సంక్రాంతి తర్వాత 10 లక్షల కొత్త రేషన్‌కార్డులిస్తాం
వీటితో ప్రభుత్వంపై రూ.956 కోట్ల అదనపు భారం
శాసనమండలిలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి తరువాత కొత్త తెల్లరేషన్ కార్డులు మంజూరు చేస్తామని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. దాదాపు 10 లక్షల కొత్త రేషన్‌కార్డులను జారీ చేస్తామని, తద్వారా 31 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. దీంతో ఏటా రూ.956 కోట్ల మేరకు ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని చెప్పారు. రేషన్‌కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారని సోమవారం శాసనమండలిలో సభ్యులు కోదండరాం, మీర్జా రియాజుల్ హసన్ అడిగిన ప్రశ్నకు మంత్రి పైవిధంగా బదులిచ్చారు.
కొత్త కార్డులకు ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేను కూడా ఆధారంగా చేసుకుంటామని చెప్పారు. తెల్ల రేషన్‌కార్డులకు చిప్‌ను జోడిస్తామని తద్వారా స్మార్ట్‌కార్డులను జారీచేయబోతున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో అదనపు పేర్ల నమోదుకు మీ సేవ కేంద్రం ద్వారా గత పదేళ్లుగా వచ్చిన 18 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని తన నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియమించిన విషయాన్ని మంత్రి వివరించారు.
ఉపసంఘం పలుమార్లు సమావేశమై చర్చించిందన్నారు. కార్డుల మంజూరు ప్రక్రియలో సుప్రీంకోర్టుకు సక్సేనా కమిటీ సమర్పించిన సిఫారసులను పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. అలాగే రేషన్‌కార్డుల జారీ ప్రక్రియలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల నుంచి సేకరించిన సూచనలను కూడా ఉప సంఘం పరిగణనలోకి తీసుకున్నట్లు ఉత్తమ్ తెలిపారు. వీటన్నింటినీ అధ్యయనం చేసిన ఉపసంఘం కొత్త రేషన్ కార్డుల మంజూరీకి అర్హతా ప్రమాణాలు నిర్ణయిస్తూ కేబినెట్‌కు నివేదిక సమర్పిస్తుందని చెప్పారు.
దొడ్డుబియ్యం పక్కదారి నిజమే..
రేషన్‌షాపుల్లో ఇస్తున్న దొడ్డుబియ్యం పక్కదారి పడుతున్న మాట వాస్తవమేనని మంత్రి ఉత్తమ్‌కుమార్ అంగీకరించారు. ప్రజలెవ్వరూ దొడ్డుబియ్యం వినియోగించడం లేదని, దాంతో పక్కదారి పడుతోంన్నారు. అందుకే ఇకపై సన్నబియ్యం మాత్రమే సరఫరా చేస్తామని ప్రకటించారు. నిత్యావసర వస్తువుల పంపిణీ ఆలోచన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణాల డీలర్ల భర్తీ ప్రక్రియను త్వరలోనే చేపడతామన్నారు.
2.46 లక్షల కార్డులు రద్దు...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలో 91,68,231 రేషన్ కార్డులు ఉండేవని, మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3.38 కోట్లని ఉత్తమ్‌కుమార్ సభకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఇక్కడి నుంచి ఏపీకి చెందిన వారు తమ ప్రాంతాలకు వెళ్లడంతో 2,46,324 కార్డులు రద్దయ్యాయని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక మొత్తం 89,21,907 తెల్ల కార్డులు ఉన్నాయని, 2.7 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో 2016 నుంచి 2023 వరకు కొత్తగా 20.69 లక్షల మంది లబ్ధిదారులకు 6,47,479 ఆహార భద్రతా కార్డులు మంజూరు చేశారని, అదే సమయంలో 5,98,000 ఆహార భద్రతా కార్డులు తొలగించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత పదేళ్లలో మంజూరు చేసిన తెల్ల రేషన్ కార్డులు 49 వేలు మాత్రమేనని, వీటి లబ్ధిదారులు 86 వేల మంది ఉన్నారని ఉత్తమ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment