మళ్లీ నగదు బదిలీ
ఆదిలాబాద్ అర్బన్ : నగదు బదిలీ పథకం జిల్లాలో మళ్లీ అమల్లోకి రానుంది. సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లకు ఈ నెల 15 నుంచి వర్తింపజేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనరేట్ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలో మొదటగా సెప్టెంబర్ 2013 నుంచి నగదు బదిలీ పథకం అమల్లోకి వచ్చింది. పథకం అమలులో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో అప్పటి కేంద్రమంత్రివర్గం గ్యాస్ సిలిండర్‌కు ఆధార్ లింక్‌ను తొలగిస్తూ 2014 జనవరిలో నిర్ణయం తీసుకుంది.
అప్పటి నుంచి తొమ్మిది నెలలపాటు ప్రభుత్వం వంటగ్యాస్‌కు ఎలాంటి లింక్ పెట్టలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు నగదు బదిలీ పథకం ప్రయోగాత్మకంగా అమలు కానుంది. దేశంలో 54 జిల్లాలు ఎంపిక చేయగా.. ఇందులో తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. కొన్ని మార్పులు చేర్పులతో ఈ నెల 15 నుంచి తిరిగి ప్రారంభం కానుంది.
3.75 లక్షల గ్యాస్ కనెక్షన్లు..
జిల్లాలో 3.75 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటివరకు 90 శాతం మంది లబ్ధిదారులు ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకున్నారు. 3,37,500 మంది గ్యాస్ కనెక్షన్లు ఆధార్‌తో అనుసంధానమై ఉన్నాయి. వీరు గతంలో నగదు బదిలీ ద్వారా సిలిండర్లు పొందిన వారే. మిగితా 37,500 కనెక్షన్లకు బ్యాంకు ఖాతాలు, ఆధార్ నంబర్లు లేవు. వీరు గ్యాస్‌కు బ్యాంకు ఖాతా అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. అనుసంధాన ప్రక్రియ ద్వారా గతంలో 75 వేలకుపైగా కనెక్షన్లను బోగస్‌గా గుర్తించారు.
ప్రస్తుతం 14.2 కేజీలు ఉండే ఒక్కో సిలిండర్ ధర రూ.445.50గా ఉంది. నగదు బదిలీతో ఆ ధర రూ.975కు పెరగనుంది. మిగితా సబ్సిడీ సొమ్ము రూ.529.50 ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాల్లో జమచేయనుంది. ఇప్పుడున్న సిలిండర్ ధరనే పేదలకు భారమనుకుంటే ఇక నుంచి పూర్తి సిలిండర్ ధరను ఒకేసారి చెల్లించాలంటే పేదలకు తలకు మించిన భారం అవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆధార్ లేకున్నా గ్యాస్...
సబ్సిడీ గ్యాస్ సిలిండర్లకు ఆధార్ లింక్ లేకుండా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారుని బ్యాంకు ఖాతా గ్యాస్‌కు అనుసంధానమై ఉండాలి. మరో మూడు నెలల వరకు ప్రస్తుతం కొనసాగుతున్న విధానాన్నే అమలు చేస్తారు. అనంతరం గ్యాస్‌కు బ్యాంకు ఖాతా అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. మూడు నెలల తర్వాత అనుసంధానం కానట్లయితే ఆ కనెక్షన్‌కు గ్యాస్ సరఫరా నిలిపివేస్తారని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. నగదు బదిలీ విషయమై ఆయిల్ కంపెనీల యాజమానులు, సంబంధిత అధికారులు, గ్యాస్ ఏజెన్సీలతో కలెక్టర్ ఈ నెల 13న సమావేశం నిర్వహించనున్నారు.
మూడు నెలలు తీసుకోవచ్చు
- వసంత్‌రావు దేశ్‌పాండే, డీఎస్‌వో
ఆధార్, బ్యాంకు ఖాతా అనుసంధానం లేకున్నా ఇప్పుడు తీసుకుంటున్న విధంగానే మరో మూడు నెలలు గ్యాస్ తీసుకోవచ్చు. దీనిపై లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆధార్ లేకున్నా ఫర్వాలేదు. లబ్ధిదారుడి బ్యాంకు ఖాతా ఉంటే సరిపోతుంది. ఈ మూడు నెలల్లో గ్యాస్‌కు బ్యాంకు ఖాతా అనుసంధానం చేయించుకోవాలి. అనంతరం నగదు బదిలీ వర్తిస్తుంది. నగదు బదిలీకి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.