల్లాలో 11,23,944 తెల్లకార్డులు ఉన్నాయి. వీటిలో 37,10,501 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఆదార్ కార్డు నంబరు సమర్పించని 5,36,102మందిని అనర్హులుగా గుర్తించారు. ఆధార్ సీడింగ్ నూరు శాతం పూర్తయితే అనర్హుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. రేషన్‌కార్డుకు ఆధార్ నెంబరును జత చేయాలని పలువురు ఇప్పటికీ తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సమయం అయిపోయిందని కొన్ని మండలాల్లో, నాలుగు రోజుల తర్వాత రావాలని మరికొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు తిప్పుతున్నారు. దీంతో కొందరికి ఆధార్ కార్డులు ఉన్నప్పటికీ రేషన్‌కార్డుకు అనుసంధానం చేయించలేని దుస్థితి ఉంది.
రేషన్ డీలర్ల అక్రమాలకు చెక్ పడేనా!
జిల్లాలో 2,300 రేషన్ షాపులు ఉన్నాయి. బోగస్ రేషన్‌కార్డులు అధికంగా డీలర్లు తమ వద్దనే పెట్టుకుని ఇన్నాళ్లుగా బియ్యాన్ని దిగమింగారు. ఈ క్రమంలోనే తహశీల్దార్ కార్యాలయాల్లోని పౌరసరఫరాల విభాగంలో పనిచేసే సిబ్బంది కొన్ని బోగస్‌కార్డులకు ఆధార్ సీడింగ్ చేసే సమయంలో తమ నైపుణ్యాన్ని చూపి డీలర్ల వద్ద ఉన్న కార్డులు రద్దు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గ్యాస్ సరఫరా పైనా ప్రభావం
జిల్లాలో 67 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో సింగిల్ సిలిండర్ గ్యాస్ కనెక్షన్లు 6,30,927, డబుల్ సిలెండర్ కనెక్షన్లు 4,17,393, కమర్షియల్ కనెక్షన్లు 12,034 ఉన్నాయి. కొంత మందికి ఆధార్ కార్డులు అందకపోవటంతో గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ సీడింగ్ జరగలేదు. వారందరికీ గ్యాస్ సరఫరాను నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 12 వేల గ్యాస్ కనెక్షన్లను నిలిపివేసినట్లు సమాచారం.
పునరుద్ధరిస్తాం
రేషన్ కార్డు సక్రమంగా ఉండి ఆధార్ నంబరు ఇప్పటి వరకు సమర్పించని వారికి ఆధార్ సీడింగ్ జరగకపోవటంతో రేషన్ నిలిపివేయటం జరిగింది. ఆధార్ నంబరును రేషన్‌కార్డుకు అనుసంధానం చేస్తే వారికి రేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ ఎవరి పేరునైనా ఆధార్ సీడింగ్ జరగకపోతే త్వరగా రెవెన్యూ అధికారులను సంప్రదించాలి. ఇలా వచ్చిన ప్రతిపాదనలపై విచారణ చేసి అర్హులైన వారందరికీ రేషన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. రేషన్‌కార్డు, గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ సీడింగ్ తప్పనిసరి. ఆధార్ సీడింగ్ లేదనే పేరుతో గ్యాస్ సరఫరాలో ఏమైనా పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుతాం.
- సంధ్యారాణి, డీఎస్‌వో