‘చౌక’బారు కోతలు!
పేదల రేషన్‌లో కోతలు
రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల తెల్లకార్డులు
వాటిలో నమోదైన 75.57 లక్షల మంది పేర్లు తొలగింపు
ఆధార్ లేదని, వేలిముద్రలు సరిపోవడంలేదనీ రేషన్ నిరాకరణ
{పభుత్వానికి ప్రతినెలా 35 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి నిరుపేదల పొట్ట కొడుతోంది. ఆధార్ కార్డు లేదన్న కారణంగా నిరుపేదలకు బియ్యం పంపిణీ చేయడం లేదు. ఒకవేళ ఆధార్ ఉన్నా ఈ-పాస్ మిషన్లకు వేలి ముద్రలు సరిపోవడం లేదంటూ రేషన్ నిరాకరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులకు ఆధార్ నంబర్లను అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులుంటే ఆధార్ కార్డులు లేవన్న కారణంతో రేషన్ కార్డుల్లో నమోదై ఉన్నప్పటికీ 75.57 లక్షల మంది పేర్లు (యూనిట్స్) తొలగించి వారి రేషన్ నిలిపివేశారు. ఉదాహరణకు ఒక రేషన్ కార్డులో అయిదుగురు సభ్యులుంటే వారికి ఒక్కొక్కరికి అయిదు కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వారందరి పేరుతో విడివిడిగా ఆధార్ కార్డులు లేవని, సీడింగ్ కాలేదని, వేలి ముద్రలు సరిపోవడం లేదని... ఇలా రకరకాల కారణాలతో ఆ కుటుంబానికి రేషన్‌లో కోత పెడుతున్నారు. మరోవైపు ఏ ఆధారంలేని అంత్యోదయ అన్న యోజన పథకం ఉన్న వారి పరిస్థితి, అందులో వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆధార్ కార్డులు, ఈ-పాస్ మిషన్ల వేలిముద్రలతో సరిపోవడంలేదని వారికి రేషన్ తిరస్కరిస్తున్నారని తిరస్కరిస్తున్న విషయాన్ని అనేకచోట్ల రెవెన్యూ అధికారుల దృష్టికి తెచ్చినా వారు పట్టించుకోవడంలేదు.
ఈ రకంగా ప్రభుత్వానికి ప్రతి నెలా 35 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా అవుతున్నట్టు అధికారులు అంచనా వేశారు. ఆధార్ సీడింగ్, ఈ-పాస్ విధానంలో లోటుపాట్ల వస్తున్న ఫిర్యాదులను పట్టించుకోకుండా ఈ విధానం వల్ల ఏటా వెయ్యి కోట్ల రూపాయలు ఆదా అవుతుందని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. దాంతో ఆ విధానాన్ని మరింత పటిష్టవంతంగా అమలు చేయాలని సీఎం ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో నిరుపేదలు ఎదుర్కొంటున్న బాధలను పట్టించుకునే నాధుడే లేకుండా పోయారు. రాష్ట్రవ్యాప్తంగా అంత్యోదయ అన్న యోజన పథకం కింద 9.43 లక్షల కార్డులున్న వారందరికీ నెలకు 35 కిలోలు, అదేవిధంగా అన్నపూర్ణ పథకం కింద కార్డులున్న మరో 12,914 మందికి నెలకు 10 కిలోలు, 2,470 మంది చేనేత కార్మికులకు 25 కిలోల చొప్పు బియ్యం ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు కూడా ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ప్రజా పంపిణీ వ్యవస్థలో అధికారులనుంచి రేషన్ డీలర్ వరకు జరుగుతున్న అవినీతిని ప్రభుత్వం అరికట్టే సాహసం చేయకుండా కేవలం పేదలపైనే ప్రతాపం చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఒక్కో రేషన్ డీలర్‌పై ఏడుగురు పర్యవేక్షణాధికారులుగా కొనసాగుతున్నారు.వీరికి అనేక స్థాయిల్లో ఒక్కో డీలర్ నుంచి కొంత మొత్తం ముడుతుండటంతో వారు పేదల కష్టాలను పట్టించుకునే పరిస్థితి లేదన్న ఆరోపణలున్నాయి. ఈ కమీషన్లుగా చెల్లించిన మొత్తాన్ని రాబట్టుకోవాల్సి ఉన్నందున రేషన్ పంపిణీలో కోతలు పెట్టాల్సి వస్తోందని పలువురు డీలర్లు వాపోతున్నారు.
మూడు నెలల్లో సర్కారుకు రూ. 88 కోట్ల మిగులు
వచ్చే అక్టోబర్ నాటికి రాష్ట్రంలో ఉన్న అన్ని రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 7,595 రేషన్ షాపుల్లో ఈ-పాస్ అమలు చేయడంవల్ల మే, జూన్, జూలై మూడు నెలల్లో రూ.88.51 కోట్లు ఆదా అయినట్టు ఇటీవల ముఖ్యమంత్రి ప్రజా పంపిణీపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో తేల్చారు. ఈ -పాస్ అమలు చేయడం ద్వారా ఏటా వెయ్యి కోట్లు ఆదా అవుతుందని అంచనా వేశారు. ఇంకా బోగస్ రేషన్ కార్డులను ఏరివేయడానికి ఆధార్ సీడింగ్‌ను పూర్తి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇదీ పరిస్థితి..
కృష్ణా జిల్లాలో రెండు రోజులుగా నిత్యావసర సరుకుల సరఫరా నిలిచిపోయింది. చౌక ధరల దుకాణాల్లో ఈ-పాస్ మిషన్లు మొరాయించాయి. మంగళవారం విజయవాడకు ప్రత్యేక బృందాలు వచ్చి నాలుగైదు డిపోలను సందర్శించి వెనక్కి వెళ్లిపోయారు. జిల్లాలో 2,150 చౌరధరల దుకాణాలు ఉన్నాయి. వీటిలో విజయవాడ నగరంలో 255 ఉన్నాయి. డిపోల్లో ఈ-పాస్ మిషన్లు సరిగా పని చేయటం లేదు. బెంగుళూరులో సర్వర్ బ్రేక్‌డౌన్ అవటంతో ఆధార్ ట్యాలీ కావటం లేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా బుధవారం మధ్యాహ్నం నుంచి కొన్ని డిపోల్లో సర్వర్ నెమ్మదిగా పని చేయటం ప్రారంభించింది. అప్పటికే జనం వెనక్కి వెళ్లిపోయారు. దాంతో చౌకధరల దుకాణాలు ఖాళీగా దర్శనమిచ్చాయి.